ఆడపిల్ల పుడితే ఆ ఊరంతా సంబరాలే...

ABN , First Publish Date - 2020-07-12T20:26:36+05:30 IST

ఆడపిల్ల పుట్టబోతోందంటే... చాలా కుటుంబాల్లో కొంత నిర్లిప్తత చోటుచేసుకుంటుండడం తెలిసిందే. ఆ శిశువును కడుపులోనే చంపివేసే యత్నాలు జరుగుతుండడం కూడా వినే ఉంటాం. కానీ... ఆడపిల్ల పుట్టిందంటే... ఆ ఊళ్ళో మాత్రం... సంబరాలు చేసుకుంటారు

ఆడపిల్ల పుడితే ఆ ఊరంతా సంబరాలే...

కొండాపూర్ : ఆడపిల్ల పుట్టబోతోందంటే... చాలా కుటుంబాల్లో కొంత నిర్లిప్తత చోటుచేసుకుంటుండడం తెలిసిందే. ఆ శిశువును కడుపులోనే చంపివేసే యత్నాలు జరుగుతుండడం కూడా వినే ఉంటాం. కానీ... ఆడపిల్ల పుట్టిందంటే... ఆ ఊళ్ళో మాత్రం... సంబరాలు చేసుకుంటారు.


సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని హరిదాసుపూర్ గ్రామానిదే ఈ ప్రత్యేకత. ఇది చాలా చిన్న గ్రామం. అయితే... ఇదేదో ఆచారం ప్రకారమో, సాంప్రదాయం ప్రకారమో జరుగుతున్నది కాదు. ఆడపిల్లలు పుడితే చంపివేయడం మహాపాపమని, అసలు అదో దుష్ట సాంప్రదాయమని భావించిన నేపధ్యంలో ఆ గ్రామాస్తులు కొంత కాలం క్రితం ఓ సమావేశం పెట్టుకుని ఆడపిల్ల పుడితే అదృష్టంగా భావించాలన్న రీతిలో ఓ తీర్మానం చేసుకున్నారు.


ఇదే క్రమంలో... ఊరంతా చాటింపు వేసి, ఎవరికి ఆడబిడ్డ పుట్టినా కూడా ఊరంతా ఒక పండుగలాగా చేసుకోవాలని ప్రకటించారు. దీంతోపాటు గ్రామంలో... ఎవరైనా గర్భవతి అయి ఉంటే వారికి ఆడబిడ్డ పుట్టాలని అందరూ వేడుకోవాలన్న ప్రకటన కూడా చేశారు.


ఆ ఊరిలో ఎవరికైనా అమ్మాయి పుడితే ఆ బిడ్డ పెంపకానికి పంచాయతీ నుంచి కొంత డబ్బు ఇచ్చేలా కూడా గ్రామస్తులు తీర్మానం చేసుకోవడం విశేషం. తమ నిర్ణయాలను... ఈ ఏడాది జనవరి నుంచి అమలు చేస్తుండడం విశేషం. 

Updated Date - 2020-07-12T20:26:36+05:30 IST