శభాష్‌.. మహిళా!

ABN , First Publish Date - 2022-06-08T04:27:13+05:30 IST

బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని...

శభాష్‌.. మహిళా!
శంషాబాద్‌ : పిల్లోనిగూడలో ఏర్పాటు చేసుకున్న క్లాత్‌స్టోర్‌, అంతర చిత్రంలో బ్యూటీ పార్లర్‌ నిర్వాహకురాలు రాధిక

  • తీసుకున్న రుణంతో ఆర్థికాభివృద్ధి 
  • బ్యాంకు లింకేజీలో రాష్ట్రంలో జిల్లా ముందంజ 
  • వ్యాపారాలతో ఆదర్శంగా నిలుస్తున్న మహిళలు


బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని... సకాలంలో రుణాలను చెల్లిస్తూ పొదుపు సంఘాల మహిళలు ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారు. బ్యాంకు రుణాలతో వివిధ వ్యాపారాలు చేస్తూ కుటుంబాలకు ఆసరాగా ఉంటున్నారు. 


ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌, జూన్‌ 4 : రంగారెడ్డి జిల్లాలో బ్యాంకు లింకేజి ద్వారా రుణాలు తీసుకున్న పొదుపు సంఘాల మహిళలు ఆదర్శంగా నిలుస్తున్నారు. జిల్లాలో వంద శాతానికి మించి లోన్లు పంపిణీ చేశారు. రుణాల పంపిణీలో రాష్ట్రంలోనే జిల్లా ముందంజలో ఉంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో 15,821 మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజి ద్వారా రూ.56,240.09 లక్షల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇప్పటివరకు 12,224 మహిళా సంఘాలకు రూ.59,146.45 లక్షల రుణాలు అందించారు. లక్ష్యానికి మించి 105.17శాతం రుణ సౌకర్యం కల్పించారు. బ్యాంకుల ద్వారా రుణాలు పొందిన పొదుపు సంఘాల మహిళలు వారు తీసుకున్న రుణాలతో వివిధ వ్యాపారాలు చేస్తూ ఆర్థిక వృద్ధిని సాధిస్తున్నారు. వ్యవసాయ కుటుంబాలకు చెందిన మహిళలు లోన్‌ డబ్బులను కూరగాయ, ఇతర పంటల సాగుకు వినియోగిస్తుండగా.. ఇతర మహిళలు ఆ డబ్బులతో కిరాణా షాప్‌ పెట్టుకుంటున్నారు. కొంతమంది మహిళలు కుట్టు మిషన్లు, రెడీమెడ్‌ దుస్తుల విక్రయాలు, ఫొటో స్టూడియో, ఇతర కుటీర పరిశ్రమలు సైతం నిర్వహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రతినెలా క్రమం తప్పకుండా లోన్‌ తిరిగి చెల్లిస్తుండటంతో బ్యాంకర్లు సైతం క్రమంగా వారికి ఇచ్చే లోన్‌ మొత్తాన్ని పెంచుతూ పోతున్నారు. 


జిల్లాకు మూడు ప్రతిష్టాత్మక అవార్డులు 

ఎస్‌హెచ్‌జీ బ్యాంకు లింకేజీలో రాష్ట్రస్థాయిలో జిల్లా మొదటిస్థానంలో నిలిచింది. జిల్లా గ్రామీణ అభివృద్ధి ఆధ్వర్యంలో గ్రామీణ మహిళా సాధికారత కార్యక్రమాల అమలులో భాగంగా స్వయం సహాయక సంఘాల అభివృద్ధి కోసం ఎస్‌హెచ్‌జీ బ్యాంకు లింకేజి కార్యక్రమం ద్వారా మహిళలకు నూతన జీవనోపాధులను ప్రోత్సహించింది. లక్ష్య సాధనలో అత్యంత ప్రతిభ కనబర్చిన శంషాబాద్‌ మండలం నర్కూడ కెనరా బ్యాంక్‌, ఇబ్రహీంపట్నం మండల సమాఖ్య, కడ్తాల మండలానికి అవార్డులు దక్కాయి.


నెలకు 20 వేలు సంపాదిస్తున్న

మాది వ్యవసాయ కుటుంబం. పొదుపు సంఘంలో ఉండేందుకు మొదట్లో భయపడ్డాను. అత్తామామలు బయటకు పంపిస్తారో లేదోనని అనుకున్నాను. కానీ.. వారే నన్ను ప్రోత్సహించడంతో సంఘంలో చేరాను. స్ర్తీనిధి, బ్యాంకు లింకేజి ద్వారా తక్కువ వడ్డీతో లోన్‌ ఇస్తున్నారు. బయట వడ్డీకి తీసుకుంటే చెల్లించలేని పరిస్థితి. సంఘం సభ్యుల అనుమతితో బ్యాంకు లింకేజి ద్వారా రూ. 1.50 లక్షలు లోన్‌ తీసుకున్నాను. తీసుకున్న లోన్‌ డబ్బులతో కొంత కుటుంబ అవసరాలకు వాడుకున్నాను. మిగిలిన డబ్బులతో బట్టల షాపును ఏర్పాటు చేసుకున్నాను. బట్టల షాపు ద్వారా నెలకు రూ.20 వేల వరకు సంపాదిస్తున్నాను. పిల్లలను చదివిస్తున్నాను. శంషాబాద్‌లో స్టిచ్చింగ్‌ నేర్చుకుంటున్నాను. నెల రోజుల్లో కోర్సు కంప్లీట్‌ అవుతది. త్వరలో కుట్టుమిషన్‌ కొనుక్కోవాలనుకుంటున్నాను. 

