చేయి తడిపితేనే

ABN , First Publish Date - 2021-12-05T07:05:19+05:30 IST

జిల్లా కేంద్రంలోని ఆర్టీవో కార్యాలయంలో మామూళ్ల జోరు కొనసాగుతోంది.

చేయి తడిపితేనే
ఆర్టీవో కార్యాలయం

 ఆర్టీవో కార్యాలయంలో వసూళ్ల జోరు 

అందుకు ఓ వ్యక్తి కేటాయింపు

 దొంగపత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్‌, కేసు నమోదు 

జిల్లా కేంద్రంలోని ఆర్టీవో కార్యాలయంలో మామూళ్ల జోరు కొనసాగుతోంది. ఏ పనైనా చేయితడిపితేనే పూర్తవుతుంది. లేదంటే నిబంధనల పేరుతో రోజుల కొద్దీ కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

- (ఆంధ్రజ్యోతి, సూర్యాపేట)

ప్రభుత్వం ఆర్టీఏ ఏజెంట్ల వ్యవస్థను రద్దు చేసింది. అయినా ఆర్టీవో కార్యాలయం వద్ద అనధికారికంగా ఈ వ్యవస్థ కొనసాగుతూనే ఉంది. ఆర్టీఏ ఏజెంట్ల నుంచి డబ్బు వసూలు చేసి ఇచ్చేందుకు ఇక్కడి అధికారులు ఒకరిని కేటాయించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సదరు వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి కానప్పటికీ, కనీసం అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి కాకున్నా ఏళ్లుగా అతడు వసూళ్లకు పాల్పడుతూ అధికారులకు అందజేస్తున్నాడు. అందులో తన వాటాను జేబులోవేసుకుంటున్నాడు. అతడు నిత్యం కార్యాలయం వద్దే తచ్చాడుతున్నా, ఇదేంటని అధికారులను ప్రశ్నిస్తే అసలు అతడు ఎవరో తమకు తెలియదని బుకాయిస్తుండటం కొసమెరుపు.

జిల్లా కేంద్రంలో అనధికారికంగా 30 మందికిపై గా ఆర్టీఏ ఏజెంట్లు ఉన్నారు. నిత్యం మోటార్‌ సైకి ల్‌, ఫోర్‌ వీలర్లు, ట్రాక్టర్లు, లారీల రిజిస్ట్రేషన్లు 50 నుంచి 70 వరకు ఉంటున్నాయి. కారు, మోటార్‌ సైకిల్‌ రిజిస్ట్రేషన్‌కు కనీసం రూ.100 నుంచి రూ.130 మామూలుగా వసూలు చేస్తున్నారు. కారు, ట్రాక్టర ్‌, లారీలకు రూ.500 నుంచి రూ.700 వరకు తీసుకుంటున్నారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌కు కనీసంగా రూ.150 ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. కమర్షియల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ అయితే రూ.500 సమర్పించాల్సిందే. ఇదంతా ఓ ప్రైవేట్‌ వ్యక్తి కనుసన్నల్లో కొనసాగుతుండగా, ఆర్టీఏ ఏజెంట్లే డబ్బును వసూలుచేసి సదరు వ్యక్తికి ఇస్తున్నారు. అతడి నుంచి ఆర్టీఏ ఉద్యోగులకు చేరుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.


నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్‌

ఆర్టీవో కార్యాలయంలో వద్ద అనధికారిక ఏజెంట్‌ ఓ ఫైనాన్స్‌ వాహనానికి ఫాం-35తో పాటు నకిలీ కవరింగ్‌ లెటర్‌ సమర్పించి రిజిస్ట్రేషన్‌ చేయించాడు. అందుకు ఆర్టీవో కార్యాలయంలోని సిబ్బందికి ముడుపులు చెల్లించినట్టు తెలిసింది. ఫైనాన్స్‌ ఉన్న ఆ వాహనాన్ని విక్రయించగా, పలువురి చేతులు మారింది. కాగా, ఈ విషయాన్ని 15 రోజుల క్రితం గుర్తించిన ఆర్టీవో ఉన్నతాధికారులు సూర్యాపేట పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా, సదరు ఏజెంట్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, విచారణ కొనసాగుతుందనే కారణం చూపుతూ, దీంట్లో భాగస్వామం ఉన్న సిబ్బందిపై మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 


కేసు విషయం వాస్తవమే: వెంకట్‌రెడ్డి, ఆర్టీవో

తప్పుడు పత్రాలు సృష్టించి ఓవ్యానును రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న విషయం వాస్తవ మే. అతడి పై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది. ఆర్టీవో కార్యాలయం వద్ద అనధికార ఏజెంట్లు ఉన్నారనే విషయం దృష్టికి రాలేదు. వారి నుంచి డబ్బు వసూలు చేస్తున్న వ్యక్తి ఎవరో కూడా తెలియదు.

Updated Date - 2021-12-05T07:05:19+05:30 IST