ఇల్లు కూలినా... గళం ఆగునా?

ABN , First Publish Date - 2022-06-15T07:57:12+05:30 IST

ఆఫ్రీన్‌ ఫాతిమా జవహర్‌ లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ రీసెర్చ్‌ స్కాలర్‌. ఆమె జెఎన్‌యు స్టూడెంట్‌ యూనియన్‌ కౌన్సెలర్‌ కూడా.

ఇల్లు కూలినా... గళం ఆగునా?

 భాజపా మాజీ అధికార ప్రతినిధి నూపుర్‌ శర్మ మహమ్మద్‌ ప్రవక్తపై చేసిన అనుచిత వ్యాఖ్యలు దేశవ్యాప్త అల్లర్లకూ, హింసకూ దారి తీసిన విషయం మనందరికీ తెలిసిందే! అయితే ఆ అల్లర్లకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న జావేద్‌ అహ్మద్‌ ఇంటిని, బుల్డోజర్‌ ఆపరేషన్‌లో భాగంగా తాజాగా కూల్చివేశారు. దాంతో జావేద్‌ కూతురు, జెఎన్‌యు పూర్వ విద్యార్థి నాయకురాలు, ముస్లిం యాక్టివిస్ట్‌... ఆఫ్రీన్‌ ఫాతిమా సామాజిక మాధ్యామాల్లో తన గళాన్ని వినిపించడం మొదలుపెట్టింది. విద్యార్థి ఉద్యమాలకు నాయకత్వం వహించే ఆఫ్రీన్‌ గురించిన మరిన్ని విశేషాలు...


ఆఫ్రీన్‌ ఫాతిమా జవహర్‌ లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ రీసెర్చ్‌ స్కాలర్‌. ఆమె జెఎన్‌యు స్టూడెంట్‌ యూనియన్‌ కౌన్సెలర్‌ కూడా. ఆఫ్రీన్‌ ఎంతో ముందు నుంచే ముస్లింల హక్కుల కోసం పోరాటాల్లో పాల్గొని ప్రసిద్ధి పొందింది. ఢిల్లీ, షహీన్‌బాగ్‌ ప్రాంతంలో జరిగిన, 2019 నాటి, యాంటీ సిఎఎ/ఎన్‌ఆర్‌సి నిరసనల్లో ఈమె చురుగ్గా పాల్గొంది. కర్నాటకలో మొదలైన హిజాబ్‌ వివాదం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన సమయంలో కూడా ఆఫ్రీన్‌ 300 మంది ముస్లిం మహిళలతో కలిసి, నిరసన ప్రదర్శన చేపట్టింది. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే ఈమె, పార్లమెంట్‌పై దాడిలో పాల్గొన్న అఫ్జల్‌ గురుకు అనుకూలంగా ఓ కథనాన్ని షేర్‌ చేసింది. అంతే కాకుండా అఫ్జల్‌ గురు సన్నిహితుడు, ఢిల్లీ అల్లర్ల ప్రధాన నిందితుడు షర్జీల్‌ ఇమామ్‌కు మద్దతుగా ట్విటర్‌, ఫేస్‌బుక్‌.. ఇతర సామాజిక మాధ్యమాల్లో కథనాలను షేర్‌ చేసింది. 


అల్లర్ల సూత్రధారి అనే అనుమానంతో...

తాజాగా నూపుర్‌ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలతో ఉత్తర ప్రదేశ్‌లోని సహ్రాన్‌పూర్‌లో, ప్రయాగ్‌రాజ్‌లో అల్లర్లు మొదలయ్యాయి. ప్రయాగ్‌రాజ్‌ అల్లర్లకు వెల్ఫేర్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా ఉద్యమకారుడైన ఆఫ్రీన్‌ ఫాతిమా తండ్రి, జావేద్‌ అహ్మద్‌ను సూత్రధారిగా అనుమానించిన యోగీ ప్రభుత్వం, అతన్ని అదుపులోకి తీసుకోవడంతో పాటు, ప్రయాగ్‌రాజ్‌లోని అతని ఇంటిని బుల్డోజర్‌ ఆపరేషన్‌లో భాగంగా కూల్చివేసింది. అయితే ఆ ఇంటిని అతను అక్రమంగా నిర్మించాడు కాబట్టి, ఖాళీ చేయని పక్షంలో కూల్చివేయడం జరుగుతుందని, ప్రయాగ్‌రాజ్‌ డెవల్‌పమెంట్‌ అఽథారిటీ గత నెల్లోనే నోటీసులు జారీ చేసినట్టు చెప్పుకొస్తోంది. అలా తమ చర్యను సమర్ధించుకోవడంతో పాటు, అతని ఇంట్లో ఆయుధాలు, సాహిత్యం దొరికినందుకు గానూ అతన్ని తాజా అల్లర్లకు బాధ్యుడిని చేస్తూ, అదుపులోకి తీసుకున్నట్టు యోగీ సర్కారు చెప్తోంది. 


జెఎన్‌యు మద్దతుతో...

ఎలాంటి ముందస్తు నోటీసు, వారెంటూ లేకుండా తన తండ్రినీ, 19 ఏళ్ల చెల్లినీ, మధుమేహంతో బాధపడుతున్న తల్లినీ గత శుక్రవారం అర్థరాత్రి, అలహాబాద్‌ పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఎంత వరకూ సమంజసమనీ, తన ఇంట్లో ఎలాంటి మారణాయుధాలూ, సాహిత్యం లేదనీ ఆఫ్రీన్‌ మీడియాతో చెప్పుకొచ్చింది. తల్లినీ, చెల్లినీ విడుదల చేసినా, తండ్రి జాడ ఇప్పటివరకూ తెలియడం లేదంటున్న ఆఫ్రీన్‌... చొరవ తీసుకుని, సమస్యను పరిష్కరించాలని కోరుతూ నేషనల్‌ విమెన్స్‌ కమిషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉంటే, ఆఫ్రీన్‌ ఫాతిమా ఇంటి కూల్చివేతకు నిరసనగా జెఎన్‌యు విద్యార్థులు ప్రదర్శనలు చేపట్టారు. ట్విటర్‌ వేదికగా ‘స్టాండ్‌ విత్‌ ఆఫ్రీన్‌ ఫాతిమా’ అనే అకౌంట్‌ ద్వారా మద్దతు కూడగడుతున్నారు. 

Updated Date - 2022-06-15T07:57:12+05:30 IST