అధికారంలోకి వస్తే.. బిర్యానీ తినిపిస్తా..!

ABN , First Publish Date - 2022-08-18T06:38:28+05:30 IST

సీఎం పీఠమే లక్ష్యంగా జగన్‌ అలుపెరగని పోరాటం చేశారు. ఓదార్పు యాత్ర పేరిట రాష్ట్రాన్ని చుట్టేశారు. పాదయాత్రలో అనేక హామీలు ఇచ్చారు. అనంతరం చేపట్టిన పాదయాత్ర లోనూ దారి పొడవునా లెక్కలేనన్ని హామీలు గుప్పించారు. చివరగా నవరత్నాలు అంటూ

అధికారంలోకి వస్తే.. బిర్యానీ తినిపిస్తా..!

నాలుగు రెట్లు సంపాదన చూపిస్తా 

ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు ప్రతిపక్ష నేత హోదాలో కార్యకర్తలకు జగన్‌ హామీ 

అప్పట్లో ఆయన మాట నమ్మి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్న కార్యకర్తలు

సీఎం అయ్యాక కార్యకర్తలను పట్టించుకోని వైనం 

లబోదిబోమంటున్న వైసీపీ శ్రేణులు


‘‘మీరంతా ఇంత కాలం ఓపిక పట్టారు. ఇంకో రెండేళ్లు ఓపిక పట్టండి. మిమ్మల్ని అందరినీ ఆదుకుంటాను. ఇప్పుడు అధికారపక్షంలో ఉంటున్న వారు బిర్యానీ తింటున్నారు. మనం పచ్చడి మెతుకులు తింటున్నాం. విలువలు పోగొట్టుకొని అలాంటి బిర్యానీ కోసం పోవద్దు. రెండేళ్లు ఉంటే నేనే బిర్యానీ తినిపిస్తాను. ఏడాది జరిగితే చంద్రబాబునాయుడు మాట ఏ అధికారి వినడు.. రెండేళ్లలో మన ప్రభుత్వం వస్తుంది. 14 రీళ్ల సినిమాలో 13వ రీల్‌ వరకు విలన్‌దే ఆధిపత్యం ఉంటుంది. 14వ రీల్‌లో హీరో విలన్‌ను లాగి చెంపదెబ్బ కొట్టి అన్యాయాలకు అంతం పలుకుతాడు. భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌లో కూడా న్యాయమే గెలుస్తుంది. మీ అందరి (కార్యకర్తల) బాగోగులు చూసుకుంటాను’’ అని ప్రతిపక్ష నేత హోదాలో 2017 ఫిబ్రవరి 3న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కడప నగర శివారులోని జయరాజ్‌ గార్డెన్‌లో జరిగిన ఉమ్మడి కడప జిల్లా నియోజకవర్గాల స్థానిక ప్రజాప్రతినిధుల సమావేశంలో కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఆ మేరకు జగన్‌ను సీఎం చేసేందుకు కార్యకర్తలంతా కష్టపడ్డారు. సీన్‌ కట్‌ చేస్తే.. వీరంతా ఇప్పుడు లబోదిబోమంటున్నారు. కొందరికే పదవులు, పెత్తనం ఇచ్చారని తమను పట్టించుకోవడం లేదని మెజారిటీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బిర్యానీ కాదు కదా.. పచ్చడి మెతుకులకు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందని ఆవేదన చెందుతున్నారు. 


(కడప - ఆంధ్రజ్యోతి): సీఎం పీఠమే లక్ష్యంగా జగన్‌ అలుపెరగని పోరాటం చేశారు. ఓదార్పు యాత్ర పేరిట రాష్ట్రాన్ని చుట్టేశారు. పాదయాత్రలో అనేక హామీలు ఇచ్చారు. అనంతరం చేపట్టిన పాదయాత్ర లోనూ దారి పొడవునా లెక్కలేనన్ని హామీలు గుప్పించారు. చివరగా నవరత్నాలు అంటూ మేనిఫెస్టో తీసుకొచ్చారు. జిల్లాలో టీడీపీకి సుశిక్షితులైన కార్యకర్తలు, బలమైన ఓటు బ్యాంకు ఉంది. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సొంత జిల్లా అయినప్పటికీ 1994, 1999లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ మెజార్టీ అసెంబ్లీ స్థానాలను దక్కించుకుంది. అయితే దివంగత వైఎస్‌ సీఎం అయిన తరువాత టీడీపీ నాయకుల్లో పట్టుదల కొరవడ్డంతో క్రమేపీ 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌, 2014లో వైసీపీ సత్తా చాటాయి. 2019 ఎన్నికల్లో విజయం వైసీపీకి తప్పనిసరిగా మారింది.


జగన్‌ కోసం..

