టన్ను 3 వేలకు దొరుకుతుంటే 30 వేలకు కొనాలా?

ABN , First Publish Date - 2022-05-29T09:50:33+05:30 IST

‘‘తెలంగాణలో సింగరేణి కాలరీస్‌ ఉంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి 51 శాతం వాటా ఉంది.

టన్ను 3 వేలకు దొరుకుతుంటే 30 వేలకు కొనాలా?

  • విదేశీ బొగ్గు కొనాలని కేంద్రం ఒత్తిడి.. 
  • యూనిట్‌కు 9-10 పైసల అదనపు భారం
  • ‘ఉమ్మడి’ విద్యుత్తుపై ఏకపక్ష నిర్ణయాలా?: కేంద్రంపై ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ఫైర్‌
  • విదేశాల్లోని అదానీ గనుల నుంచి కొనిపించడానికే బెదిరింపులు
  • ముఖ్యమంత్రులంతా కూటమిగా ఏర్పడి వ్యతిరేకించాలి: ఏఐపీఈఎఫ్‌ చైర్మన్‌ శైలేంద్ర


హైదరాబాద్‌, మే 28 (ఆంధ్రజ్యోతి): ‘‘తెలంగాణలో సింగరేణి కాలరీస్‌ ఉంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి 51 శాతం వాటా ఉంది. అన్ని గనుల నుంచి థర్మల్‌ కేంద్రాలకు లింకేజీ ఉంది. తద్వారా, ప్రస్తుతం రూ.3 వేలకే టన్ను బొగ్గు లభిస్తోంది. కానీ, టన్ను రూ.30 వేలకు లభించే విదేశీ బొగ్గును దిగుమతి చేసుకోవాలని కేంద్రం పదే పదే ఒత్తిడి చేస్తోంది. లేకపోతే, 15 శాతం కరెంట్‌ను డిస్కమ్‌లకు అమ్మకుండా ఎనర్జీ ఎక్స్ఛేంజ్‌లో అమ్ముకోవడానికి జెన్‌కోలకు వెసులుబాటు ఇచ్చింది’’ అని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు తప్పుబట్టారు. ఆలిండియా పవర్‌ ఇంజనీర్స్‌ ఫెడరేషన్‌ (ఏఐపీఈఎఫ్‌) జాతీయస్థాయి ఫెడరల్‌ ఎగ్జిక్యూటివ్‌ సమావేశాలు శనివారం హైదరాబాద్‌లో జరిగాయి. దీనికి ప్రభాకర్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని థర్మల్‌ కేంద్రాల బాయిలర్లన్నీ పాతవని, విదేశీ బొగ్గును మండించే అవకాశాలు తక్కువని చెప్పారు. విదేశీ బొగ్గు కోసం పొరుగు రాష్ట్రం ఏపీ టెండర్లు పిలిస్తే.. టన్ను రూ.40 వేలతో అందించడానికి అదానీ సంస్థ టెండర్‌ వేసిందని, దాంతో వాటిని రద్దు చేసి మళ్లీ పిలిచారని, అప్పుడు రూ.24 వేలకు టన్ను బొగ్గును అందించడానికి మరో సంస్థ ముందుకు వచ్చిందని వివరించారు. 


ఖరీదైన విదేశీ బొగ్గును కొనుగోలు చేయడం సులభం కాదని, పలు దఫాలుగా వద్దని చెప్పినా కేంద్రం వినడం లేదని మండిపడ్డారు. తెలంగాణకు ఎన్టీపీసీతో 2600 మెగావాట్లకు, సెమ్‌ కార్బ్‌తో 840 మెగావాట్లకు విద్యుత్తు ఒప్పందాలున్నాయని, ఆయా సంస్థలు కచ్చితంగా విదేశీ బొగ్గును కొనే పరిస్థితిని కేంద్రం తెచ్చిందని, ఫలితంగా, ఒక్కో యూనిట్‌కు 9-10 పైసల భారం అదనంగా పడనుందని చెప్పారు. ‘‘విద్యుత్తు ఉమ్మడి జాబితాలో ఉంది. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా రాష్ట్రాల అభిప్రాయాలనూ పరిగణన లోకి తీసుకోవాలి. కానీ, కేంద్రం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్రాలపై రుద్దుతోంది’’ అని మండిపడ్డారు. విదేశీ బొగ్గును ఎందుకు దిగుమతి చేసుకోవాలని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలతో డిస్కమ్‌లు ఒత్తిడికి గురవుతున్నాయని, వాటిని ప్రైవేటీకరించాలని కేంద్రం యోచిస్తోందని తెలిపారు.


