Abn logo
Sep 25 2020 @ 01:55AM

అన్నీ అలా కుదిరిపోయాయంతే...

Kaakateeya

పల్లె వాతావరణం. సముద్రపు ఒడ్డున ఉన్న గ్రామం. యువతీ యువకుల ప్రేమ ప్రయాణం. ప్రకృతితో ముడిపడిన చిత్రం. వాటన్నింటినీ ప్రతిబింబించేలా దేవిశ్రీ ప్రసాద్‌ గారు ఇచ్చిన బాణీ. ప్రేక్షకుడిని ఆ రమణీయ ప్రేమ కావ్యంలోకి తీసుకుపోవడానికి కవిగా ఇంతకు మించిన ప్రేరణ ఇంకేం కావాలి? నాలో భావావేశాన్ని రేకెత్తించినవి ఇవే!


‘నీ అందమెంత ఉప్పెన... నన్ను ముంచినాది చప్పున

ఎంత ముంచేసినా తేలే బంతిని నేనేననా

చుట్టూ ఎంత చప్పుడొచ్చినా... నీ సవ్వడేదో చెప్పనా 

ఎంత దాచేసినా నిన్ను జల్లడేసి పట్టనా’

...ఇలా కొన్ని అలా కుదిరిపోతాయంతే! ఈ పాట విషయంలోనూ అదే జరిగింది. 

మొదట దేవీ గారు ట్యూన్‌ వినిపించి పాట రాయమన్నారు. సులువైన పదాల కవితలా, అందరికీ అర్థమయ్యేలా ఉండాలన్నారు. రెండు లైన్లు ఆయనే ఇచ్చేశారు. దర్శకుడు బుచ్చిబాబు సన్నివేశాన్ని వివరించారు. ఒక అబ్బాయి అమ్మాయిని ఎంతగా ప్రేమిస్తాడో చెప్పాలన్నారు. ఇద్దరం సుకుమార్‌ గారి దగ్గర ఒకేసారి చేరాం. అప్పటి నుంచి కలిసి పనిచేసిన నేపథ్యం కావడంతో ఆయన మనసులోని మాటను అర్థం చేసుకోగలిగాను. వీటన్నింటికీ తోడు నేను చదివే ఉమర్‌ ఖయ్యూమ్‌ రుబాయిలు, చలం మ్యూజింగ్స్‌ పనికొచ్చాయి. గాలీబ్‌ కవితల్లోని విరహం, ఇస్మాయిల్‌ ‘చెట్టు కథ’... ఇలా మొదటి నుంచి అన్ని రకాల సాహిత్యాలు చదవడం నాకు అలవాటైంది. అందులోని ఎత్తులను అందుకోగలిగితే అద్భుతాలెన్నో వస్తాయి. అలాంటి అద్భుతమే ఈ పాటనుకుంటున్నాను. ఇందులోని భావాలు సరికొత్తగా ఉంటాయి. చూస్తున్నంత సేపూ ప్రేక్షకులను ఆ సముద్ర తీరం వైపు నడిపిస్తాయి. పాత్రల పక్కనే ఉన్న అనుభూతిని కలిగిస్తాయి. ఇక దేవిశ్రీ గారి సంగీతం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఖవ్వాలీతో పాట మొదలవుతుంది. తెలుగు పదాలతో కలిపేసి, మధ్య మధ్యలో ఉర్దూ కవిత్వాన్ని చక్కగా అమర్చి ఆయన కట్టిన బాణీని అభినందించకుండా ఉండలేం. దేవీ ఇచ్చిన ట్యూనే నేను ఆ పాత్రలోకి వెళ్లిపోయేంత స్ఫూర్తినిచ్చింది. కథ, కథనం, దాని నేపథ్యం... ఒక అందమైన దృశ్యకావ్యంలా రాయడానికి ప్రేరణ అయ్యాయి. 


పూర్తి స్థాయి ప్రేమ కథా చిత్రాలు, అందులో పాటలు రాసే అవకాశాలు అరుదుగా వస్తాయి. ఈ గీతానికి సమయం కూడా ఎక్కువే తీసుకున్నా. రాత్రింబవళ్లు దానిపైనే పనిచేశాను. చాలా వెర్షన్స్‌ రాశాను. ఇది కొత్త ప్రయాణం. కొత్త భావాన్ని పట్టుకోవడం కోసం దేవిశ్రీ, బుచ్చిబాబుతో కలిసి ప్రయాణం చేశాను. అంతగా మనసు పెట్టి శ్రమించిన దానికి ఇప్పుడు ఫలితం వచ్చింది. యూట్యూబ్‌లో 12 కోట్ల మందికి పైగా దీన్ని వీక్షించారంటే చాలా ఆనందంగా ఉంది. ‘100ు లవ్‌’ చిత్రం కోసం తొలిసారి సుకుమార్‌ గారి చిత్రానికి పాట రాశాను. అప్పటి నుంచి ఆయన చిత్రాలకు పనిచేస్తున్నాను. పాట అద్భుతమంటూ ఆయన మెచ్చుకున్నారు. ఆ కాంప్లిమెంట్‌ ఎంతో ఆనందాన్నిచ్చింది. చాలామంది యువ దర్శకులు, ఇతర టెక్నీషియన్స్‌ కూడా అభినందించారు. ఇక చంద్రబోస్‌ గారైతే ‘చాలా బాగా రాశావు’ అంటూ భుజం తట్టారు. ఏ పాటల రచయితకైనా ఇంతకు మించిన ప్రశంస ఇంకేం కావాలి! 

శ్రీమణి, గీత రచయిత 


‘చిత్రజ్యోతి’లో మరిన్ని ఆసక్తికర 

కథనాల కోసం ఈ క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి. లేదా ఈ క్రింది యూఆర్‌ఎల్‌   

https://qrgo.page.link/nj5vsలో చదవండి.

Advertisement
Advertisement