భయం వీడితే భవిష్యత్ మనదే

ABN , First Publish Date - 2022-01-07T06:31:17+05:30 IST

‘నిజంగా? 2024 సార్వత్రక ఎన్నికలలో బీజేపీ ఓడిపోవడం ఖాయమని మీరు భావిస్తున్నారా? నేనైతే అటువంటి ఆశలు వదులుకున్నాను’- ఒక రాజనీతిజ్ఞుడి నైరాశ్యమిది’...

భయం వీడితే భవిష్యత్ మనదే

‘నిజంగా? 2024 సార్వత్రక ఎన్నికలలో బీజేపీ ఓడిపోవడం ఖాయమని మీరు భావిస్తున్నారా? నేనైతే అటువంటి ఆశలు వదులుకున్నాను’- ఒక రాజనీతిజ్ఞుడి నైరాశ్యమిది’. విదేశాలలో మంచి ఉద్యోగావకాశం లభిస్తుందేమోనని ప్రతిరోజూ ఎదురుచూస్తున్నాను. ఇక్కడ మాకు మిగిలిందేమీ లేదు’- ఉన్నత విద్యావంతుడైన ఒక యువ కార్యకర్త నిస్పృహ ఇది. నిత్యం నేను ఇటువంటి నిష్ఠురమాటలు వింటూనే ఉన్నాను. ఎవరు వీరంతా? భారత రాజ్యాంగాన్ని ఔదలదాల్చినవారు. ఉదారవాద, ప్రజాస్వామిక భారతదేశం వర్థిల్లాలని ఆరాటపడుతున్నవారు. వారి నిరాశానిస్పృహలు ఇంకా బహు విధాలుగా వ్యక్తమవుతున్నాయి ‘ప్చ్, ప్రత్యామ్నాయం లేదు’, ‘వారికి ధనశక్తి, కండబలం, మీడియా ప్రాబల్యం.. ఒక్కటేమిటి ప్రతిదీ ఉంది’– ఇలాంటివి ఇంకెన్నో ఆశోపహతులు కొంతమంది ‘ప్రపంచంలో ప్రతి చోటా ఇదే సంభవిస్తోంది కదా’ అని నిట్టూరుస్తున్నారు. ట్రంప్, పుతిన్, ఎర్డోగన్ మొదలైన నాయకుల వ్యవహారాలను వారు ఉదహరిస్తున్నారు. ఈ అంతులేని నైరాశ్యం మన దేశ ప్రజాజీవితాన్ని ఆవహించడమే కాదు, మన జాతి సమష్టి సుప్తచేతనలో ప్రగాఢంగా ఇంకిపోయింది. కొత్త సాగుచట్టాలకు వ్యతిరేకంగా రైతుల విజయం ఊరంతా సంక్రాంతి అయింది. అయితే ఈ ఉత్సవోత్సాహాలు ఎంతకాలం నిలుస్తాయి? అనే శంక పీడిస్తూనే ఉంది. పశ్చిమబెంగాల్‌లో మమత హ్యాట్రిక్‌కు పరవశించిపోయాం. అయితే ఉత్తరప్రదేశ్‌లో ఏమి జరగనున్నదో?! ఎనలేని ఉత్కంఠ, ఒకటే వ్యాకులత. దేశ నాయకద్వయంపై గవర్నర్ సత్యపాల్ మాలిక్ వ్యాఖ్యలకు మనం సంతసిస్తున్నాం. అయినా పరిస్థితులు మొత్తంగా మనల్ని సతాయిస్తూనే ఉన్నాయి. 


నరేంద్రమోదీ రాజకీయాలు అంతకంటే సాధించే సాఫల్యం మరేముంటుంది? అది తన విరోధులను, నిరంతరం విస్తృతమవుతున్న వ్యతిరేకతా సుడిలోకి నెట్టివేసింది. అదొక వ్యతిరేకతా హోరు. మోదీని తిరస్కరించాలని ప్రజలకు పిలుపునిస్తోంది. అయితే మోదీ(త్వ)ని తిరస్కరిస్తున్న వారిలో ఆశాభావ రాహిత్యాన్నే అది పెంపొందిస్తోంది. ప్రజలతో అంతరాన్ని మరింత విస్తృతం చేస్తోంది. ఆట ఆరంభం కాకముందే మోదీ ప్రత్యర్థులను అది చిత్తు చేసింది. మన సమున్నత భారత ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యాన్ని రక్షించుకోవాలని ఆకాంక్షిస్తున్న వారందరూ వాస్తవిక రాజకీయాల శక్తిని అర్థం చేసుకోవాలి. ఈ గ్రహింపే, ఈ అవగాహనే ప్రస్తుత సంవత్సరంలో వారి కొత్త ప్రస్థానానికి స్ఫూర్తి.


