వానాకాలంలో చిన్నారులూ ఇలా జాగ్రత్త పడితే..!

ABN , First Publish Date - 2022-07-13T20:10:44+05:30 IST

ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇంటి నుంచి

వానాకాలంలో చిన్నారులూ ఇలా జాగ్రత్త పడితే..!

వర్షాలతో మారిన వాతావరణం

పొంచి ఉన్న డెంగీ, స్వైన్‌ఫ్లూ

అంత తీవ్రత లేదంటున్న వైద్యులు


హైదరాబాద్‌ సిటీ, జూలై 12 (ఆంధ్రజ్యోతి): ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.  ఇంటి నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇళ్లలో వాతావరణం తడిగా మారడంతోపాటు గోడలు తేమ బారాయి. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు అస్వస్థతకు గురై అవకాశముందని వైద్యులు పేర్కొంటున్నారు. 


ఫ్లూ భయం

ప్రస్తుతం వాతావరణంతో పిల్లల్లో ఫ్లూ కేసులు ఎక్కువగా వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఓపీకి వచ్చే పిల్లలలో 60 నుంచి 70 శాతం ఫ్లూ కేసులే ఉంటున్నాయని చెబుతున్నారు. ఇందులో ఎక్కువగా దగ్గు, జలుబుకు సంబంధించినవి కాగా,  కొందరిలో జ్వరం ఉంటుంది. అయితే మందులు వాడితే మూడు నాలుగు రోజులలో తగ్గిపోతుందని వైద్యులు చెప్పారు. మరి కొందరిలో స్వైన్‌ ఫ్లూ లక్షణాలు కనిపిస్తున్నాయని, అయితే అంత పెద్దగా తీవ్రత లేకపోవడంతో నిర్ధారణ పరీక్షలు చేయడం లేదని పిల్లల వైద్యులు చెబుతున్నారు. ఓపీకి వచ్చే కేసులలో 10 శాతం వరకు వాంతులు, విరోచనాలకు సంబంధించినవి ఉంటున్నాయని చెప్పారు. 


డెంగీ కేసులు

గతంతో పోల్చుకుంటే పిల్లల్లో డెంగీ లక్షణాలూ కనిపిస్తున్నాయి. ఆస్పత్రికి వచ్చే పది మందిలో ముగ్గురు నుంచి నలుగురు చిన్నారుల్లో డెంగీ లక్షణాలు ఉంటున్నాయి. పిల్లలకు జ్వరం వచ్చిన రెండు రోజులకు పరీక్షలు చేస్తే ప్లేట్‌లెట్స్‌ తగ్గినట్లు కనిపిస్తున్నాయని, అయితే డెంగీ తీవ్రత అంతగా ఉండడం లేదని చెబుతున్నారు. చాలా మందికి ఓపీలోనే చికిత్సలు అందించి పంపిస్తున్నట్లు వివరిస్తున్నారు.


ఇలా జాగ్రత్త పడితే..

  • బయటకు వెళ్లనీయకుండా జాగ్రత్త పడాలి.
  • వర్షంలో పిల్లలను తడవనీయవద్దు
  • స్కూల్‌ నుంచి రాగానే దుస్తులు, షూ, సాక్స్‌ తొలగించి స్నానం చేయించాలి.
  • వాతావరణం చలిగా ఉంటే వేడి నీళ్లలో టవల్‌ ముంచి తుడవాలి.
  • చేతులు, కాళ్లు, ముఖం శుభ్రంగా కడుక్కోవాలి.
  • బయటి ఆహారం కాకుండా ఇంటిలో వండిన వేడి ఆహారం తీసుకోవాలి. 
  • ఇంట్లో కాచి వడ కట్టిన నీళ్లను పిల్లలకు ఇవ్వాలి. 
  • బయటి ఆహారం, నీళ్ల వల్ల వాంతులు, విరోచనాలు, టైఫాయిడ్‌ ఇబ్బందుల ముప్పు ఉంటుంది. 
  • కొవిడ్‌ జాగ్రత్తలు తప్పని సరిగ్గా తీసుకోవాలి.
  • బయటకు వెళ్లిన పిల్లలను ఏడాది లోపు శిశువుల వద్దకు వెళ్లనీయవద్దు
  • అస్వస్థతగా ఉన్న పెద్దలు పిల్లలకు దూరంగా ఉండాలి.
  • ఇతరులు వినియోగించిన చేతి రుమాలను పిల్లలకు ఇవ్వొద్దు. పరిశుభ్రమైన దుస్తులు వేయాలి. 
  • ఏసీగదుల్లో, ఫ్యాన్‌ గాలి తగలకుండా జాగ్రత్త తీసుకోవాలి. 
  • నవజాత శిశువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
  • నెలల పిల్లలను బయటకు తీసుకురావద్దు. 
  • అయిదు నెలల లోపు పిల్లలను వెచ్చటి దుస్తులలో పడుకోబెట్టాలి.


- డా. సత్యనారాయణ కావలి, పిల్లల వైద్యుడు, 

రెయిన్‌ బో  ఆస్పత్రి 



Updated Date - 2022-07-13T20:10:44+05:30 IST