‘కారు’దేగెలుపు

ABN , First Publish Date - 2022-07-15T09:18:00+05:30 IST

రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్‌ఎస్‌ పార్టీనే అధిక సీట్లు సాధించనుందని ‘ఆత్మసాక్షి’ గ్రూప్‌ తెలంగాణవ్యాప్తంగా జరిపిన తాజా సర్వేలో వెల్లడైంది.

‘కారు’దేగెలుపు

  • ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే
  • ఓట్లు, సీట్లు తగ్గినా టీఆర్‌ఎ్‌సకే అధిక్యం
  • ఆ పార్టీకి 39.5% ఓట్లతో 56-59 దాకా సీట్లు
  • హస్తానికి 31.5% ఓట్లతో 37-39 సీట్లు 
  • బీజేపీకి 21% ఓట్లు.. 14-16 సీట్లు రావొచ్చు
  • పలు జిల్లాల్లో పోటీ టీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌ మధ్యే
  • వైఎస్సార్‌టీపీ వల్ల కాంగ్రె్‌సకు 7 సీట్లలో మైనస్‌
  • ‘ఆత్మసాక్షి’ గ్రూప్‌ సర్వేలో ఆసక్తికర అంశాలు


హైదరాబాద్‌, జూలై 14, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్‌ఎస్‌ పార్టీనే అధిక సీట్లు సాధించనుందని ‘ఆత్మసాక్షి’ గ్రూప్‌ తెలంగాణవ్యాప్తంగా జరిపిన తాజా సర్వేలో వెల్లడైంది. గత ఎన్నికలతో పోలిస్తే సీట్లు, ఓట్లు తగ్గినా మొత్తానికి విజయం మాత్రం ఆ పార్టీదేనని.. టీఆర్‌ఎ్‌స-కాంగ్రెస్‌ పార్టీల మధ్యే ప్రధానంగా పోటీ నెలకొందని తేలింది. ఆ సర్వే  ప్రకారం.. టీఆర్‌ఎ్‌సకు 39.5% ఓట్లతో 56 నుంచి 59 స్థానాలు రానున్నాయి. కాంగ్రె్‌సకు 31.5% ఓట్లతో 37 నుంచి 39 దాకా స్థానాలు వచ్చే అవకాశం ఉంది. బీజేపీకి 21% ఓట్లు.. 14 నుంచి 16 దాకా సీట్లు వస్తాయని వెల్లడైంది. పలు జిల్లాల్లో టీఆర్‌ఎ్‌స-కాంగ్రె్‌సల మధ్యనే పోటీ ఉంటుందని.. కొన్ని జిల్లాల్లో మాత్రం మూడుపార్టీల మధ్య పోరు ఉంటుందని తేలింది. అలాగే.. మజ్లిస్‌ పార్టీకి 2.75 శాతం ఓట్లు, ఇతరులకు 3.25శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని వెల్లడైంది. ఇక ఈ సర్వేలో పాల్గొన్నవారిలో రెండు శాతం మంది ఉన్నారు. వీరిలో అత్యధికులు.. అధికారంలోకి వస్తుందనుకున్న పార్టీ వైపే మొగ్గుచూపే అవకాశం ఉందని సర్వే నివేదికలో పేర్కొన్నారు. ఈ సర్వేలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 1.88 లక్షల శాంపిళ్లను తీసుకున్నామని, జూన్‌ 30 నాటికి సర్వేను పూర్తిచేశామని ఆ సంస్థ సీఈవో మూర్తి తెలిపారు. గురువారం ఆయన సర్వే ఫలితాలను విడుదల చేశారు. సంక్షేమ పథకాలు, ధరణి పథకం, యాసంగి ధాన్యం కొనుగోలు, శాంతిభద్రతలు, ఉద్యోగ అవకాశాలు, పాలన తీరు తదితర అంశాలపై 40ప్రశ్నలతో సర్వే నిర్వహించామని చెప్పారు. గతంలో 18 రాష్ట్రాల్లో సర్వే చేశామని, రెండు రాష్ట్రాల్లో మినహా మిగతా చోట్ల తమ సర్వేలు ఖచ్చితమయ్యాయని వెల్లడించారు.


