ఇదేనా ‘సంక్షేమం’!?

ABN , First Publish Date - 2022-08-17T06:23:42+05:30 IST

పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల కోసం బీసీ, ఎస్సీ సంక్షేమ శాఖలు నిర్వహిస్తున్న వసతిగృహాల్లో సమస్యలు తాండవిస్తున్నాయి.

ఇదేనా ‘సంక్షేమం’!?
బీసీ హాస్టల్‌లో పెచ్చులు ఊడిపోయిన శ్లాబును పరిశీలిస్తున్న ఏఐవైఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి వియ్యపు రాజు

శిథిలావస్థలకు బీసీ, ఎస్సీ విద్యార్థుల వసతిగృహాలు

శ్లాబ్‌ నుంచి ఊడిపడుతున్న పెచ్చులు

వర్షంపడితే కారిపోతున్న భవనాలు

మరుగుదొడ్లు, స్నానపు గదులు అధ్వానం

రెక్కలు ఊడిపోయిన కిటికీలు

బడుగు బిడ్డల ప్రాణాలకు పొంచిఉన్న ముప్పు

పట్టించుకోని అధికారులు


తుమ్మపాల, ఆగస్టు 16: పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల కోసం బీసీ, ఎస్సీ సంక్షేమ శాఖలు నిర్వహిస్తున్న వసతిగృహాల్లో సమస్యలు తాండవిస్తున్నాయి. జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో బీసీ బాలుర వసతిగృహం, ఎస్సీ కాలేజీ బాలుర వసతి గృహాలు అత్యంత దారుణంగా వున్నాయి. భవనాలు శిథిలమయ్యాయి. వర్షం పడితే శ్లాబ్‌ నుంచి నీరు కారుతున్నది. శ్లాబ్‌ పెచ్చులు ఊడిపోయి ఇనుప ఊచలు బయటకు కనిపిస్తున్నాయి. కిటికీలకు రెక్కలు లేకపోవడంతో దోమలు, ఈగలు లోపలికి వస్తున్నాయి. రాత్రిపూట దోమల బెడదతో విద్యార్థులు జాగారం చేస్తున్నారు. మరుగుదొడ్లు, స్నానపు గదులు కంపుకొడుతున్నాయి. 

అనకాపల్లి గాంధీనగరంలో బీసీ బాలుర వసతిగృహం, ఎస్సీ కాలేజీ బాలుర వసతిగృహం వున్నాయి. ఈ భవనాలను 1979 అక్టోబరు 27న ప్రారంభించారు. వీటిని నిర్మించి దాదాపు 43 ఏళ్లు కావడంతో పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. అప్పుడప్పుడు మరమ్మతులు చేయడం తప్ప... కొత్త భవనాలు నిర్మించలేదు. బీసీ బాలుర వసతిగృహంలో ఆరు గదులు ఉండగా ఐదు గదుల్లో శ్లాబు పెచ్చులు ఊడిపోయి, ఇనుప ఊచలు కనిపిస్తున్నాయి. కిటికీలకు కొన్ని తలుపులు లేవు. మరుగుదొడ్లు, స్నానపు గదుల తలుపులు ఊడిపోయి వేలాడుతున్నాయి. ఈ వసతిగృహంలో 120 మంది విద్యార్థులను చేర్చుకునే వెసులుబాటు వుండగా ప్రస్తుతం 50 మంది మాత్రమే వున్నారు. మరో 70 మందికి వసతి కల్పించే అవకాశం వున్నప్పటికీ, భవనం పరిస్థితిని చూసి తల్లిదండ్రులు తమ పిల్లలను హాస్టల్‌లో చేర్చడానికి ఆసక్తి చూపడంలేదు. 

ఈ వసతిగృహానికి  పక్కనే ఎస్సీ కాలేజీ బాలుర వసతిగృహం పరిస్థితి కూడా ఇదే మాదిరిగానే వుంది. ఇక్కడ మూడు గదులు వుండగా, అన్ని గదుల్లోనూ శ్లాబు పెచ్చులు ఊడిపోయాయి. ఈ వసతిగృహంలో 44 మందికి వసతి కల్పించే వీలుండగా ప్రస్తుతం  23 మంది మాత్రమే వున్నారు. రాత్రి పూట నిద్రించే సమయంలో శ్లాబు పెచ్చులు ఊడిపడతాయేమోనని  విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు. బీసీ, ఎస్సీ సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు స్పందించి వసతిగృహాల కోసం కొత్త భవనాలు నిర్మించాలని, అప్పటివరకు వేరే భవనాల్లో హాస్టళ్లను నిర్వహించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. 


Updated Date - 2022-08-17T06:23:42+05:30 IST