- రాఘవదేవి, వెన్నెల పొదుపు సంఘం, పిల్లోనిగూడ గ్రామం, శంషాబాద్‌ మండలం


బ్యూటీ పార్లర్‌ ఏర్పాటు చేసుకున్నాను

2007 సంవత్సరలో క్రాంతి పొదుపు సంఘం పేరిట సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం. 16 సంవత్సరాల నుంచి ఇప్పటివరకు 16 సార్లు లోన్‌ తీసుకున్నాను. మొదటగా వ్యవసాయం కోసం రూ.20 వేలు రుణంగా తీసుకున్నాను. బ్యూటీ పార్లర్‌ కోర్సు పూర్తిచేసి గ్రామంలో సింధు హెర్బల్‌ పేరిట బ్యూటీ పార్లర్‌ షాప్‌ను ఏర్పాటు చేసుకున్నాను. పార్లర్‌ కోసం బ్యాంకు లింకేజి ద్వారా రూ.50 వేలు లోన్‌ తీసుకున్నాను. షాప్‌ విస్తరణకు మళ్లీ రూ.లక్ష తీసుకున్నాను. తక్కువ వడ్డీ ఉండటంతో నెలనెలా తిరిగి చెల్లించగలుగుతున్నాను. ఇప్పటివరకు రూ.4.50 లక్షల రుణం తీసుకున్నాను. ప్రస్తుతం షాప్‌ బాగా రన్‌ అవుతుంది. 

- జి.రాధిక, కొత్తూరు గ్రామం, కొందుకూరు మండలం


ఫొటోస్టూడియో నడిపిస్తున్న

త్రిపుర పేరుతో 2015-16 సంవత్సరంలో గ్రామంలో పొదుపు సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం. సంఘం ద్వారా మొదటిసారి రూ.8,500 తీసుకున్నాను. ఆ డబ్బును కుటుంబ అవసరాల కోసం వాడుకున్నాను. తర్వాత రూ.30 వేల లోన్‌ తీసుకుని ప్రింటర్‌ కొన్నాను. మరోసారి రూ. 80 వేలు తీసుకుని ఫొటో కెమెరా కొనుగోలు చేశాను. శ్రీలక్ష్మి పేరుతో ఫొటో స్టూడియో ఏర్పాటు చేసుకున్నాను. బ్యాంకు లింకేజి ద్వారా రూ.1.50లక్షల లోన్‌ తీసుకుని వీడియో కెమెరా తీసుకున్నాను. ఇప్పటివరకు మొత్తం 8సార్లు రూ.3.50 లక్షలు అప్పు తీసుకున్నాను. ఫొటో స్టూడియో మంచిగా రన్‌ అవుతుంది. వచ్చిన డబ్బులతో ఆర్థికంగా ఎదుగుతున్నాను. పిల్లలను చదివిస్తున్నాను. 

- కుంచెం కవితభాస్కర్‌, అగర్మియాగూడ, కందుకూరు మండలం


జిల్లాలో లక్ష్యానికి మించి రుణాలు ఇచ్చాం

జిల్లాలో లక్ష్యానికి మించి రుణాలు ఇవ్వడం జరిగింది. బ్యాంకు లింకేజీ రుణాలు 2021-22 సంవత్సరానికి రూ.562 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా కాగా రూ.591 కోట్లు ఇవ్వడం జరిగింది. వంద శాతానికి పైగా రుణాలు ఇచ్చాము. ఈ రుణాలతో 3,500 కొత్తగా వ్యాపారాలను ప్రారంభించడం జరిగింది. 2022-23 సంవత్సరానికి బ్యాంకు లింకేజి రూ.710 కోట్లు టార్గెట్‌గా నిర్దేశించాం. ఈ ఏడాది 8వేల కొత్త వ్యాపారాలను ప్రారంభించేందుకు లక్ష్యంగా నిర్ణయించాం. లక్ష్యసాధనలో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవగా, మూడు ముఖ్యమైన అవార్డులు దక్కాయి. జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్‌కు సంబంధించిన కార్యక్రమాల అమలుకు సంబంధించి జాతీయ స్థాయిలో నందిగామ మండలానికి అవార్డు వచ్చింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో భూటాన్‌, సిక్కిం, మహారాష్ట్ర తదితర రాష్ర్టాల నుంచి అధికారుల బృందం పర్యటించి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పట్ల హర్షం వ్యక్తం చేశారు. 

- ప్రభాకర్‌, డీఆర్‌డీఏ పీడీ 


జిల్లాలో బ్యాంకు లింకేజి లక్ష్యం, సాధించిన ప్రగతి వివరాలు

నియోజకవర్గం    2021-22 టార్గెట్‌ సాధించిన ప్రగతి శాతం

ఎస్‌హెచ్‌జీఎస్‌ (రూ.లక్షల్లో) ఎస్‌హెచ్‌జీఎస్‌ (రూ.లక్షల్లో)

మహేశ్వరం 1,976 7494.11 1,596 7766.78 100.30

చేవెళ్ల 3,520 11162.36 2,496 1200.87 107.55

ఇబ్రహీంపట్నం 3,485 11953.01 2,705 12714.62 106.37

షాద్‌నగర్‌ 3,392 12371.82 2,911 12896.67 104.24

కల్వకుర్తి 2,450 9470.60 1,734 10080.68 106.44

రాజేంద్రనగర్‌ 894 3495.17 782 3658.38 104.67

మొత్తం 15,821 56240.09 12,224 59146.45 105.17



Updated Date - 2022-06-08T04:27:13+05:30 IST