బహిరంగ సభలుంటే వాలిపోతారు

ABN , First Publish Date - 2022-05-18T05:47:41+05:30 IST

బహిరంగ సభలు, సమావేశాలు, జన సమూహా లు ఉంటే ఓ ముఠా ఇట్టే వాలిపోతుంది. అక్కడికి వచ్చిన వారి జేబులు ఖాళీ చేయడమే ఈ ముఠా లక్ష్యం.

బహిరంగ సభలుంటే వాలిపోతారు
వివరాలు వెల్లడిస్తున్న జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి

 దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు

నల్లగొండ టౌన్‌, మే 17: బహిరంగ సభలు, సమావేశాలు, జన సమూహా లు ఉంటే ఓ ముఠా ఇట్టే వాలిపోతుంది. అక్కడికి వచ్చిన వారి జేబులు ఖాళీ చేయడమే ఈ ముఠా లక్ష్యం. ఇటీవల నాగార్జునసాగర్‌లో జరిగిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బహిరంగ సభతో పాటు అనేక సభలు, సమావేశాల్లో చేతివాటం ప్రదర్శించిన ఈ ముఠా పోలీసులకు చిక్కింది. ఇందుకు సంబ ంధించిన వివరాలను జిల్లా పోలీస్‌ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రెమారాజేశ్వరి వెల్లడించారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన ఇట్టావాసు అలియాస్‌ కుమార్‌, ఇట్టా సుబ్బారావు అలియాస్‌ సుబ్బు, బైరోతుల వెంకటేశ్వర్లు అలియాస్‌ వెంకటేశ్వర్‌, గోదావరి ఏసోబు అలియాస్‌ కంఠం, బత్తుల ఉమా మహేశ్వర్‌ అలియాస్‌ ఉమ, గడ జోష్‌కుమార్‌ అలియాస్‌ జోష్‌, కట్ట రక్షక రాజు అలియాస్‌ రాజు, బొజ్జగాని దుర్గారావు అలియాస్‌ నాగేశ్వర్‌రావులతో పాటు ఓ బాలుడు ఒక ముఠాగా ఏర్పడ్డారు. బహిరంగ సభలు, జన సమూ హాలు అధికంగా ఉన్న ప్రాంతాలను లక్ష్యంగా ఎంచుకుని దొంగతనాలకు పాల్పడేవారు. గత నెల 29వ తేదీన నల్లగొండ జిల్లా చింతపల్లి, శాలిగౌరారం, కొండమల్లేపల్లి, గుడిపల్లి, పెద్దవూర, విజయపురి పోలీస్‌స్టేషన్ల పరిధిలో జరిగిన సభల్లో చేతివాటం ప్రదర్శించారు. వీరిపై వివిధ పోలీస్‌ స్టేషన్లలో గతంలో తొమ్మిది కేసులు కూడా నమోదయ్యాయి. మంగళవారం ఉదయం విజయపురిటౌన్‌ ఎస్‌ఐ, సిబ్బంది హిల్‌కాలనీలో పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా కొందరు వ్యక్తులు హిల్‌కాలనీ బస్టాప్‌ వద్ద కారులో అనుమానాస్పదంగా కన్పించగా వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో వారు చేసిన నేరాలను ఒప్పుకోవడంతో వారి నుంచి రూ.6లక్షల నగదు, రెండు సెల్‌ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో బాలుడితో పాటు నిందితులు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకోగా, బొజ్జగాని దుర్గారావు పరారీలో ఉన్నట్లు తెలిపారు. కేసు పురోగతిని సాధించడంలో కృషిచేసిన డీఎస్పీ వెంకటేశ్వర్‌రావు, సీసీఎస్‌ డీఎస్పీ మొగులయ్యతో పాటు సాగర్‌ సీఐ వైజీ నాయుడు, విజయపురిటౌన్‌ ఎస్‌ఐ రాంబాబును ఎస్పీ అభినందించారు. 

Updated Date - 2022-05-18T05:47:41+05:30 IST