దళితబంధు దెబ్బ

సర్వే నివేదిక ప్రకారం.. దళిత బంధు పథకం టీఆర్‌ఎస్‌ ఓటుబ్యాంకుకు గండిపెడుతోంది. పథకం పూర్తిస్థాయిలో అమలుకాకపోవడం, ఇతర అంశాల కారణంగా గతంతో పోలిస్తే 1.5 శాతం మంది దళితులు టీఆర్‌ఎ్‌సకు దూరమయ్యారు. అయినా.. ఆ వర్గంలో ఇప్పటికీ అత్యధికుల మొగ్గు టీఆర్‌ఎ్‌సకే. ఎస్టీ ఓటర్లు మాత్రం టీఆర్‌ఎ్‌సకు దూరమవుతున్నారని సర్వేలో తేలింది. మహిళలు, చేనేత, గౌడ, యాదవ వర్గాలు, రైతులు, వృద్ధుల ఓట్లలో అత్యధిక శాతం టీఆర్‌ఎస్‌ వైపే ఉన్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకుంటున్నవారిలో సానుకూల ఓటింగ్‌ కనిపిస్తోంది. ఉద్యోగుల్లో ఈసారి టీఆర్‌ఎ్‌సకు వచ్చే ఓట్లశాతం తగ్గనుంది. ధాన్యం కొనుగోలు వ్యవహారంలో జాప్యం, పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు తదితరాలకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీనే  కారణమన్న అభిప్రాయంతో ఓటర్లు ఉన్నట్లు సర్వేలో తేలింది. ఖాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్‌ప్లాంట్‌ తదితర విభజన హామీలను కేంద్రం నెరవేర్చలేదనే అభిప్రాయమూ వ్యక్తమైంది. బీజేపీ హిందూ కార్డు హైదరాబాద్‌, నిజామాబాద్‌లలోని ఐదు నియోజకవర్గాల్లోనే ప్రభావం చూపిస్తుందని, మిగతా చోట్ల ఆ ప్రభావం లేదని సర్వే తెలిపింది.


కారు-హస్తం మధ్యే..

ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, మెదక్‌, వరంగల్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో టీఆర్‌ఎ్‌స-కాంగ్రె్‌సల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, హైదరాబాద్‌ నగరంలోని సీట్లలో టీఆర్‌ఎ్‌స-కాంగ్రె్‌స-బీజేపీ మధ్య త్రిముఖ పోటీ ఉంది. నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో వైఎస్సార్‌టీపీ కారణంగా కాంగ్రె్‌సకు దెబ్బతగులుతోంది. ఈ రెండు జిల్లాల్లో కలిపి ఏడుస్థానాలను వైఎస్సార్‌టీపీ కారణంగా కాంగ్రెస్‌ కోల్పోనుందని సర్వేలో తేలింది. నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, హైదరాబాద్‌ నగరాల్లో బీజేపీ ఓట్‌ షేర్‌ పెరిగింది.


నియోజక వర్గాల వారీగా..

ఆత్మసాక్షి సర్వే ప్రకారం తెలంగాణలోని ఉమ్మడి జిల్లాల్లో నియోజకవర్గాల వారీగా ఏయే పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందో పరిశీలిస్తే.. 

ఉమ్మడి మెదక్‌: ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ సీట్లున్నాయి. ఇందులో సిద్దిపేట, మెదక్‌, నారాయణ్‌ఖేడ్‌, గజ్వేల్‌, నర్సాపూర్‌ స్థానాల్లో టీఆర్‌ఎస్‌.. సంగారెడ్డి, పఠాన్‌చెర్వులో కాంగ్రెస్‌ గెలిచే అవకాశాలున్నాయి. దుబ్బాకలో బీజేపీ గెలిచే చాన్సుంది. ఆందోల్‌, జహిరాబాద్‌లలో టీఆర్‌ఎ్‌స-కాంగ్రెస్‌ నడుమ నువ్వా నేనా అన్నట్టుగా పోటీ ఉంటుంది. 


హైదరాబాద్‌: హైదరాబాద్‌లో 15 స్థానాలుండగా.. ఏడుస్థానాల్లో (మలక్‌పేట, నాంపల్లి, కార్వాన్‌, యాకుత్‌పుర, బహదూర్‌పుర, చాంద్రాయణగుట్ట, చార్మినార్‌) మజ్లిస్‌ తిరిగి గెలుస్తుంది. సనత్‌నగర్‌, జూబ్లీహిల్స్‌, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో టీఆర్‌ఎస్‌ గెలిచే అవకాశాలుండగా.. కాంగ్రెస్‌ సికింద్రాబాద్‌ స్థానాన్ని కైవసం చేసుకుంటుంది. ఇక బీజేపీ గోషామహల్‌, అంబర్‌పేట, ముషీరాబాద్‌ స్థానాల్లో ముందంజలో ఉంది. ఖైరతాబాద్‌లో కీలక పోటీ నెలకొంది.


రంగారెడ్డి: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మొత్తం 14స్థానాలుండగా.. కుత్బుల్లాపుర్‌, శేరిలింగంపల్లి, తాండూరు, మేడ్చల్‌, పరిగి స్థానాలు టీఆర్‌ఎ్‌సకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్‌.. ఉప్పల్‌, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, వికారాబాద్‌ స్థానాలు, బీజేపీ మల్కాజ్‌గిరి స్థానాలను దక్కించుకోవచ్చు.


