ఆధార్‌ లీకయితే కఠిన చర్యలు తప్పవ

ABN , First Publish Date - 2022-07-06T08:31:39+05:30 IST

ఓటర్ల ఆధార్‌ వివరాలను వెల్లడిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) హెచ్చరించింది.

ఆధార్‌ లీకయితే కఠిన చర్యలు తప్పవ

దరఖాస్తులు బయటకు రాకూడదు..

సాఫ్ట్‌వేర్‌లో కూడా వివరాలు ఉండటానికి వీల్లేదు

ఎన్నికల అధికారులను హెచ్చరించిన ఈసీ

న్యూఢిల్లీ, జూలై 5: ఓటర్ల ఆధార్‌ వివరాలను వెల్లడిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) హెచ్చరించింది. ఆధార్‌ నంబర్‌ను ఓటర్‌ కార్డుతో లింక్‌ చేయడానికి సమర్పించే దరఖాస్తు (6బి) హార్డ్‌కాపీలను ఎట్టి పరిస్థితుల్లోనూ బహిరంగ పరచకూడదని ఈసీ పేర్కొంది. ఓటర్ల లిస్ట్‌ను రివిజన్‌ చేసే సమయంలో ఆధార్‌ను లింక్‌ చేయడానికి వీలుగా ఏర్పాట్లుచేయాలని ఎన్నికల అధికారులకు ఈసీ సూచించింది. అయితే ఆధార్‌తో లింక్‌ చేయలేదనే కారణంతో ఓటర్‌ లిస్ట్‌ నుంచి పేర్లను తొలగించకూడదని పేర్కొంది. ఈ మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన ఎన్నికల అధికారులకు ఈసీ లేఖ రాసింది. డూప్లికేట్‌ ఓటర్లను తొలగించడానికి ఓటర్‌ కార్డులను ఆధార్‌ నంబర్‌తో లింక్‌ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్‌ కూడా జారీచేసింది. దీన్ని అనుసరించి... దేశంలోని ఓటర్లు 2023 ఏప్రిల్‌ 1వ తేదీలోగా తమ ఆధార్‌ వివరాలను సంబంధిత ఎన్నికల అధికారులకు తెలియజేయవచ్చు. ఈ మేరకు 6బి దరఖాస్తులో కూడా మార్పులు చేశారు. ‘‘ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటర్ల ఆధార్‌ వివరాలు బయటకు రావడానికి వీల్లేదు. ఓటర్ల జాబితాను బయటపెట్టాల్సి వస్తే... అందులో వారి ఆధార్‌ నంబర్‌ ఉండకూడదు. ఒకవేళ ఉన్నా, నంబర్‌ కనిపించకుండా మాస్క్‌ చేయడం లాంటి చర్యలు తీసుకోవాలి. అలాగే 6బి దరఖాస్తుల డిజిటైజేషన్‌ పూర్తయ్యాక వాటిని స్టోర్‌ చేసేటప్పుడు ఆధార్‌ నంబర్లను మాస్క్‌ చేయాలి’’ అని ఈసీ పేర్కొంది. ఏ కారణంగానైనా సరే 6బి దరఖాస్తులు బయటికొస్తే సంబంధిత అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీవ్రంగా ఉంటాయని ఈసీ స్పష్టంచేసింది. దరఖాస్తులను ప్రాసెస్‌ చేయడానికి ఉపయోగించే ఈరోనెట్‌ సాఫ్ట్‌వేర్‌లో కూడా ఆధార్‌ నంబర్లు ఉండటానికి వీల్లేదని పేర్కొంది.  

Updated Date - 2022-07-06T08:31:39+05:30 IST