ఇలాగైతే ఎలా వెళ్లేది...!

ABN , First Publish Date - 2022-05-15T05:14:22+05:30 IST

ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రజలకు మేలు జరుగుతుందా.. లేదా.... అన్నది పరిశీలించాలి.

ఇలాగైతే ఎలా వెళ్లేది...!
రాజంపేట-రాయచోటి మధ్య తిరిగే వెలుగు బస్సు

జిల్లా కేంద్రం దగ్గరున్నా రెవెన్యూ డివిజన్‌ దూరం...

సుండుపల్లె-వీరబల్లి నుంచి రాజంపేటకు లేని బస్సులు 

రెవెన్యూ డివిజన్‌ కేంద్రానికి వెళ్లాలంటే ఎన్ని తిప్పలో...

జిల్లా కేంద్రానికి పల్లె వెలుగు బస్సులే దిక్కు..


ఆ రెండు మండలాలు జిల్లా కేంద్రానికి అతి దగ్గరలో ఉన్నాయి. జిల్లా కేంద్రమైన రాయచోటిలో ఏ పని ఉన్నా కేవలం అరగంటలో అక్కడికి చేరుకోవచ్చు. కానీ రెవెన్యూ డివిజన్‌ కేంద్రంలో పని కోసం వెళ్లాలంటే వారి బాధ వర్ణణాతీతం. బైక్‌లు, ఆటోలు, బస్సులు మారి రాజంపేటకు చేరుకోవాల్సి వస్తోంది. సుండుపల్లె, వీరబల్లి మండలాల ప్రజల దుస్థితి ఇది. మమ్ములను రాయచోటి రెవెన్యూ డివిజన్‌ కేంద్రంలో కలపాలని వారు గతంలో ఆందోళనలు కూడా చేశారు. అయినా ప్రభుత్వం మాత్రం ఈ రెండు మండలాలను రాజంపేట డివిజన్‌ కేంద్రంలో కలపడంతో అక్కడికి వెళ్లేందుకు ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. 


రాజంపేట, మే 14 : ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రజలకు మేలు జరుగుతుందా.. లేదా.... అన్నది పరిశీలించాలి. గతంలో ఉన్న ఇబ్బందులను పరిష్కరిస్తూ సౌకర్యవంతమైన నిర్ణయాన్ని ఆలోచించాలి. గత ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఎంతో సౌకర్యంగా రవాణా వ్యవస్థ ఉంటూ జిల్లా కేంద్రం అతి దగ్గరగా ఉండేది. ఇప్పుడు కొత్త జిల్లా కేంద్రం రాయచోటి ఏర్పడిన తరువాత గత సౌకర్యాలు దేవుడెరుగు ఉన్న సౌకర్యాలను తీసివేసి కొత్త సమస్యలను ఇరు ప్రాంతాల ప్రజలకు చుట్టడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. రాయచోటి జిల్లా కేంద్రం చేసిన తరువాత రెవెన్యూ డివిజనల్‌ కేంద్రాన్ని కూడా కొత్తగా ఏర్పాటు చేశారు. ఈ కేంద్రానికి సుండుపల్లె, వీరబల్లి మండలాలు అతి సమీప ప్రాంతాలు అరగంటలో రాయచోటికి వెళ్లవచ్చు. జిల్లా కేంద్రం కంటే రెవెన్యూ డివిజనల్‌ కేంద్రంలోనే ఎక్కువగా రెవెన్యూ సమస్యలు ఉంటాయి. ఖచ్చితంగా అక్కడికి వెళ్లాల్సిందే.. అంటే అతి సమీపంలోని కొత్తగా ఏర్పడ్డ రాయచోటి రెవెన్యూ డివిజన్‌ కేంద్రాన్ని వీరికి ఏర్పాటు చేయాల్సి ఉంది. అలా కాకుండా రాజంపేట రెవెన్యూ డివిజన్‌ కేంద్రాన్ని వీరికి ఏర్పాటు చేశారు. అంటే అరగంటలో రాయచోటికి వెళ్లాల్సిన వీరు.. సుమారు 60 కిలోమీటర్ల పైబడి దూరంలోని అందునా రెండు అడవులు దాటి చెయ్యేటిను దాటుకుంటూ రాజంపేటకు రావాల్సిందే. ఈ రెండు మండల కేంద్రాల నుంచి రాజంపేట కేంద్రానికి ఒక్క బస్సు లేదు.. ఈ రెండు మండలాల ప్రజలకు రాజంపేట నియోజకవర్గ కేంద్రం రెవెన్యూ డివిజన్‌ కేంద్రం. జిల్లా కేంద్రం సరే.. సరి. సుండుపల్లె, వీరబల్లి వాసులు తమ పల్లెల నుంచి ఏదో ఒక వాహనం ద్వారా మండల కేంద్రాలకు చేరుకుని అక్కడి నుంచి ఆటోల ద్వారా సుమారు 20 కిలోమీటర్లు మేర ప్రయాణించి రాయచోటి-రాజంపేటకు వెళ్లే రహదారి మార్గంలోని సానిపాయికి ఖచ్చితంగా రావాల్సిందే.. అక్కడి నుంచి బస్సు మార్గం ద్వారా ఘాట్‌ రోడ్డులో రాజంపేటకు రావాలి. ఈ రెండు మండల కేంద్రాలకు బస్సే లేకుండా రాజంపేటకు రావడం అందులో అటు రెండు గంటలు, ఇటు రెండు గంటలు అరకొరకగా తిరిగే బస్సుల మధ్య పోయి రావడం అన్నది ఎంత వ్యయప్రయాసాల పనో అర్థం చేసుకోవచ్చు... 


