ప్రైవేటు ఫీజు కట్టలేకపోతే సర్కారీ బడికి

ABN , First Publish Date - 2020-06-04T09:30:22+05:30 IST

ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఫీజులు కట్టలేని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని రాష్ట్ర పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఆర్‌.కాంతారావు సూచించారు. కనీసం

ప్రైవేటు ఫీజు కట్టలేకపోతే సర్కారీ బడికి

  • రెండేళ్లు అక్కడ చదివితే నష్టమేంటి?
  • పిల్లల తల్లిదండ్రులంతా ఆలోచించాలి
  • సమాచారం అడిగితే భయమెందుకు?
  • దీనిపై కోర్టుకెళ్లడం యాజమాన్యాల హక్కు
  • ఫీజుల కోసం తల్లిదండ్రులపై ఒత్తిడి వద్దు
  • మాది రెగ్యులేటరీ బాడీ.. ఇబ్బంది పెట్టం
  • ‘ఆంగ్లం’పై సుప్రీంకోర్టుకెళితే తప్పేంటి?
  • పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ
  • కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ కాంతారావు వ్యాఖ్య


అమరావతి, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఫీజులు కట్టలేని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని రాష్ట్ర పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఆర్‌.కాంతారావు సూచించారు. కనీసం రెండేళ్ల పాటు సర్కారీ బడుల్లో పిల్లలు చదివించినంత మాత్రాన వచ్చే నష్టమేమీ ఉండదని, దీనిపై తల్లిదండ్రులు ఆలోచించాలని కోరారు. బుధవారం విజయవాడలోని సమగ్ర శిక్షా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రైవేట్‌ పాఠశాలలకు సంబంధించిన వివిధ అంశాలపై సమాచారాన్ని తెలుసుకునేందుకు నోటిఫికేషన్‌ జారీచేసి వివరాలను ఆన్‌లైన్‌ పంపమంటే  కొన్ని యాజమాన్యాలు అనవసరపు రాద్ధాంతం చేస్తున్నాయి. పాఠశాలలు, విద్యా సంస్థల సమాచారాన్ని తెలుసుకునే హక్కు కమిషన్‌కు ఉంది. ఈ విషయమై కొందరు కోర్టులకు వెళ్లడమే కాకుండా యాజమాన్యాల నుంచి కొంత మొత్తం డబ్బులు వసూలు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. అలా వసూలు చేసిన డబ్బును తల్లిదండ్రులు, విద్యార్థులపై ఖర్చుపెడితే మంచిది’’ అని వ్యాఖ్యానించారు. కమిషన్‌పై కొందరు అసత్యప్రచారం చేస్తున్నారన్నారు. ‘‘మాది రెగ్యులేటరీ కమిషన్‌ మాత్రమే. ఎవరినీ ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదు. అయినా కొందరు అపోహలను కల్పిస్తూ కోర్టును ఆశ్రయించారు.


వారికి ఆ హక్కు ఉంది. పిల్లలకు ఉత్తమమైన విద్యను అందించే దిశలోనే చర్యలు ఉంటాయి. ఎవరినీ ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంలేదు’’ అని కాంతారావు తెలిపారు. ఆంగ్ల మాధ్యమాన్ని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టాలన్నది ప్రభుత్వ విధాన నిర్ణయమని, ప్రభుత్వానికి ఆ హక్కు  ఉందన్నారు. ‘‘ఇంగ్లీషు మీడియం కోసం ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టేస్తే ... దాన్ని సుప్రీంకోర్టులో చాలెంజ్‌ చేసే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది. దాన్ని ఎవరూ తప్పుపట్టలేరు. ఎవరి అభిప్రాయాలు ఎలాఉన్నా కూడా చివరికి సుప్రీంకోర్టు చెప్పిందే చేయవలసి ఉంటుంది’’ అని అన్నారు. కమిషన్‌ నోటిఫికేషన్‌ ఇచ్చిన్నప్పటికీ, కొంతమంది ఫీజులు పెంచారన్నారు. ఫీజులకోసం తల్లిదండ్రులపై యాజమాన్యాలు ఒత్తిడి తగ్గించాలన్నారు. పాఠశాలవిద్యలో ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించడం అభిలషణీయం కాదని జస్టిస్‌ కాంతారావు అన్నారు. కమిషన్‌ జారీచేసిన నోటిఫికేషన్‌ ప్రకారం ఆయా పాఠశాలల పూర్తి వివరాలు సేకరించి, వాటి ప్రామాణికతను అంతర్జాలం ద్వారా విద్యార్థులు, తల్లిదండ్రులకు అందుబాటులో ఉంచుతామని కమిషన్‌ వైస్‌చైౖర్‌పర్సన్‌ విజయశారదారెడ్డి, సెక్రటరీ ఆలూరు సాంబశివారెడ్డి అన్నారు. ‘అమ్మఒడి’ వంటి కార్యక్రమాన్ని అమలు చేస్తున్న రాష్ట్రం మరొకటి లేదన్నారు. పేద, గొప్ప అనేది లేకుండా అందరికీ నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని వారు తెలిపారు.

Updated Date - 2020-06-04T09:30:22+05:30 IST