వాస్తవిక రాజకీయాలు ఏమిటి? అదేమీ శాస్త్ర పరిభాష కాదు. అనారోగ్యకర సత్యాల నిశిత శోధనా సాధనం కాదు. మనం విశ్వసిస్తున్న విలువలకు నిండు ప్రతీక అయిన మన రిపబ్లిక్‌ను ధ్వంసం చేసేందుకు నిత్యం జరుగుతున్న ప్రయత్నాలను ఉపేక్షించడం కాదు. భారత్ భావన (ఐడియా ఆఫ్ ఇండియా)కు ఎదురవుతున్న సవాల్ దానికదే హఠాత్తుగా అదృశ్యమైపోగలదనే ఆశాభావాన్ని కలిగి ఉండడం (ఇదెంత మూర్ఖత్వం!) గురించి అంతకన్నా కాదు. ఒక అసాధ్య పోరాటంలోకి గుడ్డిగా వెళ్ళడాన్ని అదేమీ అనివార్యం చేయదు. 


ప్రగతిశీల దృక్పథం కలిగి ఉండడమే వాస్తవిక రాజకీయాలు. సమస్య పరిష్కారానికి చొరవతో కార్యాచరణకు దిగడమే వాస్తవిక రాజకీయాలు. మన సంస్కృతి, సంప్రదాయాలలో వేళ్ళూని, పరిపూర్ణ ఆత్మవిశ్వాసంతో, సంఘీభావాలకు ప్రయత్నించే నిర్మాణాత్మక రాజకీయ కార్యాచరణే వాస్తవిక రాజకీయాలు. వ్యతిరేకతలను విధిగా జయించేవి వాస్తవిక రాజకీయాలు. హిందూత్వ రాజకీయాలను పూర్తిగా నిరాకరించే నిపుణ విమర్శకులుగా, మోదీపై నిత్యం విమర్శల జడివాన వర్షించడంలో రాటుదేలిన వ్యతిరేకులుగా మనం కన్పించకూడదు. ప్రతిపక్షాల రాజకీయాలు కేవలం పాలకుల రాజకీయాలు, విమర్శలు, నిందారోపణలు, ఆగ్రహావేశాలకు ప్రతిస్పందించడానికి మాత్రమే పరిమితం కాకూడదు. 


కరోనా విలయాన్ని నియంత్రించడంలో ప్రభుత్వం సమర్థంగా వ్యవహరించిందా? లేదు. విపత్తు విపరీతమైపోయింది. ప్రతిపక్షాలు ప్రజలకు ఒక ప్రత్యామ్నాయ ప్రజారోగ్య వ్యవస్థ నమూనాను నివేదించాలి. అన్నిటికంటే ముఖ్యంగా మోదీ ప్రభుత్వ విమర్శకులు అనాలోచిత మోదీత్వ- వ్యతిరేక ఆక్షేపణలు, అభియోగాలకు స్వస్తి చెప్పి తీరాలి. మోదీ సర్వశక్తిమంతుడనే భావనను ప్రజల మనస్సుల్లో మరింతగా సుప్రతిష్ఠితం చేయడం మినహా ఆ ఆరోపణలతో సాధించేదేమన్నా ఉందా? 


సుదూర భవిష్యత్తులో కాకుండా సమీప భవిష్యత్తులో నిజమైన, సమంజసమైన విశ్వాసాన్ని నెలకొల్పడమే వాస్తవిక రాజకీయాలు. నిరంతర వెనుకచూపుతో మీరేమి సాధించగలుగుతారు, నిర్మించగలుగుతారు? నెహ్రూవియన్ గతం గురించిన బెంగను విడనాడాలి. ఇందిరాగాంధీ పాలనను గుర్తు తెచ్చుకోవడం, సమర్థించడాన్ని మానుకోవాలి. మొగల్ వంశ రాజన్యులు శరణార్థులా కాదా అనే విషయమై వాదప్రతివాదాలలో చిక్కుకోకూడదు.


