నాయకుని నీడలో సైద్ధాంతిక పార్టీ!

ABN , First Publish Date - 2021-04-14T07:34:33+05:30 IST

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ఘట్టం ముగియకముందే ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తున్నారు...

నాయకుని నీడలో సైద్ధాంతిక పార్టీ!

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ఘట్టం ముగియకముందే ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తున్నారు. బెంగాల్‌లో తాము 200 సీట్లు గెలుచుకుంటామని అమిత్ షా ఇప్పటికే ప్రకటించగా, ఇప్పటివరకూ జరిగిన నాలుగు దశల ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్‌కు మెజారిటీ సీట్లు రావని, మే 2న ఫలితాలు వచ్చే సరికి ఆ పార్టీ పరాజయం చెందక తప్పదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తాజాగా ఎన్నికల సభలో ప్రకటించారు. నందిగ్రామ్‌లో కూడా మమతా బెనర్జీ ఓడిపోతుందని ఆయన ప్రకటించారు. ఎన్నికల కమిషన్ అయితే ఎగ్జిట్ పోల్స్‌ను నిషేధించింది కాని ఒక ప్రధానమంత్రి, హోంమంత్రి స్థాయిలో ఉన్న నేతలు ఎన్నికల ఫలితాల గురించి ముందుగానే ప్రకటించడాన్ని నిషేధించలేదు. ప్రతి దశ పోలింగ్ తర్వాత ఉన్నత పదవుల్లో ఉన్న వారు ఎన్నికల ఫలితాలు ప్రకటించడం ఒక మైండ్ గేమ్. అలా ప్రకటిస్తే బిజెపి గెలుస్తుందన్న అభిప్రాయం జనంలోకి పాకిపోతుందని, అది తర్వాతి దశలో పోలింగ్ సరళిపై ప్రభావం చూపుతుందని పార్టీ నేతల భావన. ప్రధానమంత్రి, హోంమంత్రి ఇద్దరూ ఎన్నికల ఫలితాల గురించి తామే ప్రకటిస్తున్నారంటే అందుకు రెండు ప్రధాన కారణాలుంటాయి. ఒకటి- ప్రజలు, కార్యకర్తల మనోభావాలను తమకు అనుకూలంగా మళ్లించుకోవడం కోసం; రెండు- అలా ప్రకటించడం ద్వారా ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య హోరా హోరీ పోరు జరుగుతున్నదన్న విషయం స్పష్టం చేయడం. తృణమూల్ కాంగ్రెస్‌ను పశ్చిమబెంగాల్‌లో ఓడించడం అంత సులభం కాదని తెలిసినందువల్లే బిజెపి అగ్రనేతలు తమ సర్వశక్తులూ ఒడ్డి పోరాడుతున్నారు. ఒక ప్రాంతీయ పార్టీని ఓడించడానికి ఒక జాతీయ పార్టీ అర్థ బలం, అంగబలంతో పూర్తిగా రంగంలో దిగిన వైనం స్పష్టంగా కనపడుతోంది. ప్రధానమంత్రి, హోంమంత్రి, రక్షణమంత్రి, ఇతర కేంద్రమంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పుడు బెంగాల్ లోనే ఉన్నారు. దేశ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తున్నా, గత 34 రోజులుగా కరోనా రోజురోజుకూ పెరిగిపోతూ, రోజుకు లక్షా 68వేల కేసుల పైగా దాటిపోతున్నా, అనేక రాష్ట్రాలనుంచి తమకు వాక్సిన్ కావాలని డిమాండ్లు తీవ్రతరమవుతున్నా మోదీ ఆయన మంత్రివర్గం, బిజెపి నేతలంతా బెంగాల్‌లోనే మోహరించారు.


