ధైర్య సాహసాలతోనే గుర్తింపు

ABN , First Publish Date - 2022-01-25T04:41:32+05:30 IST

ధైర్య సాహసాలతోనే గుర్తింపు

ధైర్య సాహసాలతోనే గుర్తింపు
హిమప్రియకు జ్ఞాపికను అందిస్తున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌

- కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌

- హిమప్రియకు రాష్ట్రీయ బాల పురస్కార్‌ అవార్డుపై అభినందనలు

కలెక్టకేట్‌, జనవరి 24: ధైర్య, సాహసాలు ఉన్నవారికి సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ తెలిపారు. శ్రీకాకుళం మండలం పొన్నాం గ్రామానికి చెందిన గురువు హిమప్రియ రాష్ట్రీయ బాల పురస్కార్‌ అవార్డుకు ఎంపికైనందుకుగానూ ఆమెను అభినందించారు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా సోమవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్‌ విధానంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో హిమప్రియకు రూ.లక్ష నగదు, ప్రశంసా ప్రతాలు, జ్ఞాపికను కలెక్టర్‌ అందజేశారు. 2018లో జమ్మూ ఆర్మీ క్వార్టర్స్‌లో తీవ్రవాదుల విషయంలో ధైర్యసాహసాలు ప్రదర్శించినందుకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్‌ అవార్డు కోసం దేశంలో 623 నామినేషన్లు రాగా, 29 ఎంపికయ్యాయి. వీటిలో సిక్కోలుకు చెందిన హిమప్రియ ఉండడం జిల్లాకే గర్వకారణం. ఆమె సాహసం పలువురికి ఆదర్శం’ అని  కొనియాడారు. అనంతరం హిమప్రియ మాట్లాడుతూ.. సైనిక కుటుంబంలో జన్మించినందుకు ఎంతో గర్వంగా ఉందన్నారు. ‘మా నాన్న గారు ఉద్యోగరీత్యా జమ్మూ కాశ్మీర్‌లో ఉండేవాళ్లం. 2018 ఫిబ్రవరి 10న మా క్వార్టర్స్‌పై తీవ్రవాదులు భారీ మారణాయుధాలతో సుమారు నాలుగైదు గంటలపాటు దాడి చేశారు. ఆ సమయంలో మా నాన్న స్ఫూర్తితో ధైర్యంగా పోరాడాను. మా అమ్మతో పాటు క్వార్టర్స్‌లో కొంతమందిని కాపాడుకోవడం ఎంతో ఆనందంగా ఉంది’ అని హిమప్రియ తెలిపారు. కార్యక్రమంలో జేసీలు  కె.శ్రీనివాసులు, ఎం.విజయ సునీత, ఐసీడీఎస్‌ పీడీ జయదేవి, హిమప్రియ తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-25T04:41:32+05:30 IST