ఫాస్టాగ్‌ ఉంటేనే...

ABN , First Publish Date - 2020-12-05T06:10:42+05:30 IST

జాతీయ రహదారిపై టోల్‌ ప్లాజాల వద్ద జనవరి ఒకటో తేదీ నుంచి ‘ఫాస్టాగ్‌’ వున్న వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. ఒకవేళ ‘ఫాస్టాగ్‌’ లేకపోతే...రెట్టింపు టోల్‌ ఫీజు వసూలుచేస్తామని నక్కపల్లి మండలం వేంపాడు వద్ద గల టోల్‌ ప్లాజా మేనేజర్‌ వెంకటరమణ తెలిపారు.

ఫాస్టాగ్‌ ఉంటేనే...
వేంపాడు టోల్‌ప్లాజా

వచ్చే నెల ఒకటి నుంచి టోల్‌ ప్లాజాల వద్ద వాహనాల రాకపోకలకు అనుమతి

ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ జారీకి కూడా ఇదే నిబంధన

ఫాస్టాగ్‌ లేని వాహనాలకురెట్టింపు ఫీజు వసూలు

కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు 


నక్కపల్లి, డిసెంబరు 4: జాతీయ రహదారిపై టోల్‌ ప్లాజాల వద్ద జనవరి ఒకటో తేదీ నుంచి ‘ఫాస్టాగ్‌’ వున్న వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. ఒకవేళ ‘ఫాస్టాగ్‌’ లేకపోతే...రెట్టింపు టోల్‌ ఫీజు వసూలుచేస్తామని నక్కపల్లి మండలం వేంపాడు వద్ద గల టోల్‌ ప్లాజా మేనేజర్‌ వెంకటరమణ తెలిపారు. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై వున్న టోల్‌ప్లాజాల వద్ద జనవరి ఒకటి నుంచి ఫాస్టాగ్‌ స్టిక్కర్లు వున్న వాహనాలను మాత్రమే అనుమతించాలని, అవి వున్న వాహనాలకే ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ దేశంలోని అన్ని టోల్‌ప్లాజాలకు ఉత్తర్వులు జారీచేసింది. వాస్తవంగా వేంపాడు టోల్‌ ప్లాజా వద్ద ఈ ఏడాది జనవరి నుంచి ఫాస్టాగ్‌ విధానంలో (ఎలక్ర్టానిక్‌ టోల్‌ కలెక్షన్‌-ఈటీసీ) టోల్‌ ఫీజు వసూలు చేస్తున్నారు. ఇక్కడ ఒక్కో వైపు నాలుగు చొప్పున మొత్తం ఎనిమిది మార్గాలు ఉన్నాయి. వీటిలో ఆరింటిని పూర్తిగా ఫాస్టాగ్‌ వున్న వాహనాలకు కేటాయించారు. ఫాస్టాగ్‌ స్టిక్కర్లు లేని వాహనాల కోసం ఇరువైపులా ఒక్కో కౌంటర్‌ చొప్పున నిర్వహిస్తూ నగదు రూపంలో ఫీజు వసూలు చేస్తున్నారు. కాగా కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు వచ్చే జనవరి ఒకటో తేదీ నుంచి వేంపాడు టోల్‌ ప్లాజాలోని అన్ని (8) మార్గాల్లో ఫాస్టాగ్‌ విధానం అమలులోకి వస్తుంది. గతంలో వున్న ఆరు మార్గాలతోపాటు మిగిలిన రెండు మార్గాల్లో కూడా కెమెరాలు, స్కానర్లు ఏర్పాటుచేస్తు న్నారు. ఒకవేళ ఫాస్టాగ్‌ స్టిక్కర్‌ లేకపోతే...ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రెట్టింపు ఫీజు వసూలు చేస్తామని, ఆ మేరకు రశీదు కూడా జారీచేస్తామని టోల్‌ ప్లాజా మేనేజర్‌ వెంకటరమణ ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు. ప్రస్తుతం రోజుకు 15 వేల వరకు వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయని, వీటిలో 70 శాతానికిపైగా వాహనాలకు ఫాస్టాగ్‌ వుందని తెలిపారు.

Updated Date - 2020-12-05T06:10:42+05:30 IST