మోదీ మనస్సు ఇప్పుడు బెంగాల్ పైనే తప్ప మరెక్కడా లేదని ఆయన మాట్లాడున్న తీరు, చేపడుతున్న చర్యలు స్పష్టం చేస్తున్నాయి. గత కొంతకాలంగా ఏ కార్యక్రమం చేపట్టినా ఆయన బెంగాల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే చేపడుతున్నారు. నేతాజీ సుభాస్ చంద్రబోస్ 125వ జయంత్యుత్సవాలు, బంగ్లాదేశ్‌కు వెళ్లి మతువా జాతి దేవాలయాన్నిసందర్శించడం తో పాటు ప్రధానమంత్రి ఎక్కడ ఏ ప్రసంగం చేసినా బెంగాల్‌తో ముడిపెట్టకుండా ఉండడం లేదు. బెంగాల్‌లో మమతా బెనర్జీని ఢీకొనడానికి మోదీ స్వయంగా రంగంలో దిగడం, 20కి పైగా ఎన్నికల ర్యాలీల్లో పాల్గొనడం, ప్రతి సభలోనూ ఆయన ప్రసంగం పూర్తిగా మమతా బెనర్జీపై దాడికే కేటాయించడం ఎన్నికల ఘట్టాన్ని రసవత్తరంగా మార్చింది. దీదీ, ఓ దీదీ అని నరేంద్ర మోదీ సభల్లో చేస్తున్న పిలుపులు జనంలో ప్రతిధ్వనిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌కు చెందిన కైలాశ్ విజయ వర్గేయ లాంటి నేతలు గత ఆరేళ్లుగా బెంగాల్‌లో క్రిందిస్థాయి నుంచి పార్టీని నిర్మించే పనిని చేపడుతున్నారు. మమతా బెనర్జీకి కుడిభుజంలా ఉన్న అనేక మంది నేతలను బిజెపిలోకి ఆకర్షించే పనులు ఎప్పటి నుంచో జరిగాయి. వామపక్ష కార్యకర్తలను సైతం బిజెపి విస్మరించలేదు, గ్రామాల్లో వేలాది వామపక్ష కార్యకర్తలు బిజెపిలో చేరారు. అవకాశం వచ్చినప్పుడల్లా హోంమంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్ వెళ్లి కార్యకర్తల సమావేశాలు, యాత్రలు నిర్వహించారు. ఇతర రాష్ట్రాలనుంచి యోగి ఆదిత్యనాథ్‌తో పాటు అనేకమంది నేతలను దించారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరో ఎత్తు. బెంగాల్ దృశ్యం మారడానికి పూర్తిగా మోదీయే కారణమని వేరే చెప్పనక్కర్లేదు. బెంగాల్‌లో ప్రధాన ఆకర్షణగా తాను మారడానికి మోదీ అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఒక నాటకంలో కానీ, సినిమాలో కాని, పాత్రకు తగట్టు ఆహార్యం, వేష భాషలు, సంభాషణలు మార్చడానికి కథానాయకుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో మోదీ అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.


మమతా బెనర్జీ తరఫున ఎన్నికల వ్యూహకర్తగా రంగంలోకి దిగిన ప్రశాంత్ కిషోర్ కూడా నరేంద్రమోదీ విజృంభణను చూసి ఒకరకంగా ఆత్మరక్షణలో పడ్డారని ఆయన చేసిన వ్యాఖ్యలు నిరూపిస్తున్నాయి. బిజెపి శక్తిని, ముఖ్యంగా నరేంద్రమోదీ ఆకర్షణను తక్కువ అంచనా వేయలేమని ఆయన కొందరు జర్నలిస్టులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు నిరూపిస్తున్నాయి.దళితులైన మతువాలను మోదీ తన వైపుకు తిప్పుకున్నారని ఆయన చెప్పడంతో మోదీ బంగ్లాదేశ్ పర్యటన దాదాపు విజయవంతమైనదనే భావించవచ్చు.


దేశ రాజకీయాల్లో సిద్ధాంతపరమైన రాజకీయాలపై వ్యక్తి కేంద్రీకృత రాజకీయాల ఆధిపత్యం ఏర్పడడం అనేది ఒక దురదృష్టకర పరిణామం. గతంలో నెహ్రూ, ఇందిర, రాజీవ్ లాంటి వారు వ్యక్తిగత ఆకర్షణ పేరుతో కాంగ్రెస్ అన్న సంస్థను కుటుంబ సంస్థగా మార్చారని విమర్శలు ఎదుర్కొన్నారు. చాలా మంది ప్రాంతీయపార్టీల అధినేతలు కూడా పార్టీలను తమ స్వంత ఇష్టాయిష్టాలకు అనుగుణంగా మార్చారని విమర్శలకు గురయ్యారు. కాని బిజెపి లాంటి సైద్ధాంతిక పునాది ఉన్న పార్టీ ఇవాళ కేవలం ఒక వ్యక్తి ఆధారిత పార్టీగా మారడం అనేది ఎందుకు జరిగింది అన్నది చర్చించవలసిన అవసరం ఉన్నది. బిజెపి ఒక జాతీయ శక్తిగా ఆవిర్భవించడానికి దాదాపు అయిదు దశాబ్దాలుగా కృషి చేస్తూ వచ్చింది. లాల్ కృష్ణ ఆడ్వాణీ నేతృత్వంలో ఒక సైద్ధాంతిక భావజాలం గల పార్టీగా బిజెపిని ప్రజలముందుకు తీసుకురావడానికి విశేషమైన కృషి జరిగింది. దేశ విభజన జరగకముందే 14 సంవత్సరాల వయస్సులో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో చేరిన ఆడ్వాణీ మాతృభూమికి నిస్వార్థ సేవ చేసేందుకు ఎన్నో త్యాగాలు చేశారని అటల్ బిహారీ వాజపేయి ఆడ్వాణీ ఆత్మకథకు రాసిన ముందుమాటలో పేర్కొన్నారు. అన్ని పార్టీల కంటే బిజెపి విశిష్టమైనదని, దీనదయాళ్ ఉద్దేశించిన సమగ్ర మానవతా వాదం తమ సిద్ధాంతమని అప్పుడు ప్రచారం జరిగేది. కాని అడ్వాణీ నేతృత్వంలో రెండు సార్లు భారతీయ జనతాపార్టీ పోరాడినప్పటికీ ఆ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాలేకపోయింది. నిజానికి ఆడ్వాణీ నేతృత్వంలో రామజన్మభూమి ఉద్యమం ఊపందుకుని 1992లో బాబ్రీమసీదు కట్టడం కూల్చివేత తర్వాత నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీలను రద్దు చేస్తే మూడు రాష్ట్రాల్లో బిజెపి తిరిగి అధికారంలోకి రాలేకపోయింది. అయినప్పటికీ ఆడ్వాణీ బిజెపిని ఒక్క సిద్ధాంత ఆధారిత పార్టీగా మార్చేందుకు ఎంతో ప్రయత్నించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ రాజ్యాంగాన్ని లిఖించడంలోనే యువకుడుగా పాత్ర పోషించిన ఆడ్వాణీ జనసంఘ్, బిజెపిలకు ఒక సైద్ధాంతిక పునాదిని ఏర్పర్చారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సారథ్యంలో ఒక సైద్ధాంతిక పునాది వల్లనే బిజెపి వివిధ రాష్ట్రాల్లో బలోపేతం అయింది, బైరాన్ సింగ్ షెఖావత్, కుశభావు థాక్రే లాంటి వారి వల్ల రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో బిజెపి బలోపేతం కావడానికి అవసరమైన నిర్మాణం ఏర్పడింది.