దేశ భవిష్యత్తును మన రాజకీయాలు దూరదృష్టితో చూడాలి. భారత్ భవ్య భవిష్యత్తు గురించి ఒక కొత్త కథనాన్ని విరచించేందుకు ప్రజలను ఆహ్వానించాలి. ఆ నవ్య భవిష్యత్తులో ప్రతి ఒక్కరి ఆకాంక్షలు సాకారమయ్యే అవకాశాలు ఉండాలి. తప్పుడు, విభజనశీల చరిత్రను కేవలం వాస్తవాలను పరీక్షించడం ద్వారా మాత్రమే తిరస్కరించలేము. ఒక ఉమ్మడి భవిష్యత్తును గురించిన స్వప్నాలు, ఆకాంక్షలతో ఆ అనర్థదాయక గతాన్ని అధిగమించాలి.


వాస్తవిక రాజకీయాలు ప్రతిస్పందనాత్మకంగా మాత్రమే కాకుండా ముందస్తు చొరవలతో కూడిన కార్యాచరణలతో విప్పారాలి. కశ్మీర్ కానివ్వండి లేదా కాశీ కానివ్వండి తన ప్రత్యర్థులు ప్రతిస్పందించి తీరేలా ఎజెండాను ఎలా నిర్దేశించాలో నరేంద్ర మోదీకి బాగా తెలుసు. కాశీ, మథుర, ఉమ్మడి పౌరస్మృతి మొదలైనవి ప్రజల మనోభావాలతో ముడివడి ఉన్న అంశాలు. వాటి ఆధారంగా స్వార్ధరాజకీయా లకు ఎంతో ఆస్కారమున్నదనే యథార్థాన్ని ప్రతిపక్షాలు గుర్తించి తీరాలి. పాలకపక్షం రాజకీయ వ్యూహాలలో చిక్కుకోకుండా అప్రమత్తంగా ఉండాలి. భయం వీడితేనే భవిష్యత్తు మనదవుతుంది. ముం దస్తు చొరవ చూపడం ముఖ్యం. షహీన్ బాగ్, రైతుల ఆందోళనను గుర్తు చేసుకోండి. పాలకులపై పోరుకు చొరవ తీసుకున్నాం. మన ప్రయత్నం ఫలించింది. విజయం సిద్ధించింది. మన భావి కార్యాచరణకు ఇది స్ఫూర్తి కావాలి. ప్రభుత్వంపై కొత్త పోరుకు ప్రేరణ అయ్యేదేమిటి? ఉపాధికల్పన, జీవనాధారాల భద్రత విషయమై విస్తృత ఉద్యమం అటువంటి పోరుకు ఉపక్రమం కాగలదని నేను విశ్వసిస్తున్నాను. 


వాస్తవిక రాజకీయాలు మన సొంత సమాజం, సంస్కృతితో ఒక సువ్యవస్థిత, ఆరోగ్యకర సంబంధాన్ని తప్పనిసరిగా కలిగి ఉండాలి. హిందూమతం, సంప్రదాయం పేరిట భారత్ భావనపై ఎడతెగని దాడి జరుగుతోంది. ఆ దౌర్జన్యాన్ని ఎదుర్కొనేందుకు మనం మన సంప్రదాయాలు, అపార వైవిధ్య పూరిత సాంస్కృతిక, ధార్మిక వారసత్వానికి మన నిత్యజీవితంలో వివేచనాయుతమైన స్థానం కల్పించి తీరాలి. అప్పుడు మాత్రమే మత సంకుచితత్వాలను మనం నిర్మూలించగలం. ఈ విషయంలో మనం ఉపేక్ష వహిస్తే ‘మితవాద’ పక్షాల వ్యూహాల్లో చిక్కుకుంటాం. మన ప్రగతిశీల రాజకీయాలకు బలం సమకూరదు. ప్రజల మద్దతును సముపార్జించుకోవడంలో విఫలమవుతాం. హిందూత్వ మద్దతుదారులు సరిగ్గా కోరుకుంటున్నది కూడా ఇదే. ఈ ఆపదను ఎదుర్కొనేందుకు ఏకైక ప్రభావశీల మార్గం మన సమున్నత సాంస్కృతిక వనరులను సంపూర్ణంగా ఆలంబన చేసుకోవడమే. ఇందుకు మనం మన భాషలను ఉపయోగించుకోవాలి. మన ప్రాచీన, ఆధునిక ఉద్గ్రంథాలను అధ్యయనం చేసి మన కార్యాచరణలకు స్ఫూర్తి పొందాలి. మన మహోన్నత సంస్కృతీ నిర్మాతల బోధనలు, ఉపదేశాలను మన జీవితాలలో పునరావిష్కరించుకోవాలి. ఈ నెల 12న మనం జరుపుకోనున్న స్వామి వివేకానంద జయంతే ఈ సాంస్కృతిక పునరుజ్జీవానికి, మేధో పునర్వికాసానికి నాంది కావాలి. 


