ముమ్మాటికీ అమరావతే!

ABN , First Publish Date - 2020-02-16T09:06:29+05:30 IST

మూడు పంటలు పండే చక్కటి భూములను రైతులు ఇచ్చింది రాజధాని కోసమే తప్ప వైసీపీ నవరత్నాలు పంచడానికి కాదని జనసేనాని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం

ముమ్మాటికీ  అమరావతే!

మా రెండు పార్టీలదీ అదే నిర్ణయం

3 రాజధానులు సమ్మతం కాదని కేంద్ర పెద్దలు నాకు చెప్పారు

భూములిచ్చింది రాజధానికే!.. వైసీపీ నవరత్నాలు పంచడానికి కాదు

ఇది మోదీ, షా మాట్లాడే అంశం కాదు.. వారిని నిందించొద్దు

ప్రభుత్వం వల్లే రైతుల మరణాలు.. లాంగ్‌మార్చ్‌పై త్వరలోనే ప్రకటన

జనసేనాని పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలు.. రాజధాని గ్రామాల్లో పర్యటన


‘రాజధానికి నిధులు అడిగామని సీఎం జగన్‌ అంటున్నారు...! ఏ రాజధానికి నిధులు అడిగారో సమాధానం చెప్పాలి.’


‘3 రాజధానులకు అంగీకారం తెలుపుతూ ప్రధాని ఏమైనా లేఖ పంపారా..? పంపితే చూపాలని వైసీపీ వాళ్లను ప్రశ్నించండి.’


గుంటూరు, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): మూడు పంటలు పండే చక్కటి భూములను రైతులు ఇచ్చింది రాజధాని కోసమే తప్ప వైసీపీ నవరత్నాలు పంచడానికి కాదని జనసేనాని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. నవ్యాంధ్ర రాజధాని ముమ్మాటికీ అమరావతేనని.. జనసేన, బీజేపీల నిర్ణయం ఇదేనని తేల్చిచెప్పారు. రాజధాని అంశం ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా మాట్లాడేది కాదని.. దయచేసి వారిని నిందించొద్దని కోరారు. అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావం తెలిపేందుకు  ఆయన శనివారం యర్రబాలెం, కృష్ణాయపాలెం, రాయపూడి, అనంతవరం, తుళ్లూరు, వెలగపూడి, మందడం గ్రామాల్లో పర్యటించారు. రైతులు, మహిళలు గత 60 రోజులుగా చేస్తున్న దీక్షలకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా పలువురు మహిళా రైతులు తమ ఆవేదనను ఆయనకు నివేదించారు. దీనిపై ఆయన సూటిగా స్పందించారు. జనసేన, బీజేపీ అమరావతికే కట్టుబడి ఉన్నాయని కుండబద్దలు కొట్టారు. రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిదేనన్నది సుస్పష్టమని.. అయితే ఆ నిర్ణయం 2014లో అప్పటి ప్రభుత్వం తీసేసుకుందని గుర్తుచేశారు. ‘దానికి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్‌రెడ్డి మద్దతిచ్చారు.


ఒకసారి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాక.. తదుపరి ప్రభుత్వాలు దానిని ముందుకు తీసుకెళ్లాలి తప్ప.. మార్చడం కుదరదు. మార్చుకుంటూ పోతే ఈరోజు అమరావతి.. రేపు కర్నూలు, విశాఖ.. ఇలా అంతుండదు. మూడు రాజధానులనేది వంకర వాదన. మన దేశంలో ఎక్కడా లేదు. మన రాజధాని అమరావతే. ఎక్కడకూ పోదు. ఇక్కడ అన్ని మతాలు, కులాలు ఉన్నాయి. అందరూ కలిసి భూములు ఇచ్చారు. టీడీపీ వాళ్లతో వైసీపీకి గొడవ ఉంటే మీరు మీరు చూసుకోవాలి తప్ప ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు’ అని హితవు పలికారు. రాజధానికి నిధులు అడిగామని సీఎం జగన్‌ అంటున్నారని.. ఏ రాజధానికి నిధులు అడిగారో సమాధానం చెప్పాలని నిలదీశారు. ఇంకా ఏమన్నారంటే..


ప్రాంతీయ విభేదాలు సృష్టించాలని..

‘మనది 13 జిల్లాలతో కూడుకున్న చిన్న రాష్ట్రం. ప్రాంతీయ విభేదాలు సృష్టించాలని చూస్తున్నారు. ప్రజాక్షేమం కోరే వారెవరూ రాజధాని తరలింపును అంగీకరించరు. కర్నూలు వెళ్లినప్పుడు కొందరు న్యాయవాదులు నాకు నల్లజెండాలు చూపించారు. వాళ్లకు ఒక్కటే చెప్పాను. మీరు హైకోర్టు గురించి ఆలోచిస్తున్నారు.. నేను రాయలసీమ సమగ్రాభివృద్ధి గురించి మాట్లాడుతున్నానని చెప్పాను. దాంతో సాధారణ ప్రజలంతా హర్షించారు.


