భూమ్మీద తిరిగితే రైతు కష్టాలు తెలుస్తాయి

ABN , First Publish Date - 2020-10-24T08:42:06+05:30 IST

‘‘రాయలసీమ బిడ్డనంటూ వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల ముందు పాటలు రాయించుకుని ప్రచారం చేసుకున్నారు. సీఎం పదవి చేపట్టిన తర్వాత..

భూమ్మీద తిరిగితే రైతు కష్టాలు తెలుస్తాయి

సీమ బిడ్డనంటూ ప్రచారార్భాటం

రైతే లేని రాజ్యంగా మారుస్తున్నారు

వైసీపీ పాలనలో 750 మంది ఆత్మహత్య

ముంపు ప్రాంతాల్లో లోకేశ్‌ పర్యటన

 అనంతపురం, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): ‘‘రాయలసీమ బిడ్డనంటూ వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల ముందు పాటలు రాయించుకుని ప్రచారం చేసుకున్నారు. సీఎం పదవి చేపట్టిన తర్వాత.. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన రైతులు, ప్రజల కష్టాలు కనిపించకపోవడం దారుణం. గాల్లో చక్కర్లు కొడుతూ పరామర్శించామనుకోవడం కాదు. భూమ్మీద తిరిగితే రైతుల కష్టాలు తెలుస్తాయి’’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మండిపడ్డారు. భారీ వర్షాలతో కరువు జిల్లా అనంతపురంలో తీవ్రంగా నష్టపోయిన నాలుగు నియోజకవర్గాల్లో శుక్రవారం ఆయన పర్యటించారు. నష్టపోయిన పంట పొలాలను పరిశీలించి, క్షేత్రస్థాయిలో రైతులతో మాట్లాడి వారిని ఓదార్చారు.


అనంతరం లోకశ్‌ మీడియాతో మాట్లాడారు. రైతులను పరామర్శించేందుకు సీఎం, వ్యవసాయ మంత్రి రాకపోవడం, పంట నష్టం పరిశీలించేందుకు అధికారులూ కదలకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. నష్టపరిహారంగా ప్రభుత్వం ప్రకటించిన రూ.35 కోట్లు ఏమూలకు వస్తాయన్నారు. ఒక్క అనంతపురం జిల్లాలోనే వేరుశనగ రైతులు రూ.2 వేల కోట్లకుపైగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌రెడ్డి 17 నెలల పాలనలో నష్టపోయిన పంటలకు అందించిన పరిహారం రూ.25 లక్షలు మాత్రమేనన్నారు. శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుఫాన్‌ తరువాత కేవలం 28 రోజుల్లో రూ.160 కోట్లు పంటనష్ట పరిహారం రైతుల ఖాతాల్లో జమ చేసిన చరిత్ర తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కిందన్నారు.




రైతు రాజ్యంగా చేస్తామని ప్రచారం చేసుకున్న జగన్‌ సర్కారు రైతులేని రాజ్యంగా మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద బాధితుల కుటుంబాలకు రూ.5 వేలు చొప్పున అందించాలని డిమాండ్‌ చేశారు. వేరుశనగ, పత్తి రైతులకు ఎకరాకు రూ.25 వేలు నష్టపరిహారం ఇవ్వాల్సిందేనన్నారు. 2018 నాటి ఇన్‌పుట్‌ సబ్సిడీ రూ.967 కోట్లు బకాయిలు తక్షణమే విడుదల చేయాలని లోకేశ్‌ డిమాండ్‌ చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పాలనలో ఇప్పటి వరకూ 750 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే వారిలో 74 మంది అనంతకు చెందినవారేనని అన్నారు. లోకేశ్‌ వెంట పొలిట్‌ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులుతో పాటు జిల్లాకు చెందిన ముఖ్య నేతలంతా ఉన్నారు. 


Updated Date - 2020-10-24T08:42:06+05:30 IST