Abn logo
Mar 3 2021 @ 00:26AM

కల నిజమైన వేళ!

  • తండ్రి ఆటోడ్రైవర్‌. ఆశలకు హద్దు ఉండాలని చెప్పకనే 
  • చెప్పే కుటుంబ పరిస్థితి. కానీ మాన్యాసింగ్‌ పెద్ద కల కన్నది.
  • మిస్‌ ఇండియా పోటీల్లో గెలవాలనే తన కలను నిజం 
  • చేసుకునేందుకు ఎంతో కష్టపడింది. మిస్‌ ఇండియా కిరీటం
  • గెలవకున్నా   అందరి మనసులు గెలిచింది. పరిస్థితులు 
  • అనుకూలించకపోయినా పట్టుదలతో అనుకున్నది
  • సాధించిన ఈ యంగ్‌స్టర్‌ ఇంటర్నెట్‌లో తాజా సంచలనం.
  • ఆమె విజయ ప్రస్థానమిది...


మాన్య స్వస్థలం ఉత్తరప్రదేశ్‌. చదువు అవగానే ఆమెకు పెళ్లిచేయాలనుకున్నారు తల్లిదండ్రులు. అప్పుడు ఆమెకు 14 ఏళ్లు. కానీ జీవితంలో  ఏదైనా సాధించాలనుకున్న మాన్య చెప్పాపెట్టకుండా ముంయి రైలు ఎక్కింది. రైల్వేస్టేషన్‌ నుంచి బయటకు రాగానే కనిపించిన పిజ్జా షాపులో ఉద్యోగంలో చేరింది. ఈ విషయం రెండు రోజుల తరువాత వాళ్ల నాన్నకు ఫోన్‌చేసి చెబితే ఆయన తట్టుకోలేకపోయారు. కూతురి కల కోసం మరునాడే వాళ్లూ ముంబయి వచ్చేశారు. ఆమె తండ్రి ఓం ప్రకాశ్‌ ఆటో నడిపేవారు. ఇద్దరు పిల్లల పోషణ, చదువుకు ఆయన సంపాదన సరిపోయేది కాదు. చదువులో చురుకుగా ఉండే మాన్యకు ఇంట్లో పరిస్థితి చూశాక స్కూలుకు వెళ్లాలనిపించలేదు. పద్నాలుగేళ్లకే పనిలో కుదరింది. ‘‘నా బాల్యమంతా కష్టాలతోనే గడిచింది. చిన్నప్పుడు నాకు ఉన్న దుస్తులన్నీ ఎవరో ఒకరు ధరించి ఇచ్చినవే. పుస్తకాలు కొనిచ్చే స్థోమత కూడా మానాన్నకు లేదు. కొన్నిసార్లు పస్తులతో నిద్రలేని రాత్రులు గడిపాను.


ముంబయి వచ్చాక కాలేజీలో చేరాను. ఉదయం పూట చదువు, రాత్రిపూట కాల్‌సెంటర్‌లో ఉద్యోగం. ఆటో డబ్బులు మిగులుతాయని నడిచి వెళ్లిన రోజులు నాకింకా గుర్తే. ఆ పరిస్థితుల్లో మా అమ్మ ఒంటి మీది నగలు తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుతో పరీక్ష ఫీజు కట్టాను. అలా డిగ్రీ పట్టా సాధించాను’’ అని చెబుతుంది మాన్యాసింగ్‌. కాలేజీలో ‘క్యాంపస్‌ ప్రిన్సెస్‌’ పోటీల్లో పాల్గొన్న ఆమెను కొందరు ‘నువ్వు ఏమంత బాగుండవు. ‘నీ కుటుంబ పరిస్థితి ఏంటో నీకు తెలుసా!’ అని నిరుత్సాహపరిచేలా మాట్లాడిన సందర్భాలున్నాయి.  