హైకోర్టు విషయంలో మాటివ్వలేను

‘అమరావతి నుంచి రాజధాని ఎక్కడికి పోదు. అయితే హైకోర్టు విషయంలో మాత్రం మాటివ్వలేను. శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారం హైకోర్టును రాయలసీమలో పెట్టడానికి బీజేపీ సానుకూలంగా ఉంది. దీని దృష్ట్యా మమ్మల్ని అర్థం చేసుకోవాలి. జై అమరావతి అని నేననలేను. జై ఆంధ్రప్రదేశ్‌ అని అంటాను. జై అమరావతి అంటే.. వెంటనే జై అనంతపురం, జై కర్నూలు, జై వైజాగ్‌ అనాలని అక్కడి ప్రజలను రెచ్చగొడతారు. ఈ నెల 2న నిర్వహించాల్సిన లాంగ్‌మార్చ్‌ వాయిదాకు కారణం ఢిల్లీ ఎన్నికలే. త్వరలో ఢిల్లీ నుంచి పెద్దలు వస్తారు. వారితో కలిసి లాంగ్‌మార్చ్‌ నిర్వహించి అమరావతిని పరిరక్షిస్తాం.’


ఆ ఎమ్మెల్యే ఉన్నారో లేదో..

‘నాకు అధికారం లేదు.. ఉన్న ఒక్క ఎమ్మెల్యే ఉన్నారో లేదో తెలియదు.. నేను ఓట్ల కోసం రాలేదు. మీకు ఆసరాగా ఉండాలని వచ్చాను. రైతులపై జరిగిన దాడిని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాను. రాజకీయ క్రీడల్లో పోలీసులు భాగం కాకూడదు.’అహంకారం నెత్తికెక్కితే..


ఎంత గొప్పవాడైనా అహంకారం నెత్తికెక్కి నిర్ణయాలు తీసుకుంటే ఏదో ఒక రోజు కూలిపోక తప్పదు. కత్తులు, గొడ్డళ్లతో నరికి చంపనవసరం లేదు.. ఒక్క కలం పోటుతో 42 మంది రైతులను వైసీపీ ప్రభుత్వం చంపేసింది.  రైతులు చేస్తున్న పోరాటానికి నా సంపూర్ణ మద్దతు ఉంటుంది. వాళ్లు అమరావతి కోసం కాదు.. ఆంధ్రప్రదేశ్‌ కోసం పోరాటం చేస్తున్నారు. ప్రజలు హైదరాబాద్‌లో ఆస్తులు అమ్ముకుని అమరావతిలో భూములు కొనుగోలు చేసింది రియల్‌ ఎస్టేట్‌ కోసం కాదు. మా రాజధానిలో మేం నివాసం ఉండాలని కొన్నారు. అమరావతి ఉద్యమం ప్రారంభమై.. రోజులు గడిచేకొద్దీ మనలో మనం కొట్టుకుంటామేమోనన్న భావన కలిగింది.


అయితే రాష్ట్ర ప్రజలంతా అర్థం చేసుకుంటున్నారు. ఇక్కడి రైతులు కన్నీళ్లు పెడుతుంటే ఆ రాజధానులు మాకొద్దని తేల్చిచెబుతున్నారు. ఎవరైనా అమరావతిని వ్యతిరేకిస్తున్నారంటే వాళ్లు కచ్చితంగా వైసీపీ వాళ్లే. రాజధాని గ్రామాలకు చెందిన ఏ ఒక్క రైతూ జగన్‌రెడ్డిని కలవలేదు. ఆయన్ను కలిసిన వాళ్లు రైతులే కాదు. ప్రజలను మభ్యపెట్టేందుకు రైతులు మా భూములు తిరిగిచ్చేయాలని అడిగినట్లు చిత్రీకరిస్తున్నారు. ఇక్కడ ఎవరూ భూములు వెనక్కి తీసుకోవడానికి సిద్ధంగా లేరు.’


వైసీపీ వాళ్లను ప్రశ్నించండి

‘రాజధాని విషయంలో కేంద్రం తక్కువగా మాట్లాడొచ్చు. కానీ బీజేపీ మాట్లాడుతోంది. ఇక్కడ కన్నా లక్ష్మీనారాయణ బాగా బలంగా మాట్లాడతారు. ఢిల్లీలో కొంతమంది పెద్దల మాటలు సందేహాలు కలిగిస్తాయి. వాటిని పట్టించుకోవాల్సిన పని లేదు. నేను ఢిల్లీ వెళ్లినప్పుడు ఇక్కడి రైతులపై జరిగిన దాడుల ఫొటోలు చూపించాను. మూడు రాజధానుల విషయంలో కేంద్రంతో మాట్లాడామని వైసీపీ వాళ్లు తప్పుదోవ పట్టిస్తున్నారు. మూడు రాజధానులకు అంగీకారం తెలుపుతూ ప్రధాని ఏమైనా లేఖ పంపారా..? పంపితే చూపాలని వైసీపీ వాళ్లను ప్రశ్నించండి. రాజధాని విషయంలో ప్రధానిని, అమిత్‌షాను అపార్థం చేసుకోవద్దు.’

Updated Date - 2020-02-16T09:06:29+05:30 IST