కీలకపత్రాలు మాయమైనా..చర్యలేవి?

ABN , First Publish Date - 2021-04-17T07:26:35+05:30 IST

లింగాకర్షక బుట్టల కుంభకోణంలో తవ్వినకొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి.

కీలకపత్రాలు మాయమైనా..చర్యలేవి?

  • వ్యవసాయ కమిషనరేట్‌లోనే డెలివరీ చలాన్లు గల్లంతు
  • తమ సంతకాలు ఫోర్జరీ అయినా పట్టించుకోని డీఏవోలు
  • విజిలెన్స్‌ అధికారుల విచారణలో వెలుగుచూసిన లీలలు
  • లింగాకర్షక బుట్టల అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): లింగాకర్షక బుట్టల కుంభకోణంలో తవ్వినకొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. ఏడాదికాలంగా నానుతున్న విజిలెన్స్‌ విచారణ ఇటీవల పూర్తయింది. అధికారులు సమగ్ర నివేదికను ఏసీబీ డీజీపీ డా.జె.పూర్ణచందర్‌రావుకు సమర్పించగా... డీజీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక వెళ్లినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. సీఎస్‌ నుంచి వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శికి ఎలాంటి ఆదేశాలు వస్తాయనేది చర్చనీయాంశంగా మారింది. పత్తి పంటను గులాబీరంగు పురుగు నుంచి రక్షించేందుకు 2019-20లో రైతులకు 100 శాతం సబ్సిడీపై లింగాకర్షక బుట్టలను (పిరమోన్‌ ట్రాప్స్‌) వ్యవసాయశాఖ పంపిణీచేసిన విషయం విదితమే! రాష్ట్రవ్యాప్తంగా 16,78,214 ట్రాప్స్‌ (బుట్టలు), 33,56,428 ల్యూర్స్‌ (రబ్బర్‌ ట్యాబ్లెట్స్‌) పంపిణీ చేసేందుకు వ్యవసాయశాఖ రూ.7,88,76,058 మంజూరుచేసింది. 


తెలంగాణ మార్క్‌ఫెడ్‌ను నోడల్‌ ఏజెన్సీగా నియమించి డీఏవోలు, ఏడీఏలు, ఏవోల ద్వారా రైతులకు వీటిని అందించారు. అయితే ఈ బుట్టలు క్షేత్రస్థాయిలో రైతులకు చేరలేదు. మార్క్‌ఫెడ్‌, వ్యవసాయశాఖ అధికారులు, కియా బయోటెక్‌ కంపెనీ ప్రతినిధులు కుమ్మక్కై నకిలీ వినియోగపత్రాలు (యూసీ) సృష్టించి సుమారు రూ.7.89 కోట్లకు ప్రభుత్వానికి కుచ్చుటోపీ పెట్టారు. సాక్షాత్తూ జిల్లా వ్యవసాయ అధికారుల (డీఏవో) సంతకాలు ఫోర్జరీ అయ్యాయి. ప్రభుత్వం యూసీలు కోరడంతో డీఏవోలు 12,74,385 ట్రాప్స్‌, 25,48,770 ల్యూర్స్‌కు వినియోగపత్రాలు సమర్పించారు. కానీ కియా బయోటెక్‌ కంపెనీ ప్రతినిధులు.. మార్క్‌ఫెడ్‌ ద్వారా 16,78,214 ట్రాప్స్‌, 33,56,428 ల్యూర్స్‌కు కమిషనరేట్‌లో డెలివరీ చలాన్లు సమర్పించారు. దీంతో 4,03,833 ట్రాప్స్‌, 8,07,658 ల్యూర్స్‌కు ఫోర్జరీ చేసిన డెలివరీ చలాన్లు సమర్పించినట్లు విచారణలో తేలింది. అంటే నకిలీ డీసీల విలువ రూ. 1.89 కోట్లు. డీఏవోలు ఇచ్చిన సర్టిఫికెట్లలోనూ బోగ్‌సవి ఉన్నాయి. దీంతో డీఏవోల సంతకాలు ఫోర్జరీచేసిన కియా బయోటెక్‌పై ఎక్కడికక్కడ కేసులు నమోదుచేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్‌ ఆదేశాలు జారీచేశారు. 


10 జిల్లాల డీఏవోల సంతకాలు ఫోర్జరీ అయితే... జయశంకర్‌ భూపాలపల్లి, రంగారెడ్డి, సూర్యాపేట, జోగులాంబ గద్వాల, ఖమ్మం, రాజన్న సిరిసిల్ల జిల్లాల డీఏవోలు పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌, జనగామ, నిర్మల్‌ జిల్లాల డీఏవోలు మాత్రం కియా బయోటెక్‌పై ఎలాంటి ఫిర్యాదులు చేయలేదు. దీంతో ఈ నాలుగు జిల్లాల డీఏవోలు దొంగ డీసీలపై సంతకాలు చేసినట్లు విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు. రూ.7.89 కోట్ల విడుదలకు జరిగిన ప్రయత్నాలన్నింటిపై నివేదిక తయారుచేశారు. అయితే కీలకమైన డెలివరీ చలాన్లు వ్యవసాయ కమిషనరేట్‌లో మాయమైనప్పటికీ, సంబంధిత ప్లాంట్‌ ప్రొటెక్షన్‌ విభాగంపై ఇంతవరకు ఎలాంటి శాఖాపరమైన చర్యలు తీసుకోలేదు. పైపెచ్చు జిరాక్సు డీసీలతో కేసు ఫైల్‌ చేయాలని ఏపీసీ నుంచి ఆదేశాలు వెళ్లటం శోచనీయం. ఇద్దరు డీఏవోలను బదిలీచేయటం తప్ప వ్యవసాయశాఖ తీసుకున్న చర్యలు ఏమీలేవు. విజిలెన్స్‌ అధికారులు మాత్రం ఇప్పటికే మార్క్‌ఫెడ్‌ జనరల్‌ మేనేజర్‌, చీఫ్‌ ఫర్టిలైజర్‌ మేనేజర్‌తోపాటు రాష్ట్రస్థాయి సెలక్షన్‌ కమిటీలో కీలక పాత్రధారులుగా ఉన్న వ్యవసాయశాఖ ఉన్నతాధికారులకు నోటీసులు జారీచేసి వివరణ కోరారు. ఈ నేపథ్యంలో మొత్తం కుంభకోణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది తేలాల్సి ఉంది.

Updated Date - 2021-04-17T07:26:35+05:30 IST