చినుకుపడితే ఆగాల్సిందే

ABN , First Publish Date - 2022-05-06T05:30:00+05:30 IST

హైదరాబాద్‌-నాగ్‌పూర్‌ మార్గంలో హైవే-44పై ప్రయాణించే వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు.

చినుకుపడితే ఆగాల్సిందే
రామాయపల్లి ఆర్వోబీలో చేరిన వర్షపు నీరు (ఫైల్‌)

రామాయపల్లి వద్ద హైవే 44 మీద ప్రయాణికులకు తప్పని తిప్పలు

నాలుగేళ్లు దాటిన పూర్తికాని స్టీల్‌ బ్రిడ్జి నిర్మాణం

చిన్న వర్షం కురిసినా రాకపోకలకు అంతరాయం


 తూప్రాన్‌, మే 6: హైదరాబాద్‌-నాగ్‌పూర్‌ మార్గంలో హైవే-44పై ప్రయాణించే వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. చిన్నపాటి వర్షం కురిసిందంటే హైవే మీదుగా వెళ్లే వాహనాలు ఆగాల్సిందే. ఈ రూట్‌లో బ్రిడ్జి నిర్మాణ పనులు ఆలస్యం కావడంతో ప్రయాణీకులకు అవస్థలు తప్పడం లేదు. వర్షం కురిస్తే ఆ రోడ్డున వెళ్లేందుకు వాకబు చేసి వెళ్లాల్సిందే. 

 మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ నుంచి కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి వరకు మనోహరాబాద్‌ - కొత్తపల్లి రైల్వేలైన్‌ను 151 కిలోమీటర్ల పొడవున ఏర్పాటు చేస్తున్నారు. రైల్వేలైన్‌ మీదుగా భారీ స్టీల్‌ బ్రిడ్జి (బొస్టింగ్‌ గడ్డర్‌) నిర్మించేందుకు నిర్ణయించారు. దేశంలోనే అతిపెద్ద స్టీల్‌ బ్రిడ్జిగా పేర్కొంటున్న రామాయపల్లి బ్రిడ్జికి రూ.109 కోట్లను కేటాయించారు. 44 మీటర్ల పొడవుతో ఆరులేన్ల రోడ్డుగా ఏర్పాటు చేస్తున్నారు. బ్రిడ్జి, రైల్వే లైన్‌ కోసం 2018 ఆగస్టు 29న మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. మనోహరాబాద్‌ మండలం రామాయపల్లి వద్ద హైవే 44 రోడ్డును రైల్వేలైన్‌ క్రాసింగ్‌ కోసం తాత్కాలికంగా వాహనాలు వెళ్లేందుకు ఆర్వోబీని ఏర్పాటు చేశారు.  రామాయపల్లి వద్ద ఏర్పాటు చేసిన ఆర్వోబీలోకి వర్షం కురిసిన ప్రతిసారీ నీరొచ్చి చేరుతున్నది. 2020 జూన్‌ 27న కురిసిన భారీ వర్షానికి ఆర్వోబీలోకి భారీగా నీరొచ్చి చేరింది.  భారీ మోటార్లు, ట్రాక్టర్లు ఏర్పాటు చేసినా నీటిని తొలగించడానికి మూడు రోజులు పట్టింది. ఇలా వర్షం కురిసిన ప్రతిసారి ఆర్వోబీలోకి నీరొచ్చి హైవే 44 మీదుగా వెళ్లే వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. గత బుధవారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి ఆర్వోబీలోకి నీరొచ్చి చేరింది. ఫలితంగా మళ్లీ వాహనాలు కిలోమీటర్ల పొడవున నిలిచిపోయాయి. కొన్ని వాహనాలను దారి మళ్లించారు. స్టీల్‌ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే వాహనదారులకు ఇబ్బందులు తప్పుతాయి. బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసి నాలుగేళ్లు దాటిని పనులు మాత్రం పూర్తికావడం లేదు. వానాకాలం కాని ప్రారంభం అయితే ఆ రూట్‌లో వెళ్లే వారికి ఇబ్బందులు తప్పేలా లేవు. నిర్మాణ పనులు నత్తనడక సాగుతుండటంతో ప్రయాణికుడు అసహనం వ్యక్తం చేస్తున్నారు.  మనోహరాబాద్‌ నుంచి కొడకండ్ల వరకు 43 కిలోమీటర్ల  రైల్వేలైన్‌ కూడా పూర్తి చేశారు. కానీ, స్టీల్‌బ్రిడ్జి నిర్మాణ పనులపై అధికారులు దృష్టిపెట్టడం లేదని,  ఉన్నతాధికారులు, నాయకులు కల్పించుకుని త్వరగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. 

నాలుగైదు నెలల్లో పనులు పూర్తి 

 తరుణ్‌, ఎన్‌హెచ్‌ఏఐ అధికారి

రామాయపల్లి వద్ద హైవే 44పై నిర్మిస్తున్న బొస్టింగ్‌ గడ్డర్‌ వచ్చే నాలుగైదు నెలల్లో పూర్తి చేస్తాం. కొవిడ్‌ కారణంగా నిర్మాణ పనుల్లో జాప్యం జరిగింది. 44 మీటర్ల పొడవుతో, ఆరు లేన్లు కలిగి ఉంటుంది. ప్రస్తుతం పనుల్లో వేగం పెంచాం. జాప్యం లేకుండా పనులు పూర్తి చేయిస్తాం. 



Read more