కేసీఆర్‌ కళ్లుతెరవాలంటే జానారెడ్డిని గెలిపించండి

ABN , First Publish Date - 2021-04-15T09:15:57+05:30 IST

ప్రజల మంచి, చెడు చూసే పరిస్థితుల్లో సీఎం కేసీఆర్‌ లేరని, ఆయన కళ్లు తెరవాలంటే సాగర్‌ ఓటర్లు సీనియర్‌ నేత జానారెడ్డిని గెలిపించాలని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌ అన్నారు.

కేసీఆర్‌ కళ్లుతెరవాలంటే జానారెడ్డిని గెలిపించండి

  • సాగర్‌ ఉపఎన్నిక రాష్ట్ర చరిత్రలో ఓ కీలకమలుపు
  • 2023 ఎన్నికల్లో కేసీఆర్‌ కుటుంబ చరిత్ర ఖతం: ఠాగూర్‌

నల్లగొండ, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రజల మంచి, చెడు చూసే పరిస్థితుల్లో సీఎం కేసీఆర్‌ లేరని, ఆయన కళ్లు తెరవాలంటే సాగర్‌ ఓటర్లు సీనియర్‌ నేత జానారెడ్డిని గెలిపించాలని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌ అన్నారు. నల్లగొండలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కుమారుడు కేటీఆర్‌కు  పాలన అప్పగించిన కేసీఆర్‌ ధృతరాష్ట్రుడిలా మారాడని విమర్శించారు. సీఎం ఇంట్లో కూర్చొని అధికారాన్ని అనుభవిస్తూ, రాష్ట్ర బడ్జెట్‌ను దుర్వినియోగం చేసిన డబ్బుతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. 2023 ఎన్నికల్లో కేసీఆర్‌ కుటుంబ చరిత్ర ఖతమవుతుందని జోస్యం చెప్పారు. 


సాగర్‌ ఉపఎన్నిక తెలంగాణ చరిత్రలో ఓ కీలక మలుపు కాబోతుందన్నారు. సాగర్‌లో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది జానారెడ్డి హయాంలోనేనని చెప్పారు. రూ.500 తీసుకో, బహిరంగ సభకు వచ్చి కరోనా అంటించుకో అన్నట్లుగా సీఎం ఆలోచన ఉందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. హాలియాలో రెండోసారి నిర్వహిస్తున్న సీఎం సభకు జిల్లా వ్యాప్తంగా డబ్బు, మద్యం పంపిణీచేసి, వాహనాలు ఏర్పాటుచేసి జనాన్ని తరలిస్తున్నారని ఆరోపించారు. చిన్నపిల్లవాడు సీఎం జగన్‌ సభ రద్దు చేసుకున్నాడని, ఆయనకు ఉన్న జ్ఞానం కేసీఆర్‌కు లేకుండా పోయిందన్నారు. కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తున్న సీఎం కేసీఆర్‌పై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.  సాగర్‌లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పోలీసుల వజ్రవాహనంలో టీఆర్‌ఎస్‌ నేతలు నగదు తరలిస్తున్నా రని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. జానారెడ్డి మంచి మెజారిటీతో గెలవబోతున్నారన్నారు. రాష్ట్రంలో రోజూ మూడు వేల నుంచి నాలుగు వేల వరకు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయని, ఆస్పత్రుల్లో బెడ్లు ఖాళీలేవని మంత్రి ప్రకటిస్తే సీఎం భారీ సభ ఎలా పెడతారని ప్రశ్నించారు.

Updated Date - 2021-04-15T09:15:57+05:30 IST