మనవాడైతే మహనీయుడైపోతాడా!

ABN , First Publish Date - 2021-10-06T06:18:45+05:30 IST

‘‘ముప్పైలోగా కమ్యూనిస్టువి కాకపోతే నీకు హృదయం లేదు. ముప్పై తరువాత నువ్వు కమ్యూనిస్టువైతే నీకు బుద్ధి లేదు’’ అన్నది నానుడి. చాలావరకు అవకాశవాద రాజకీయ నాయకులెవరూ ఇందుకు మినహాయింపు కాదు...

మనవాడైతే మహనీయుడైపోతాడా!

‘‘ముప్పైలోగా కమ్యూనిస్టువి కాకపోతే నీకు హృదయం లేదు. ముప్పై తరువాత నువ్వు కమ్యూనిస్టువైతే నీకు బుద్ధి లేదు’’ అన్నది నానుడి. చాలావరకు అవకాశవాద రాజకీయ నాయకులెవరూ ఇందుకు మినహాయింపు కాదు. అలాంటివారి గురించి ఉన్నదున్నట్టు రాయడం సబబు. అంతేగానీ, చనిపోయినంత మాత్రాన, సన్నిహితులైనంత మాత్రాన వారికి లేనిపోని ఘనత ఆపాదించవలసిన అవసరం లేదు. చరిత్రకు మసి పూసి మారేడుకాయ చేయవలసిన అవసరం అంతకంటే లేదు. దీన్ని అందరూ జ్ఞాపకముంచుకోవాలి. వాళ్లెవరైనా సరే! చెరుకూరి సత్యనారాయణ (సెప్టెంబర్‌ 30న ఆంధ్రజ్యోతిలో) కావచ్చు, మరో పత్రికలో సుధాకిరణ్‌ కావచ్చు  (మరణించిన వారి గురించి చెడ్డగా మాట్లాడడం నా సంస్కారం కాదు; మా పాటికి మమ్మల్ని వదలక రెచ్చగొట్టినప్పుడు కొన్ని నిజాలను బట్టబయలు చేయక తప్పని అసహాయ స్థితి మాది).


సుధాకిరణ్‌ గారూ! మీరు ఓ పార్శ్వాన్ని వదిలేశారు. అదేంటో తెలుసుకోవాలంటే ప్రొద్దుటూరు రాజకీయ చరిత్రను క్షుణ్ణంగా పరిశీలించండి. ఓపిక తక్కువైతే, ప్రముఖ కవి, ఒకప్పటి కమ్యూనిస్టు నాయకుడు, ప్రొద్దుటూరు రాజకీయాలను అతి దగ్గరగా పరిశీలించిన స్వర్గీయ గజ్జెల మల్లారెడ్డి ఆత్మకథ ‘మనస్సాక్షి’లో 128వ పుట చదవండి అవ‘గత’మవుతుంది.


అయ్యా సత్యనారాయణ గారూ! తండ్రి హత్యకు గురైతే కూతురు (పేరు తెలియకపోతే అక్కడితో ఆపేయాలి గానీ ‘కాకినాడ మెడికో’ అని ఈసడింపుగా రాయడం సాటి మనుషుల – అదీ ఓ ఆడకూతురు – పట్ల మీకున్న గౌరవం తేటతెల్లమవుతోంది) కోర్టులో సాక్ష్యమిస్తేనే మీకు ‘దిగ్ర్భాంతి’ కలిగితే, కన్నతండ్రిని కోల్పోయి, కుటుంబమే ఛిన్నాభిన్నమైతే ఆ కూతురు ఎంత క్షోభించిందో (గతించిన వ్యక్తి గాంధేయవాదై, గడవడానికి చిల్లిగవ్వ కూడా లేకపోతే...), ఆ కుటుంబం ఎంత దిగ్ర్భాంతి చెందిందో, ఎన్ని కష్టాలకు గుర య్యిందో మనసున్న ఏ మనిషికైనా అర్థమవుతుంది. ఇంటి పెద్ద అకాలమరణం పొందితే, ఇంటి వారి ఇడుములు తెలియని ఇంగితం మీకు లేదేమో? పోనీ మదనపల్లి స్పిన్నింగ్‌ మిల్లు గేటుకు వేలాడదీయబడిన తల నడగండి. చెబుతుంది. ప్రొద్దుటూరు జూటూరు కుటుంబాన్నడగండి. చెబుతుంది.