అన్నీ డొక్కు పల్లె వెలుగు బస్సులే..

జిల్లా కేంద్రమైన రాయచోటి-రాజంపేట పట్టణాల మధ్య సుమారు 56 కిలోమీటర్లు దూరముంది. మామూలుగా అయితే ఒకటిన్నర గంటలో బస్సులో వెళ్లవచ్చు. కానీ ఇదంతా రెండు దట్టమైన కొండలు, అందునా పూర్తిగా ఘాట్‌ రోడ్డు. కొంత మేరకు డబుల్‌ రోడ్డు చేసినా అటు సానిపాయి ప్రాంతంలో ఇంకా సింగిల్‌ రోడ్డును డబుల్‌ రోడ్డుగా మార్చలేదు. ఈ అడవిలో ఘాట్‌ రోడ్డు మార్గంలో ప్రస్తుతం నడిచే బస్సులు అన్నీ డొక్కు పల్లె వెలుగు బస్సులే.. జిల్లా కేంద్రం చేసిన తరువాతనైనా ఈ రెండు పట్టణాల మధ్య ఒక్క ఎక్స్‌ప్రెస్‌ బస్సునైనా, కండీషన్‌ బస్సునైనా ఏర్పాటు చేయలేదు. సరికదా... నియోజకవర్గ కేంద్రమైన రైల్వేకోడూరుకు రాయచోటికి మధ్య ఇంతవరకు ఒక్క బస్సు కూడా ఏర్పాటు చేయలేదు. రైల్వేకోడూరు, చిట్వేలి, ఓబులవారిపల్లె, పుల్లంపేట, పెనగలూరు మండల ప్రజలు రాయచోటి జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే మూడు బస్సులు మారాల్సిందే.. కాగా సుండుపల్లె, వీరబల్లి మండలాల మహిళలకు రాజంపేట ఇటీవల సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో అంగన్‌వాడీ ఇంటర్వ్యూలను నిర్వహించారు. ఈ ఇంటర్వ్యూలకు మూడు వాహనాలు మారి అతికష్టం మీద మహిళలు వచ్చారు. వారు పడ్డ బాధలు వర్ణణాతీతం. రాయచోటికి ప్రభుత్వ ఉద్యోగులు ప్రతిరోజూ కనీసం వంద మంది రాజంపేట నుంచి వెళ్లి వస్తూ ఉంటారు. వారందరూ కూడా ఈ పల్లె వెలుగు ఆర్డినరీ బస్సుల్లో వెళ్లి రావాల్సిందే.. బస్సు ఫుల్‌ అయినప్పుడు స్టాండింగ్‌లోనే ఉంటూ ఘాట్‌ రోడ్డులో అటూ ఇటూ ఊగుతూ పడుతూనే పోయి రావాల్సిందే.


రాయచోటి ఆర్టీసీ డిపో పరిధిలోకి వస్తాయి.. 

- గుండాల రమణయ్య, ఆర్టీసీ డిపో మేనేజర్‌, రాజంపేట

సుండుపల్లె, వీరబల్లి మండలాలు రాయచోటి ఆర్టీసీ డిపో పరిధిలోకి వస్తాయి. ఈ రెండు మండలాలకు బస్సు వేసే పరిధి మాది కాదు.. అయితే రాజంపేట-రాయచోటి మధ్య త్వరలో అద్దె బస్సులు తీసుకుని ఎక్స్‌ప్రెస్‌లు నడపడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఈనెల 20వ తేదీ తరువాత కొత్త బస్సులను వేయడానికి టెండర్లు కూడా పిలిచాం. పెంచలకోన బ్రహ్మోత్సవాలు ముగిసిన వెంటనే రాయచోటి-రాజంపేట మధ్య స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌లను నడుపుతాం. రైల్వేకోడూరు నుంచి కూడా రాజంపేట మీదుగా రాయచోటికి త్వరలో బస్సులను ఏర్పాటు చేస్తాం. ప్రస్తుతం రాజంపేట నుంచి రాయచోటికి నాలుగు పల్లెవెలుగు బస్సులు, రాయచోటి నుంచి నాలుగు పల్లెవెలుగు బస్సులు నడుస్తున్నాయి. వీటికి అదనంగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తాం. అంతేకాక రాజంపేట-రాయచోటి మీదుగా బెంగుళూరు ఇతర పట్టణాలకు కూడా ప్రత్యేక సర్వీసులు నడపడానికి చర్యలు తీసుకుంటున్నాం. 



Read more