ఒక సైద్ధాంతిక నిర్మాణంతో ఏర్పడిన పార్టీ ఒక వ్యక్తి ఆకర్షణ వల్ల, ఆయన హావభావాల వల్ల, రాజకీయ విన్యాసాల వల్ల, రకరకాల పన్నాగాల వల్ల బలోపేతం కావడం అనేది ప్రజాస్వామ్యంలో ఒక విపరీత పరిణామం అని చెప్పక తప్పదు. కాంగ్రెస్ పార్టీ అలాంటి వ్యక్తిగత ఆకర్షణలపై ఆధారపడినందువల్లే అనతికాలంలో అది వందిమాగధుల పార్టీగా మారి, ముఠాలు, వర్గాలుగా చీలిపోయి నేడు ఈ దుస్థితిలో పడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గుజరాత్‌లో మోదీ అధికారంలోకి రాకముందే కాంగ్రెస్ వ్యతిరేక వాతావరణం ఏర్పడడానికి సామాజిక, చారిత్రక మూలాలున్నాయి. బిజెపి దాన్ని అనుకూలంగా మళ్లించుకుంది. నరేంద్రమోదీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ అధికారాన్ని స్థిరపరిచేందుకు, మూడు సార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు ఎటువంటి వ్యూహాలను అవలంభించారో చరిత్ర పుటల్లో నమోదైంది. ఇక ఆడ్వాణీ సారథ్యంలో బిజెపి అధికారంలోకి రావడంలో విఫలమైన తర్వాత, యుపిఏ పది సంవత్సరాల పాలనలో ప్రజావ్యతిరేకతను చవిచూసిన తర్వాత దేశంలో ప్రత్యామ్నాయం కోసం ప్రజలు ఎదురు చూస్తున్న తరుణంలో బిజెపికి సారథ్యం వహించే అవకాశాన్ని సంఘ్ ఆయనకు ఇచ్చింది.


కాని ఈ ఆరేళ్లలో నరేంద్రమోదీ బిజెపిని, ఆర్‌ఎస్‌ఎస్‌ను మించిన నాయకుడు అయ్యారా? ఇవాళ సంస్థ కన్నా వ్యక్తి ప్రాధాన్యత పెరిగిందా, తమ భావజాలంపై మోదీ వ్యక్తిత్వం నీడలు పరుచుకున్నాయా? ఈ విషయాలపై ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది ఆరెస్సెస్, బిజెపి నేతలే. ఒకప్పుడు ఇందిరాయే ఇండియా, ఇండియాయే ఇందిరా అన్నందుకు బారువా అనే ఒక వంధిమాగధుడు తీవ్ర విమర్శలకు లోనయ్యారు. ఇవాళ మోదీయే ఇండియా, ఇండియాయే మోదీ అన్న పరిస్థితి ఏర్పడింది. మోదీ ఆర్థిక విధానాలు, వివిధ రాష్ట్రాల్లో అధికారం కోసం బిజెపి చేస్తున్న కుట్రపూరిత యత్నాలు, ప్రత్యర్థులను అణిచివేసేందుకు సంస్థలను ఉపయోగించుకుంటున్న తీరు, సీనియర్ నేతలనుంచి కేంద్ర మంత్రులవరకు మోదీ భజన చేయకుండా ఉండలేని స్థితి, నిరసన ప్రదర్శనలపై అవలంభిస్తున్న దౌర్జన్యపూరిత చర్యల వల్ల ఆరెస్సెస్, బిజెపి విశ్వసనీయత పెరిగిందా, తగ్గిందా అని ఆ సంస్థల నాయకులే చర్చించుకోవాలి. ఎటువంటి విన్యాసాలకైనా ప్రజలు ఏదో ఒకరోజు స్వస్తి చెబుతారన్న సత్యం చరిత్రపుటలు వెతికితే వెల్లడవుతుంది.


ఎ. కృష్ణారావు

ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి

Updated Date - 2021-04-14T07:34:33+05:30 IST