వాస్తవిక రాజకీయాలు ఆత్మవిశ్వాసపూరితంగా ఉండి తీరాలి. మన నమ్మకానికి మంచి కారణాలు ఉన్నాయి. సాధారణంగా నిరంకుశాధికార ప్రభుత్వాలు సత్వరమే కూలిపోవడం కద్దు. 2024 సార్వత్రక ఎన్నికలలో భారతీయ జనతాపార్టీని ఓడించడమనే లక్ష్యం పైకి కన్పిస్తున్నంతగా దుస్సాధ్యమైనదేమీ కాదు. తన ప్రధాన ప్రత్యర్థి పక్షాల కంటే తాను మరింత శక్తిమంతమైన పార్టీగా కన్పించేలా ప్రజల మనస్సుల్లో ముద్రవేయడంలో బీజేపీ సఫలమయిందని ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించడం గమనార్హం. తూర్పుతీరంలో బెంగాల్ నుంచి కేరళ దాకా బీజేపీ ఉనికి ఇప్పటికీ ఎవరినీ ఆకట్టుకోవడం లేదు. మధ్నాహ్న మార్తాండుడిలా వెలిగిపోతున్న సమయంలో కూడా హిందూత్వపార్టీ హిందువులలో అత్యధికుల ఓట్లను కైవసం చేసుకోలేకపోయింది. పార్లమెంటులో ఆ పార్టీ మెజారిటీ ప్రధానంగా హిందీ రాష్ట్రాల నుంచి సమకూర్చుకున్నదే. ఎన్నికల పోరాటాలలో గానీ, ప్రజాందోళనలలో గానీ ప్రస్తుత పాలకులు మమతా బెనర్జీ, సంయుక్త్ కిసాన్ మోర్చా నుంచి ఎదురైన సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవడంలో విఫలమయ్యారు. 


రాజ్యాధికార ప్రాభవాలు, ప్రాపకాలు ఎంతగా ఉన్నప్పటికీ బీజేపీ–ఆరెస్సెస్ సాంస్కృతిక సామర్థ్యాలు, ప్రభావశీలతలు భారత రాజ్యాంగాన్ని ఔదలదాల్చిన వారికి ఉన్నవాటితో సమానమైనవి కావు. ప్రధాన స్రవంతి మీడియాను బీజేపీ నియంత్రిస్తోంది. అయితే మన సమున్నత పురానవ నాగరికత, మన మహోజ్వల జాతీయోద్యమ వారసత్వం ఇంకా మనతో ఉంది. 


ప్రజల మధ్య సంఘీభావాలను నిర్మించడమే వాస్తవిక రాజకీయాల లక్ష్యం కావాలి. మనలో చీలికలను సృష్టించేందుకు పాలకులు ప్రయత్నిస్తారు. ఆశాభంగానికి లోనై, వివిధ దౌర్బల్యాలు ముప్పిరి గొన్నప్పుడు మనం పాలకుల పన్నాగాలకు సహకరించే ప్రమాదం లేకపోలేదు. ఈ వైపరీత్యాన్ని నివారించేందుకుగాను, ఒక అసాధ్య సంకీర్ణాన్ని నిర్మించి కొనసాగించడంలో విజయవంతమైన రైతుల ఉద్యమం నుంచి ‘రిపబ్లిక్’ సంరక్షకులు నేర్చుకోవలసింది ఎంతైనా ఉంది. పాలకులను విజయవంతంగా ప్రతిఘటించేందుకు రాజ్యాంగ విలువలకు నిబద్ధమైన సమస్త పౌరులను జగమొండి నాస్తికుల నుంచి దృఢవిశ్వాసుల వరకు, మార్కెట్‌వాలాల నుంచి మార్కెట్ సంశయవాదుల దాకా -సమైక్యపరచడమనేది రైతుల ఉద్యమం నుంచి నేర్చుకోవలసిన మొదటి పాఠం. ప్రస్తుత పాలకులను ఎదుర్కోవడంలో సైద్ధాంతిక స్వచ్ఛత కోసం అన్వేషించడం రాజకీయ అనర్థానికి మాత్రమే దారితీస్తుంది. మనం ఒంటరివాళ్ళం కామని మనందరికీ గట్టి నమ్మకం కలిగించడమే వాస్తవిక రాజకీయాల దృక్పథంగా ఉండితీరాలి. అవును, మనం ఇంకెంతమాత్రం ఒంటరి వాళ్ళం కానేకాము.


యోగేంద్ర యాదవ్

Updated Date - 2022-01-07T06:31:17+05:30 IST