 డిస్కమ్‌ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో తీర్మానాలు చేశారని గుర్తు చేశారు. ‘‘డిస్కమ్‌లు డబ్బులు చెల్లించకపోతే నేషనల్‌ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ (ఎన్‌ఎల్‌డీసీ)కి సమాచారం ఇచ్చి విద్యుత్తు సరఫరాను నిలిపివేయించారు. దాంతో, ఒక్కరోజే 50-60 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తును కొనుగోలు చేయలేకపోయాం. ఆర్‌పీపీవో (రెన్యూవబుల్‌ పవర్‌ పర్చేజ్‌ ఆబ్లిగేషన్‌) నిబంధనలు కూడా గ్రిడ్‌కు సవాలుగా మారాయి. విధిగా కొనుగోలు చేయాల్సిన జాబితాలో సోలార్‌ను చేర్చారు. ఆ విద్యుత్తు కోసం థర్మల్‌ కేంద్రాలను బ్యాక్‌ డౌన్‌ చేస్తూ.. గ్రిడ్‌ను సమన్వయం చేసుకోవాల్సి వస్తోంది’’ అని వివరించారు. పీక్‌ డిమాండ్‌లో రూ.2,900 కోట్ల మేర నిధులు వెచ్చించి, ఎనర్జీ ఎక్సేంజ్‌ నుంచి యూనిట్‌కు రూ.12 నుంచి రూ.20 దాకా పెట్టి కరెంట్‌ కొన్నామన్నారు.


రాష్ట్రాలను కేంద్రం బెదిరిస్తోంది

విదేశీ బొగ్గును కొనుగోలు చేయాలంటూ రాష్ట్రాలను కేంద్రం బెదిరిస్తోందని ఆలిండియా పవర్‌ ఇంజనీర్స్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ శైలేంద్ర దూబే మండిపడ్డారు. ఈనెల 31వ తేదీలోగా 10% బొగ్గును విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని, లేకుంటే జూన్‌ 15లోగా ఈ వాటా 15 శాతానికి చేరుతుందని, అప్పటికీ వినకపోతే దేశీయంగా 5 శాతం బొగ్గును తగ్గిస్తామని హెచ్చరికలు చేస్తోందని ఆక్షేపించారు. దేశంలో బొగ్గు సంక్షోభానికి కేంద్రమే కారణమని, ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల కాకుండా ఆరు నెలలుగా ఈ సంక్షోభం ఉందని గుర్తు చేశారు. ‘‘విదేశీ బొగ్గు కొనాలంటూ ఏప్రిల్‌ 28న ఒకసారి, ఈనెల 5, 13, 26వ తేదీల్లో వరుసగా అడ్వయిజరీని కేంద్రం విడుదల చేసింది. అందులోని భాష అడ్వయిజరీలాగా లేదు. బెదిరింపులా ఉంది. అదానీకి విదేశాల్లో బొగ్గు గనులున్నాయి. ఆ బొగ్గు కొనిపించడమే కేంద్రం లక్ష్యం’’ అని తప్పుబట్టారు. దేశీయంగా దొరికే బొగ్గు టన్ను రూ.2200 ఉంటే... విదేశీ బొగ్గు రూ.30 వేల దాకా పలుకుతోందని, దేశాన్ని నిలుపు దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. విద్యుత్తు సవరణ చట్టాన్ని దేశవ్యాప్తంగా 12 మంది సీఎంలు వ్యతిరేకించారని, ఈ అంశంలో సీఎం కేసీఆర్‌ ముందున్నారని కితాబిచ్చారు. విదేశీబొగ్గుకు వ్యతిరేకంగా సీఎంలు కమిటీ వేసుకొని, నిరంకుశ చర్యలను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. దేశంలో పాత పెన్షన్‌ను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఎలక్ట్రిసిటీ సవరణ చట్టంతోపాటు డిస్కమ్‌ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సమావేశంలో తీర్మానం చేశారు. సమావేశంలో ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి పి.రత్నాకర్‌రావు, అదన పు సెక్రటరీ జనరల్‌ శివశంకర్‌, తెలంగాణ పవర్‌ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి సదానందం పాల్గొన్నారు.

Updated Date - 2022-05-29T09:50:33+05:30 IST