కాంగ్రెస్ ఆ పనిచేసుంటే రాజకీయాల్లో నాకేం పని: కేజ్రీవాల్

ABN , First Publish Date - 2022-02-04T21:43:53+05:30 IST

ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్‌పై మరోమారు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు

కాంగ్రెస్ ఆ పనిచేసుంటే రాజకీయాల్లో నాకేం పని: కేజ్రీవాల్

పనాజీ: ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్‌పై మరోమారు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేజ్రీవాల్ ‘చోటా మోదీ’లా తయారయ్యారంటూ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సూర్జేవాలా చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కేజ్రీవాల్.. కాంగ్రెస్ కనుక ప్రజల కోసం పనిచేసి ఉంటే తనలాంటి వారు అసలు రాజకీయాల్లోకి వచ్చే అవసరమే ఉండేది కాదన్నారు.


ఆయన (సూర్జేవాలా) ఏం కావాలనుకుంటే అది మాట్లాడుకోవచ్చని, దాని వల్ల పెద్దగా తేడా ఏమీ ఉండదని అన్నారు. నిజం చెప్పాలంటే ఆయన కలలో కూడా తానే ఉంటానని, ఆయనకు తానొక భూతంలా కనిపిస్తున్నానని అన్నారు. 24 గంటలూ ఆయన మనసులో ఉండేది తానేనని కేజ్రీవాల్ అన్నారు. వారు తనపై అనవసరంగా నోరు పారేసుకుంటున్నారని విమర్శించారు. 


కాంగ్రెస్ తనపై నోరు పారేసుకోవడం కంటే ప్రజల కోసం పనిచేస్తే బాగుంటుందని అన్నారు. వారు కనుక ప్రజల కోసం పనిచేసి ఉంటే రాజకీయాలతో కేజ్రీవాల్‌కు ఏం అవసరం ఉంటుందని ఢిల్లీ సీఎం ప్రశ్నించారు. ప్రజలు తాము చేస్తున్న మంచి పనులకు ఓటేస్తారని అన్నారు.


ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థుల్లా గోవాలోని కాంగ్రెస్ అభ్యర్థులు కూడా అఫిడవిట్లపై సంతకం చేసి రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌కు బద్ధులమై ఉంటామని ప్రతిజ్ఞ చేయడంపై స్పందిస్తూ.. ఆప్ చేస్తున్న మంచి పనులను రాహుల్ గాంధీ కాపీ కొట్టడాన్ని తాము స్వాగతిస్తున్నామని, అలాగే ఆ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లలో ‘ఆప్’ అమలు చేస్తున్న పథకాలను కూడా అమలు చేయాలని కేజ్రీవాల్ సూచించారు. 

Updated Date - 2022-02-04T21:43:53+05:30 IST