విదేశీ ప్రయాణికులను గుర్తించండి.. నియంత్రించండి

ABN , First Publish Date - 2020-03-29T07:59:18+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తికి ప్రధాన వాహకాలుగా ఉన్న విదేశీ ప్రయాణికులను గుర్తించి వారి కదలికలను అదుపు చేయడంపై దృష్టి...

విదేశీ ప్రయాణికులను గుర్తించండి.. నియంత్రించండి

  • కోవిడ్‌ 19పై యుద్ధం చేస్తున్న  సైన్యానికి ‘కవచాలు’ ఏవీ?
  • సీఎం జగన్‌కు ప్రతిపక్ష నేత చంద్రబాబు లేఖ

అమరావతి, మార్చి 28(ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ వ్యాప్తికి ప్రధాన వాహకాలుగా ఉన్న విదేశీ ప్రయాణికులను గుర్తించి వారి కదలికలను అదుపు చేయడంపై దృష్టి కేంద్రీకరించండి. జనవరి 18 నుంచి మార్చి 23 మధ్యలో 15 లక్షల మంది విదేశాల నుంచి దేశంలోకి వచ్చారని కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో వారిలో ఎంత మంది మన రాష్ట్రంలోకి వచ్చారో ఖచ్చితమైన లెక్కలు తీయండి’’ అని ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబు సలహా ఇచ్చారు. కొన్ని అంశాలపై శనివారం రాత్రి ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి ఒక లేఖ రాశారు.  విదేశాలకు వెళ్ళి వచ్చిన వారిని 14 నుంచి 28 రోజులపాటు ఇంట్లోనో లేదా ప్రత్యేక వార్డుల్లో ఉంచగలిగితేనే వైరస్‌ వ్యాప్తిని ఆపగలుగుతామన్నారు.


కేంద్రం నుంచి సమాచారం తీసుకోవడం ద్వారా విదేశీ ప్రయాణికులను తక్షణం గుర్తించాలని ఆయన సూచించారు. వైరస్‌ బారినపడిన వారిని గుర్తించడానికి రాష్ట్రంలో ఇప్పుడు చేస్తున్న పరీక్షలు చాలవని ఆయన స్పష్టం చేశారు. ఇంకా పరీక్ష కిట్లు సేకరించుకోవాలిని ఆయన సూచించారు. వైరస్‌ బాధితులను గుర్తించడం... తరలించడం... వైద్యం అందించడంలో ముందు వరుసలో ఉండి పనిచేస్తున్న వారికి రక్షణ గౌన్లు, మాస్కులు మరిన్ని సేకరించి పంపిణీ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.  అనంతపురం జిల్లాలో ఓ వ్యక్తి తన కుమారుడి మృతదేహాన్ని చేతులపై మోసుకువెళ్ళి అంత్యక్రియలు పూర్తి చేయాల్సి వచ్చిన పరిస్థితి తన హృదయాన్ని కలిచివేసిందని చంద్రబాబు పేర్కొన్నారు.  కేంద్ర సాయానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా పేదల కుటుంబాలకు రూ.5 వేలు వంతున ఇవ్వాలని, ప్రజలు కూడా వైరస్‌ నిరోధానికి తమ వంతు సహకారం అందించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2020-03-29T07:59:18+05:30 IST