అధికారంలోకి వస్తే తొలి సంతకం ఉద్యోగాల కల్పన ఫైల్‌పైనే

ABN , First Publish Date - 2022-09-25T05:12:06+05:30 IST

అధికారంలోకి వస్తే.. తొలి సంతకం భారీ ఉద్యోగాల కల్పన ఫైలుపైనే పెడతానని వైయస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఆమె చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర శనివారం సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలానికి చేరుకుని, 2,200 కిలోమీటర్లు ముగించుకున్నది.

అధికారంలోకి వస్తే తొలి సంతకం ఉద్యోగాల కల్పన ఫైల్‌పైనే
సదాశివపేటలో మాట్లాడుతున్న వైఎస్‌ షర్మిల

  ప్రజాప్రస్థానం పాదయాత్రలో వైఎస్‌ షర్మిల


సదాశివపేట/సదాశివపేట రూరల్‌, సెప్టెంబరు 24: అధికారంలోకి వస్తే.. తొలి సంతకం భారీ ఉద్యోగాల కల్పన ఫైలుపైనే పెడతానని వైయస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఆమె చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర శనివారం సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలానికి చేరుకుని, 2,200 కిలోమీటర్లు ముగించుకున్నది. సదాశివపేట పట్టణంలో 65 జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో వైఎస్‌ షర్మిల ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. దివంగత సీఎం వైఎ్‌సఆర్‌ ఏ పథకం రూపొందించినా ప్రజల అవసరాలు దృష్టిలో పెట్టుకొని రూపకల్పన చేశారన్నారు. ముఖ్యమంత్రి అంటే వైఎస్సార్‌ అన్నారు. ఇప్పుడున్న సీఎం కేసీఆర్‌ అసలు ముఖ్యమంత్రేనా? అని ఆమె ప్రశ్నించారు. ఎనిమిది ఏళ్లుగా కేసీఆర్‌ ప్రజలను మోసమే చేస్తున్నాడన్నారు. రైతులకు రుణమాఫీ, దళితులకు మూడు ఎకరాల భూమి, పేద విద్యార్థులకు కేజీ టూ పీజీ ఉచిత విద్య, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, పేదలకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు, రైతుల పోడు భూములకు పట్టాలు అని హామీలు ఇచ్చి నెరవేర్చని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మోసగాడు అని షర్మిల మండిపడ్డారు. ఉద్యోగాలు కావాలి అంటే హమాలీ పని చేసుకోవాలని ఓ మంత్రి అనడం తగదన్నారు. రైతులకు సీఎం కేసీఆర్‌ రుణమాఫీ అమలు చేస్తా అని రైతులను బ్యాంకుల్లో డిఫాల్టర్స్‌ చేశాడన్నారు. తీసుకున్న అప్పులు కట్టలేకపోవడంతో రైతులకు బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడం లేదన్నారు. 24 గంటల కరెంట్‌, ఉచిత మీటర్లు అని చెప్పి ఇవ్వడం లేదన్నారు. కేసీఆర్‌కు ఓట్లు వేయించుకొని ఫామ్‌హోజ్‌కి వెళ్లిపోవడం మాత్రమే తెలుసని వ్యాఖ్యానించారు. ఇది బంగారు తెలంగాణ కాదు, బతుకే లేని తెలంగాణా అన్నారు. ఇది బీర్ల తెలంగాణ.. బార్ల తెలంగాణ అని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు మెగా కృష్ణారెడ్డికి అమ్ముడు పోయి సైలెంట్‌ అయ్యాయని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు రేవంత్‌రెడ్డి ఓ దొంగ, బ్లాక్‌మెయిలర్‌ అని షర్మిల ఆరోపించారు. బీజేపీ ఒక మత పిచ్చి పార్టీ అన్నారు. ఆ పార్టీ విభజన హామీలు ఒక్కటీ కూడా నెరవేర్చలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజల భవిష్యత్‌ కోసం ఆరాటపడే పార్టీకే ఓటు వేయాలని ఆమె పిలుపునిచ్చారు. వైయస్సార్‌టీపీతోనే సంక్షేమ పాలన సాధ్యమని షర్మిల అన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరెడ్డి శ్రీధర్‌రెడ్డి, నాయకులు కొండా రాఘవరెడ్డి, నాడేం శాంతకుమార్‌, పిట్ట రాంరెడ్డి, చైతన్యరెడ్డి, తుకారంగౌడ్‌, భూంరెడ్డి, నరే్‌షరెడ్డి, సురేందర్‌, లక్ష్మణ్‌, నవాజ్‌, కొండలరెడ్డి, మోహన్‌నాయక్‌, జై రాజ్‌, ఉదయ్‌రాజు తదితరులు పాల్గొన్నారు.


 

Updated Date - 2022-09-25T05:12:06+05:30 IST