ఆదర్శాలు ఆకాశంలో.. ప్రమాణాలు పాతాళంలో!

ABN , First Publish Date - 2022-07-07T06:48:33+05:30 IST

రాష్ట్రంలో కేజీ టు పీజీ ఉచిత, నిర్బంధ విద్యను ప్రమాణాలతో అందిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. పునాది స్థాయి చదువులో లోటుపాట్లను పరిహరించి...

ఆదర్శాలు ఆకాశంలో.. ప్రమాణాలు పాతాళంలో!

రాష్ట్రంలో కేజీ టు పీజీ ఉచిత, నిర్బంధ విద్యను ప్రమాణాలతో అందిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. పునాది స్థాయి చదువులో లోటుపాట్లను పరిహరించి, మెరుగైన ప్రమాణాలు సాధనకు ఉద్దేశించిన ఈ ప్రకటనకు వాస్తవిక కార్యాచరణ ఎక్కడా లేదు. రాష్ట్రంలో చదువులు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో, ప్రమాణాలు ఎంతగా దిగజారాయో ఇటీవల జరిగిన ‘నేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే–2021’ తెలియజేస్తున్నది. పాఠశాల విద్యా సామర్థ్యాలలో, విద్యా ప్రమాణాలలో దేశం మొత్తంలో తెలంగాణ రాష్ట్రం కింది నుంచి రెండవ స్థానంలో, బిహార్‌ కంటే మాత్రమే పైన ఉండడం విద్యాభిమానులను దిగ్భ్రాంతి పరిచింది. 


మిగులు బడ్జెట్‌ ఉన్న రాష్ట్రంలో విద్యారంగానికి గత ఎనిమిదేళ్ళుగా నిధులు తగ్గిస్తూ వస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 12 శాతంగా ఉన్న స్థితి నుంచి ఏడాదికేడాది తగ్గిస్తూ 6.46 శాతానికి (2022–23) కుదించారు. అలాగే పాఠశాలల్లో వేలాది టీచర్‌ పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో పాఠశాల విద్యలో 1,962 గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుల పోస్టులు, 2,043 ప్రాథమిక స్థాయి ప్రధానోపాధ్యాయులు, 7,136 వివిధ సబ్జెక్టుల స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు, 8,185 ఎస్జీటీ తత్సమాన పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే 10,479 పండితుల, పి.ఇ.టి.ల అప్‌గ్రేడెడ్‌ పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి. 5,571 పి.ఎస్‌. హెచ్‌.ఎం. పోస్టులు మంజూరీకి హామీ ఇచ్చి ఉన్నారు. అలాగే రాష్ట్రంలో 596 మండలాలుంటే 539 మండలాలకు ఎం.ఇ.వో పోస్టులున్నాయి. ఇంకా 57 మండలాలకు పోస్టులు లేవు. వాటిలో కేవలం రాష్ట్రం మొత్తం మీద 16 మంది మాత్రమే రెగ్యులర్‌ ఎం.ఇ.వో.లున్నారు. అంటే 580 ఎం.ఇ.వో ఖాళీలున్నాయి. అలాగే డిప్యూటి డి.ఇ.వో. పదవులు 63 ఉండగా, 61 ఖాళీలున్నాయి. డైట్‌ లెక్చరర్లు 212, బిఇడీ లెక్చరర్లు 92 ఖాళీలున్నాయి. విద్యాపరిశోధన శిక్షణా మండలిలో 29 ఖాళీలున్నాయి. ఇన్ని ఖాళీలతో విద్యాబోధన, పర్యవేక్షణ ఎలా సాగుతుందో ప్రభుత్వం ఆలోచించటం లేదు. పేద వర్గాల బిడ్డలకు, శ్రమజీవుల బిడ్డలకు విద్యనందించే ప్రభుత్వ పాఠశాలల పట్ల ఈ క్రూరమైన నిర్లక్ష్యం వాంఛనీయం కాదు. 