ముఖ్యమంత్రి పదవే లక్ష్యంగా జగన్‌ అడుగులు వేశా రు. అందుకు తగ్గట్లుగా కార్యకర్తలకు నేను ఉన్నా అం టూ భరోసా కల్పించారు. మన ప్రభుత్వం ఏర్పడితే 30 ఏళ్లు అధికారంలో ఉంటాం. కష్టాల్లో నాతో నడిచిన వారందరికి భవిష్యత్తు సూపర్‌గా ఉంటుందంటూ త్రీడీలో సినిమా చూపించారు. అంతే.. కార్యకర్తలు జగన్‌ను సీఎం చేయాలనే ఉద్దేశంతో అహర్నిశలు కష్టపడ్డారు. కన్నబిడ్డల పుట్టిన రోజులు, కుటుంబీకుల సంవత్సరీకాలను పట్టించుకోకుండా దివంగత వైఎ్‌సఆర్‌ వర్ధంతి వేడుకలు, జగన్‌ పుట్టిన రోజు, పెళ్లిరోజు వేడుకలు, పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి కా ర్యకర్తలు తమ శక్తికి మించి అప్పులు చేసి ఖర్చు పెట్టారు. జగనన్న సీఎం అయితే తమ బతుకులు బాగుపడుతాయనే ఉద్దేశంతో కార్యకర్తలు ఆర్థిక కష్టాన్ని భరించి కష్టపడ్డారు. ఇపుడు మీరంతా పచ్చడి మెతుకులు తింటున్నారు, మీరు బిర్యాని కోసం కక్కుర్తి పడొద్దు, ఆర్థికంగా మిమ్మల్ని ఆదుకుంటానని వైఎస్‌ జగన్‌ హామీ ఇవ్వడంతో 2019 ఎన్నికల్లో వైసీపీ శ్రేణులు డూ ఆర్‌ డైగా రంగంలోకి దిగి కష్టపడ్డారు. గెలుపు కోసం సొంత డబ్బులు ఖర్చు చేశారు. వారు ఆశంచినట్టు జగన్‌ సీఎం అయ్యారు. ఇక తాము బాగుపడతాము. తమ ఊరు బాగుపడుతుంది. తమను నమ్ముకున్నోళ్లు బాగుపడతారు అని సంబరపడ్డారు. 


కార్యకర్తలకు టోపీ

జగన్‌ పై అభిమానంతో తొలినాళ్లలో కొందరు కార్యకర్తలు జగనన్న హౌసింగ్‌ లేఔట్లలో మౌలిక  వసతులు, సచివాలయాలు, రైతుభరోసా కేంద్ర భవన నిర్మాణాలకు పూనుకున్నారు. నెలలు గడుస్తున్నా బిల్లులు లేవు. జగనన్న చెబుతున్న నవరత్నాలు, బటన్‌ నొక్కుడు కార్యక్రమం అంతా మిథ్యగా మారింది. లబ్ధిదారుల సంఖ్య తగ్గించుకునేందుకు రకరకాల నిబంధనలను ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. దీంతో ఎన్నో ఏళ్ల నుంచి పింఛన్లు పొందుతున్న వారిని తొలగించేశారు. దీంతో పాటు కరెంట్‌ చార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి. పల్లెల నుంచి పట్టణాల వరకు జగన్‌ ఎఫెక్ట్‌ పడింది. అటు బిల్లులు రాకపోవడం, అటు అభివృద్ధి లేకపోవడంతో కరుడుగట్టిన జగన్‌ అభిమానుల్లో నిరాశ మొదలైంది. మూడేళ్లు అయిపోయింది. వైసీపీ ప్రభుత్వంలో కేవలం ఒక సామాజిక వర్గంలోని కొందరికే పార్టీ పదవులు. అధికార పెత్తనాల్లో వారిదే పైచేయి. దీంతో ప్రతిపక్ష నేతగా ఉన్న జగనన్నకు సీఎం జగన్‌కు కార్యకర్తలు పోలిక చూసుకుంటున్నారు.


కొందరికే పెత్తనం

మూడేళ్ల జగన్‌ పాలన చూస్తే కీలకమైన కార్పొరేషన్‌ పదవులన్నీ కొందరికే దక్కాయి. కడప కొందరికే పరిమితమైంది. కార్పొరేషన్‌ పాలకవర్గంలో కూడా కొందరికే పెత్తనం ఉంది. కమలాపురంలో అయితే ఓ ఇద్ద రు నేతలు వారి అనుచరులు, బద్వేలులో ఓ నేత అనుచరులు, జమ్మలమడుగులో ఓ నేత, ప్రొద్దుటూ రులో ఓ నేత ఆయన అనుచరులు,  మైదుకూరులో ఒకరు, పులివెందులలో చెప్పాల్సిన పనిలేదు జగన్‌ కుటుంబీకులు... ఇలా ప్రతి నియోజకవర్గంలోనూ ఓ ఇద్దరు ముగ్గురు నేతలదే పెత్తనం. అధికారులపై అజమాయిషీ, కాంట్రాక్ట్‌ పనులన్నీ ఆ ఇద్దరు ముగ్గు రికి.. వారి అనుచరులకే. దీంతో మిగిలిన కార్యకర్త లంతా మాకు బిర్యానీ కాదు కదా.. కనీసం పప్పన్నం కూడా తిని ప్రశాంతంగా ఉండనిచ్చేలా లేరంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-08-18T06:38:28+05:30 IST