చేయి తడిపితేనే..!

ABN , First Publish Date - 2021-10-28T05:30:00+05:30 IST

ప్రభుత్వ పథకాల్లో లబ్ధి పొందాలంటే చేయి తడపాల్సిందే అన్నట్లు తయారైంది పట్టణంలో పరిస్థితి. కొందరు వలంటీర్ల వసూళ్ల పర్వం చర్చనీయాంశమైంది.

చేయి తడిపితేనే..!

  1. వలంటీర్ల వసూళ్ల పర్వం
  2. ప్రతి పనికీ రేటు కట్టి దందా
  3. పింఛన్‌ కావాలంటే రూ.3 వేలు
  4. ఇంటి పట్టా ఇచ్చేందుకు రూ.5 వేలు


డోన్‌, అక్టోబరు 28: ప్రభుత్వ పథకాల్లో లబ్ధి పొందాలంటే చేయి తడపాల్సిందే అన్నట్లు తయారైంది పట్టణంలో పరిస్థితి. కొందరు వలంటీర్ల వసూళ్ల పర్వం చర్చనీయాంశమైంది. ఒక్కో పథకానికి ఓ రేటు కట్టి లబ్ధిదారుల నుంచి కాసులు దండుకుంటున్నారు. ప్రభుత్వ పథకం వర్తించాలంటే రూ.వేలల్లో ముట్టజెప్పాల్సి వస్తోందని బాధితులు వాపోతున్నారు. రాజకీయాలు, వర్గాలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలను వర్తింపజేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ‘ముడుపులు ఇచ్చినవారికే..’ అన్నట్లుగా మారింది. లబ్ధిదారుల ఎంపికలో వలంటీర్లు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇదే అదనుగా డోన్‌ పట్టణంలో కొందరు వసూళ్ల పర్వానికి తెర లేపారు.

 

చేయి తడపాల్సిందే.. 


 డోన్‌ పట్టణంలో పింఛన్‌ మంజూరు కావాలంటే వలంటీర్ల చేయి తడపాల్సి వస్తోంది. ఒక్కో లబ్ధిదారుడు రూ.3 వేలు ఇవ్వాలని రేటు నిర్ణయించారన్న ఆరోపణలు ఉన్నాయి. అడిగిన సొమ్ము ఇవ్వకపోతే పింఛన్‌ మంజూరు కాదని తెగేసి చెబుతున్నారు. దీంతో లబ్ధిదారులు చేసేది లేక వలంటీర్లు అడిగిన మొత్తాన్ని సమర్పించు కుంటున్నారు. 


 వైఎస్సార్‌ చేయూత సొమ్ము మంజూరు అయిన ప్రతి విడతలోనూ వలంటీర్లకు వాటా ఇవ్వాల్సి వస్తోందని బాధితులు అంటున్నారు. ఒక్కో విడతకు రూ.2 వేలు ఇవ్వాలని కొందరు వలంటీర్లు డిమాండ్‌ చేస్తున్నారు. వైఎస్సార్‌ చేయూత పథకంలో 45 ఏళ్లు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ మహిళలకు మొత్తం రూ.75 వేలు ప్రభుత్వం ఇస్తోంది. ఒక్కో విడతలో రూ.18,750 వారి ఖాతాల్లో జమ చేస్తోంది. ఇందులో వలంటీర్లు రూ.2 వేలు లబ్ధిదారుల నుంచి వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. 


గృహ హక్కులో మితిమీరిన దందా


ప్రభుత్వం తాజాగా ప్రకటించిన జగనన్న గృహ హక్కు పథకం విషయంలో వసూళ్ల దందా మితిమీరిపోయింది. డోన్‌ పట్టణంలో 4 వేల మంది లబ్ధిదారులకు జగనన్న కాలనీల్లో ఇంటి పట్టాలు ఇచ్చారు. ఇంటి స్థలాలు పొందిన వారికి జగనన్న గృహ హక్కు పథకం పట్టా ఇస్తున్నారు. ఇది వలంటీర్లకు కాసుల పంట పండిస్తోంది. లబ్ధిదారుల నుంచి భారీగా పిండేస్తున్నారు. గృహ హక్కు పట్టా కావాలంటే రూ.5 వేలు చెల్లించాల్సి వస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. లబ్ధిదారుల నుంచి ఇలా రూ.2 కోట్లకు పైగా దండుకునేందుకు పథకాన్ని రచించినట్లు విమర్శలు గుప్పుమంటున్నాయి. ఇంత జరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని బాధితులు వాపోతున్నారు. 


కట్టడి చేయాలి..


డోన్‌ పట్టణంలో వలంటీర్ల వసూళ్ల పర్వాన్ని కట్టడి చేయాలి. పింఛన్లు మంజూరు చేయాలంటే రూ.వేలు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వ పథకాల్లో లబ్ధి పొందాలంటే వలంటీర్లకు ముడుపులు ఇచ్చుకోవాల్సి వస్తోంది. గృహ హక్కు పట్టా కావాలంటే భారీగా డిమాండ్‌ చేస్తున్నారు. ఇలాంటి వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలి. 

 

- పులిశేఖర్‌, ఏఐవైఎఫ్‌ జిల్లా కార్యదర్శి, డోన్‌


వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు..


డోన్‌ మున్సిపాలిటీలో విధులు నిర్వహించే వలంటీర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. ప్రభుత్వ పథకాల్లో లబ్ధిదారుల నుంచి వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పాం. వలంటీర్లు వసూళ్లు చేస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. వసూలు చేస్తున్న వలంటీర్ల వివరాలు ఇస్తే విచారించి చర్యలు తీసుకుంటాం. విధులు సక్రమంగా నిర్వహించని 25 మంది వలంటీర్ల గౌరవ వేతనం నిలిపివేశాం. లబ్ధిదారులు నేరుగా నన్ను కలిసి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకుంటాము.


 - కేఎల్‌ఎన్‌ రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌, డోన్‌

Updated Date - 2021-10-28T05:30:00+05:30 IST