మీరన్నవన్నీ నిజమైతే ‘ఎలిబీ’ దాఖలు చేయలేకపోయారా? నిరాధారమని నిరూపించలేకపోయారా? జడ్జి ఓ నాయకుడి బావమరిది అయినంత మాత్రాన సానుకూలమైన జడ్జిమెంట్‌ ఇవ్వలేదని వాపోతున్నారా? ఇవేనా మీ మౌలిక విలువలు? హైకోర్టు విడుదల చేస్తే (మరోమారు ‘రెక్కలు చాచిన పంజరం’ మున్నుడిలో కృతజ్ఞతలు చదవండి. అన్నీ బాగా అర్థమవుతాయి) సబబు, మిగతా కోర్టులు శిక్షిస్తే అనుమానాస్పదమా?


పోనీ ఆ హత్య కేసు అలా ఉంచండి. మీరు ఉటంకించిన ‘జంట హత్యల’ విషయమేంటి? వాళ్లందరికీ, వ్యవస్థకు ఒక ముద్దాయి అలుసుగా దొరికాడా? ఎందుకీ అవాకులు? ‘శాసనసభ్యుడిగా ఉండగా ఆ అప్పీలును సునాయాసంగా ఉపసంహరించుకోగల అవకాశమున్నా ఆ పని చేయలేదు’ అన్నారు. ఇది నిజమా? లేక అప్పటికే విసిగిపోయిన అధికారంలో ఉన్న ఆయన పార్టీ ప్రభుత్వమే జాప్యం చేయకుండా సుప్రీంకోర్టుకు అప్పీలు చేయడం నిజమా?– మరోసారి తరచిచూచి తెలుసుకోండి. పదవి కోల్పోయిన ప్రతి రాజకీయ నాయకుడూ తమ స్వార్థం కోసం ప్రాంతీయతత్వాలను రాజేయడం చరిత్రలో పలుమార్లు పునరావృతం. వాళ్ళకో, వాళ్ళవాళ్ళకో పదవులు, ప్రాధాన్యత, రాజకీయలబ్ధి లభించగానే మానుకోవడం కూడా అంతే. అది అన్యాయాన్ని ఎదిరించే మొక్కవోని లక్ష్యమైతే తెలుగు రాష్ట్రాలు ఈ పాటికి మూడు ముక్కలయ్యుండేవి. కాలేదు. అలాంటి వారిని ఉద్యమకారులుగా అభివర్ణించడం అతిశయోక్తే. కార్మికనాయకులు సాటి కార్మికుల మీద సోడాబుడ్లతో దాడి చేయరు సుమా!


విప్లవ పంథా నుంచి పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మారడం సబబేనేమో! (ఇన్నాళ్ళూ వ్యవస్థను దుయ్యబట్టి, ఇప్పుడు అదే వ్యవస్థలో అంతర్భాగమైన కేంద్ర సాహిత్య అకాడెమీ నుంచి ఇటీవలే అవార్డును అందుకున్న ‘దిగంబర’ కవి కూడా దాన్ని బలపరుస్తారేమో.) ప్రతి వ్యాపారస్థుడిని పెట్టుబడిదారునిగా విమర్శించి, తనే వ్యాపారవేత్త కావడం, పక్షానికో పక్షం మార్చి, ‘ఎగ్జిస్టెన్స్‌’ అని దాటేయడం– అవకాశవాదం, ప్లేట్‌ ఫిరాయింపులు కాదా?? మీ మనస్సాక్షిని అడగండి. పత్రికలు ఉన్నాయి కదా అని ఏకోన్ముఖంగా ఏదైనా రాయొచ్చని సమతుల్యత లేకుండా, అనవసరంగా మిగతావాళ్ళని నొప్పించేలా రాయడం– విలువల వలువలు ఊడ్చినట్లే.

ప్రతాప్‌రెడ్డి రాజులపల్లి

Updated Date - 2021-10-06T06:18:45+05:30 IST