ఆ అభిప్రాయాన్ని చెరిపివేయాలని

‘అమ్మా నేను మిస్‌ ఇండియా పోటీల్లో పాల్గొనాలని అనుకుంటున్నా’అని మాన్య అన్నప్పుడు ఆమె తల్లి ‘మిస్‌ ఇండియా పోటీల్లో పాల్గొనాలంటే పెద్ద కుటుంబానికి చెంది ఉండాలి. మనలాంటి వాళ్లు అలాంటి కలలు కనకూడదు’ అని చెప్పింది. కానీ మాన్యకు తనపై తనకు నమ్మకం ఎక్కువ. తమలాంటి వాళ్ల మీద ప్రపంచానికి ఉన్న అభిప్రాయాన్ని చెరిపివేయాలనుకుంది మాన్య. మిస్‌ ఇండియా పోటీలకు 2016 నుంచి ప్రయత్నిస్తూ ఉంది మాన్య. 2020లో అవకాశం దక్కింది. ప్రిలిమినరీ రౌండ్‌కు ఎంపికైన తరువాత ‘‘నేను ఉత్తరప్రదేశ్‌కే కాదు అందరు మహిళల ప్రతనిధిని. ఒకవేళ నేను మిస్‌ఇండియా అయితే జీవితంలో గొప్పగా ఏదైనా సాధించాలనుకునే ఎందరో మహిళలకు రోల్‌మోడల్‌గా నిలుస్తాను’’ అని చెప్పడం మాన్యకే చెల్లింది. రన్నర్‌పగా నిలిచిన తరువాత ఉద్వేగానికి లోనైన మాన్యా ‘‘నేను ఈరోజు ఫెమినా మిస్‌ఇండియా 2020 ఫైనల్‌ వేదిక మీద ఉన్నానంటే అందుకు కారణం నా తల్లిదండ్రులు. ఎవరైనా కష్టపడితే తమ కలల్ని నిజం చేసుకోవచ్చని చాటాలనే నా సంకల్పం. నా కలల ప్రయాణంలో ఇది ఆరంభం మాత్రమే’’ అని చెప్పారు. ఆ రోజు మాన్యా తండ్రి ఆటోలో అమ్మతో కలిసి తాను చదివిన కాలేజీలో సన్మాన సభకు వెళ్లారు. కూతురి విజయాన్ని ఓం ప్రకాశ్‌ 18 ఆటోలతో ర్యాలీ తీసి సంబరంగా జరుపుకొన్నారు. 


‘‘ఈ రోజు నేను ఆటో నడుపుతున్నప్పుడు చెప్పలేనంత సంతోషంగా అనిపించింది. ఉబికి వస్తున్న కన్నీళ్లను దిగమింగడం ఎంతో కష్టంగా అనిపించింది. మాన్యను నేను అప్పుడప్పుడు ఆటోలో కాలేజీ వద్ద దిగబెట్టిన క్షణాలు ఒక్కసారిగా నా కళ్ల ముందు మెదిలాయి. ఈ రోజు తలపై మిస్‌ ఇండియా కిరీటం ధరించిన నా కూతురును ఆటోలో తీసుకెళ్లడం నా జీవితానికి సరిపడా సంతోషాన్ని ఇచ్చింది’’ అని ఉప్పొంగిన మనసుతో చెప్పారు మాన్య తండ్రి. ‘‘మాన్య లాంటి కూతురు ఉన్నందుకు నేను అదృష్టవంతురాలిని. మిస్‌ ఇండియా పోటీలో గెలవాలన్న తన కలను నిజం చేసుకునేందుకు మాన్య పగలు, రాత్రి ఎంతో కష్టపడింది. ఆమెకు మావంతు సహకారం అందించాం. ఆమె అనుకున్నది సాధించింది. అందరు తల్లిదండ్రులు తమ కూతుళ్ల అకాశమే హద్దుగా పెరిగేలా ప్రోత్సహిస్తారని అనుకుంటున్నా’’ అంటారు మాన్య తల్లి మనోరమ.

నా బాల్యమంతా కష్టాలతోనే గడిచింది. చిన్నప్పుడు నాకు ఉన్న దుస్తులన్నీ ఎవరో ఒకరు ధరించి ఇచ్చినవే. పుస్తకాలు కొనిచ్చే స్థోమత కూడా మానాన్నకు లేదు. కొన్నిసార్లు పస్తులతో నిద్రలేని రాత్రులు గడిపాను.


నేను ఈరోజు ఫెమినా మిస్‌ఇండియా 2020 ఫైనల్‌ వేదిక మీద ఉన్నానంటే అందుకు కారణం నా తల్లిదండ్రులు. ఎవరైనా కష్టపడితే తమ కలల్ని నిజం చేసుకోవచ్చని చాటాలనే నా సంకల్పం.’’

ప్రత్యేకం మరిన్ని...