విద్యారంగ సమస్యల పరిష్కారం, బదిలీలు, పదోన్నతుల విషయంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి మే 16, 2018న ప్రగతిభవన్‌లో మంత్రివర్గ ఉపసంఘం – సంఘాల సమావేశంలో హామీ ఇచ్చారు. అలాగే మార్చి 22, 2021న, మార్చి 10, 2022న శాసనసభలోనూ హామీ ఇచ్చారు. అలాగే విద్యామంత్రి పలు సందర్భాలలో హామీ పడ్డారు. కాని నేటికీ ఒక్క సమస్య పరిష్కారం కాక, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా ఉంది. 


పాఠశాలల్లో అనేక ఖాళీలతో ఉపాధ్యాయుల్లేక, పదోన్నతులు లేక, బదిలీలు లేక, పర్యవేక్షణ లేక, పాఠ్యపుస్తకాలు లేక, ఏకరూప దుస్తులు లేక, విద్యావాలంటీర్లు లేక, స్వచ్ఛ కార్మికులు లేక, నిధులు లేక పాఠశాలలు ఎలా నడుస్తాయి? ప్రజలు, తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలను ఎలా విశ్వసిస్తారు? ప్రభుత్వ విద్యావ్యవస్థ ఎలా పరిరక్షించబడుతుంది? మాటలు కోటలు దాటుతున్నాయి, కాని కాలు గడప దాటడం లేదంటే ఇదేనేమో?


ప్రభుత్వం లోకల్‌ క్యాడర్‌ ఆర్గనైజేషన్‌ – 2018 అమలులో భాగంగా తెచ్చిన జీవో 317 అమలులో లోపాల వల్ల ఉపాధ్యాయులకు తీరని నష్టం వాటిల్లింది. ప్రధానంగా స్థానికత కోల్పోయిన వారు, భార్యాభర్తలు, వితంతువులు, వ్యాధిగ్రస్తులు, పరస్పర బదిలీల కోసం సుమారు ఐదువేల మంది ప్రభుత్వానికి అప్పీల్‌ చేసుకున్నారు. నెల రోజుల్లో పరిష్కరించాల్సిన అప్పీల్స్‌, ఆరు నెలలుగా పెండింగులో ఉన్నాయి. ఈలోగా కొందరు పరపతి, పైరవీలతో, నిబంధనలకు విరుద్ధంగా పలుకుబడి బదిలీలు చేయించుకోవడం శోచనీయం.


ప్రభుత్వం వేలాదిగా ఉన్న ప్రధాన స్రవంతి పాఠశాలల పట్ల ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం వహిస్తూ, ఉపాధ్యాయుల పట్ల తూష్ణీభావాన్ని ప్రదర్శిస్తూ ఆ పాఠశాలలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తోంది, వాటిని బలహీనపరుస్తోంది. కాని మరోవైపు కులాల పేరిట గురుకులాలను నిర్వహిస్తూ, వాటికి అన్ని సౌకర్యాలూ కల్పిస్తూ, సమాజంలో వాటి పట్ల విశ్వాసాన్ని పెంచేలా ప్రచారం గావిస్తూ, వాటిని మాత్రమే భవిష్యత్తులో ఉనికిలో ఉంచే ప్రయత్నం చేస్తోంది. దీని ద్వారా విద్యారంగ అసమానతలు పెరుగుతాయని ప్రభుత్వం గుర్తించాలి. అలాగే ప్రభుత్వ విద్యా పతనం ప్రమాదమనే సత్యాన్ని అర్థం చేసుకొని, రాష్ట్రంలోని విద్యార్థులందరికీ అన్ని పాఠశాలల్లో సమానమైన, నాణ్యమైన విద్య అందే ఏర్పాట్లు చేయాలి. ప్రభుత్వం తక్షణం ఒక విద్యాకమిషన్‌ను నియమించడం అవసరం.

ముస్కుల రఘుశంకర్‌ రెడ్డి

రాష్ట్ర అధ్యక్షులు, డి.టి.ఎఫ్‌. 

(విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం నేడు హైదరాబాదులోని ఇందిరా పార్క్‌లో 

ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ మహాధర్నా)

Updated Date - 2022-07-07T06:48:33+05:30 IST