పాలన చేతకాకపోతే రాజీనామా చేయండి

ABN , First Publish Date - 2022-05-21T06:45:46+05:30 IST

నియోజకవర్గలో ప్రధానమైన భీమునిపట్నం- నర్సీపట్నం రోడ్డులో ఎన్‌డీబీ నిధులతో ప్రారంభించిన పనులు పూర్తిచేయించడం చాతకాని అధికార పార్టీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకులు రహదారి దుస్థితిపై ధర్నా చేస్తామని ప్రకటించడం విడ్డూరంగా ఉందని చోడవరం మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ఎద్దేవా చేశారు.

పాలన చేతకాకపోతే రాజీనామా చేయండి
విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే రాజు


బీఎన్‌ రోడ్డు బాగు చేయించ లేక వైసీపీ ధర్నా నాటకాలు

ఎమ్మెల్యే ధర్మశ్రీ, అధికార పార్టీ నేతలకు  మాజీ ఎమ్మెల్యే రాజు సవాల్‌

చోడవరం, మే 20 : నియోజకవర్గలో ప్రధానమైన భీమునిపట్నం- నర్సీపట్నం రోడ్డులో ఎన్‌డీబీ నిధులతో ప్రారంభించిన పనులు పూర్తిచేయించడం చాతకాని అధికార పార్టీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకులు రహదారి దుస్థితిపై ధర్నా చేస్తామని ప్రకటించడం విడ్డూరంగా ఉందని చోడవరం మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ఎద్దేవా చేశారు. శనివారం ఆయన ఇక్కడి విలేఖర్లతో మాట్లాడుతూ బీఎన్‌ రోడ్డు అత్యంత దారుణంగా మారిందని, ఈ రోడ్డు పనులు మూడేళ్లయినా పూర్తి చేయించలేకపోవడం ఎమ్మెల్యే వైఫల్యం కాదా.. అని  ప్రశ్నించారు. గతంలో రోడ్ల దుస్థితిపై ఆందోళనలు, పాదయాత్రలు  చేసిన ప్రస్తుత ఎమ్మెల్యే, ఇప్పుడు రహదారులు ఇంత ఘోరంగా ఉన్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. ‘రోడ్డు పనులు నిలిచిపోవడానికి కారణం మీ ప్రభుత్వం నిధులు ఇవ్వలేక పోవడమేనని, చేతనైతే మీ ప్రభుత్వంపై పోరాడి నిధులు తెచ్చి రోడ్డు పనులు పూర్తి చేయించాలని’ సవాల్‌ విసిరారు. అధికార పక్షంలో ఉండి రోడ్లపై  ధర్నాలు చేసి, ప్రజల దృష్టి మళ్లించాలనుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రోడ్డు పనులు ఎందుకు పూర్తి చేయడం లేదని, ప్రజా సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన అధికార పార్టీ నేతలను నిలదీశారు. అధికార పార్టీలో జిల్లాలో కీలక నేతగా ఉన్న కరణం ధర్మశ్రీ రోడ్డు పనులు చేయించడం చేతకాలేదని ఒప్పుకొని ఆ తరువాత ధర్నాలు చేయాలన్నారు. రోడ్డు దుస్థితిపై ధర్నాలు చేయాలనుకునే వైసీపీ నాయకులు ముందు తాడేపల్లిలో సీఎం నివాసం ముందు ధర్నా చేయాలని సూచించారు. ప్రజల సమస్యలను పక్కదారి పట్టించే ఇలాంటి ఎత్తులకు అధికార పార్టీ నాయకులు స్వస్తి చెప్పకుంటే వారి తీరుకు వ్యతిరేకంగా తాము ధర్నా చేస్తామని రాజు హెచ్చరించారు. ఈ  సమావేశంలో టీడీపీ మండల నాయకులు బొడ్డేడ గంగాధర్‌, ముడుసు గోవింద్‌, కోట సత్యనారాయణ, తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు దేవర రవికుమార్‌ పాల్గొన్నారు.


Updated Date - 2022-05-21T06:45:46+05:30 IST