నల్గొండ కాంగ్రె్‌సదే: ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా.. అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీదే గెలుపని సర్వే తెలిపింది. ఈ జిల్లాలో మొత్తం ఆరు స్థానాల్లో కాంగ్రెస్‌, నాలుగు స్థానాల్లో టీఆర్‌ఎ్‌సలది విజయమని, రెండు స్థానాల్లో పోటీ ఉందని తేలింది. నాగార్జునసాగర్‌, హుజూర్‌నగర్‌, కోదాడ, తుంగతుర్తి, నల్గొండ, మునుగోడు స్థానాలు కాంగ్రె్‌సకు..ఆలేరు, నకిరేకల్‌, భువనగిరి, దేవరకొండ స్థానాలు టీఆర్‌ఎ్‌సకు దక్కే అవకాశం ఉంది. సూర్యాపేట, మిర్యాలగూడ స్థానాల్లో నువ్వా? నేనా? అన్నట్టుగా పోటీ ఉండొచ్చు.


ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత ఎన్నికల్లో ఒక్క స్థానమే సాధించిన టీఆర్‌ఎస్‌.. ప్రస్తుత పరిస్థితి ప్రకారం నాలుగు స్థానాల్లో (ఖమ్మం, భద్రాచలం, అశ్వారావుపేట, పాలేరు) విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రె్‌సకు పినపాక, మధిర, కొత్తగూడెం స్థానాలు దక్కనుండగా.. సత్తుపల్లి, వైరా, ఇల్లెందు సీట్లలో తీవ్ర పోటీ నెలకొంది. నల్గొండ జిల్లాతో పాటు ఖమ్మం జిల్లాలో వైఎస్సార్‌టీపీ ప్రభావం కాంగ్రె్‌సను దెబ్బతీయనుందని సర్వేలో తేలింది. 


ఓరుగల్లు.. పోరుగల్లే: వరంగల్‌ జిల్లాలో మొత్తం 12స్థానాలుండగా.. టీఆర్‌ఎస్‌ ఐదు (నర్సంపేట, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్‌, వర్దన్నపేట, వరంగల్‌(వెస్ట్‌)), కాంగ్రెస్‌ నాలుగు (పరకాల, ములుగు, డోర్నకల్‌, మహబూబాబాద్‌) సీట్లలో గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనగాం, భూపాలపల్లి, వరంగల్‌(ఈ్‌స్ట)స్థానాల్లో తీవ్ర పోటీ ఉండనుంది.


పాలమూరు: ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో 14 స్థానాలున్నాయి. మక్తల్‌, దేవరకద్ర, నారాయణపేట, అలంపూర్‌ జడ్చర్లలో టీఆర్‌ఎ్‌సకు మొగ్గుంది. కొడంగల్‌, నాగర్‌కర్నూల్‌, కొల్లాపూర్‌, అచ్చంపేట, వనపర్తిలో కాంగ్రెస్‌ గెలిచే అవకాశం ఉంది. బీజేపీకి కల్వకుర్తి, మహబూబ్‌నగర్‌ స్థానాలు దక్కే అవకాశం ఉంది. గద్వాల్‌, షాద్‌నగర్‌లో గట్టిపోటీ ఉండొచ్చు.


నిజామాబాద్‌: ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో మొత్తం 9అసెంబ్లీ స్థానాలుండగా.. టీఆర్‌ఎ్‌సకు ఐదు (బాన్సువాడ, నిజామాబాద్‌ రూరల్‌, ఎల్లారెడ్డి, బాల్కొండ, జుక్కల్‌ స్థానాలు), కాంగ్రె్‌సకు ఒకటి (కామారెడ్డి),  బీజేపీకి రెండు (బోధన్‌, నిజామాబాద్‌(అర్బన్‌)) స్థానాలు దక్కే అవకాశం ఉంది. 

ఆదిలాబాద్‌: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 10స్థానాలున్నాయి. వీటిలో.. సిర్పూర్‌, ఖానాపూర్‌, బోథ్‌, ముథోల్‌, నిర్మల్‌ టీఆర్‌ఎ్‌సకు..  చెన్నూర్‌, బెల్లంపల్లి కాంగ్రె్‌సకు, బీజేపీకి ఆదిలాబాద్‌ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంచిర్యాల, ఆసిఫాబాద్‌ నియోజకవర్గాల్లో రసవత్తర పోటీ ఉండనుంది.

కరీంనగర్‌: ఉమ్మడి కరీంనగర్‌లో మొత్తం 13 స్థానాలుండగా.. టీఆర్‌ఎస్‌  జగిత్యాల, సిరిసిల్ల, హుస్నాబాద్‌, చొప్పదండి, వేములవాడ, కోరుట్ల, మానకొండూరుల్లో గెలిచే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్‌ ధర్మపురి, మంథని స్థానాలను.. బీజేపీ హుజూరాబాద్‌ను దక్కించుకునే అవకాశం ఉంది.

Updated Date - 2022-07-15T09:18:00+05:30 IST