‘ఒంటరి’గా దొరికితే వదలడు

ABN , First Publish Date - 2022-08-05T09:01:03+05:30 IST

‘ఒంటరి’గా దొరికితే వదలడు

‘ఒంటరి’గా దొరికితే వదలడు

ట్రాప్‌లోకి లాగి నగలు దోచేస్తాడు

బంగారు వ్యాపారినంటూ పరిచయం

పెళ్లి చేసుకుందామని ముగ్గులోకి...

32 మంది ఒంటరి మహిళలకు వల

ఆట కట్టించిన విజయవాడ పోలీస్‌


విజయవాడ, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి) : అతడికి ఆహ్వానంతో పనిలేదు. పిలిచినా పిలవకపోయినా కచ్చితంగా పెళ్లిళ్లకు హాజరవుతాడు. అక్కడ ఏదో కారణంగా భర్తకు దూరంగా జీవిస్తున్న మహిళలను ట్రాప్‌లో వేసుకుంటారు. వారిలో ఏర్పడే పరిచయాన్ని ఆ తర్వాతా కొనసాగించి చిన్నగా వారిని పెళ్లి వరకు తీసుకొస్తాడు. సందు చూసి వారి వంటిపై ఆభరణాలను దోచేసి అక్కడినుంచి ఉడాయిస్తాడు. ఇప్పటివరకు మొత్తం 32 మంది మహిళలకు ఇలా ట్రాప్‌ చేయగా, అతని నుంచి విజయవాడ పోలీసులు 61.5 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. ఇంతమందిని ఎలా ట్రాప్‌ చేశావని ప్రశ్నించగా, ‘‘ఐదు నిమిషాలు మహిళల చూపును గమనిస్తాను. వాళ్లు నా ట్రాప్‌లోకి వస్తారో రారో ఆ క్షణమే తెలిసిపోతుంది’’ అని అతడు ఇచ్చిన సమాధానం పోలీసు వర్గాలనే  నివ్వెరపరిచింది. దీనికి సంబంధించిన వివరాలను విజయవాడ డీసీపీ విశాల్‌ గున్నీ, ఏసీపీ బీ రవికిరణ్‌ గురువారం మీడియాకు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం, నెల్లూరు జిల్లా కోట మండలానికి చెందిన చేవూరి చంద్ర అలియాస్‌ వెందేటి చంద్ర (56) పెద్దగా చదువుకోలేదు. 14ఏళ్ల వయస్సులో ఇంటి నుంచి పారిపోయి తిరుపతి చేరుకుని ఆ లాడ్జిలో పనికి కుదిరాడు. అక్కడకు వచ్చి వ్యభిచారం చేసే కొందరి మహిళలను చూసినప్పుడు అతడికి ఒక ఆలోచన వచ్చింది. తనను తాను బంగారు వ్యాపారిగా పరిచయం చేసుకుంటూ... ఒంటరి మహిళలపై గురిపెట్టి, వారి వంటిపై ఆభరణాలు కొట్టేయడం మొదలుపెట్టాడు. ఇప్పటి వరకు చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, గుంటూరు, విజయవాడ, చెన్నై, ఏలూరు ప్రాంతాల్లో మోసాలకు పాల్పడ్డాడు. గూడూరులో రెండుసార్లు పోలీసు కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. లోగడ విజయవాడ పోలీసులు కూడా అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ ఏడాది జనవరిలో జైలు నుంచి బయటకు వచ్చి తిరిగి పాత బాటలోనే ప్రయాణం మొదలుపెట్టాడు. జూన్‌ నెలలో విజయవాడ భవానీపురానికి చెందిన మహిళ గత నెలలో చేసిన ఫిర్యాదుతో పోలీసులు అప్రమత్తమయ్యారు. విజయవాడలోని అన్ని లాడ్జీలకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో అనంతపురానికి చెందిన ఓ మహిళను తీసుకుని ఒక లాడ్జికి చంద్ర రాగా, అక్కడి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతపురం మహిళతోపాటు చంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని కోర్టులో గురువారం హాజరుపరిచారు. 

Updated Date - 2022-08-05T09:01:03+05:30 IST