ఆదర్శం.. ఆ గ్రామాలు!

ABN , First Publish Date - 2022-08-15T05:54:56+05:30 IST

గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అని మహాత్మాగాంధీ అన్నారు. పల్లెలు అభివృద్ధి సాధిస్తేనే దేశాభివృద్ధి సాధ్యం. అక్షరాస్యత, పరిశుభ్రత, స్వచ్ఛత, మద్యానికి దూరంగా ఉండడం మౌలిక వసతుల కల్పన ద్వారా గ్రామాలు త్వరగా అభివృద్ధి సాధిస్తాయి. కామారెడ్డి జిల్లాలో ఇలా అభివృద్ధి దిశగా సాగుతున్న పల్లెలు ఉన్నాయి.

ఆదర్శం.. ఆ గ్రామాలు!
ఉగ్రవాయి గ్రామం

- మహాత్ముని ఆశయం దిశగా పయనం

- అన్ని గ్రామాల్లో ఇదే స్ఫూర్తి రావాలి

- డిజిటలైజేషన్‌లో అగ్రగామిగా ఉగ్రవాయి

- ప్రభుత్వ పాఠశాలల ప్రోత్సాహంలో ఇస్రోజివాడి, భూంపల్లి


కామారెడ్డి, ఆగస్టు 14: గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అని మహాత్మాగాంధీ అన్నారు. పల్లెలు అభివృద్ధి సాధిస్తేనే దేశాభివృద్ధి సాధ్యం. అక్షరాస్యత, పరిశుభ్రత, స్వచ్ఛత, మద్యానికి దూరంగా ఉండడం మౌలిక వసతుల కల్పన ద్వారా గ్రామాలు త్వరగా అభివృద్ధి సాధిస్తాయి. కామారెడ్డి జిల్లాలో ఇలా అభివృద్ధి దిశగా సాగుతున్న పల్లెలు ఉన్నాయి. 75 ఏళ్ల స్వాతంత్ర వజ్రోత్సవాల సంబరాల వేళ ఆ పల్లెల స్ఫూర్తితో ఇతర గ్రామాలు పయనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

కమిటీలతోనే అభివృద్ధి

కామారెడ్డి మండలం ఉగ్రవాయి గ్రామంలో 100శాతం డిజిటలైజేషన్‌ ద్వారా డబ్బులు తీసుకోవడం, బ్యాంకుల ఖాతాలన్నీ డిజిటలైజేషన్‌ ద్వారా కార్యకలపాలు నిర్వహిస్తున్నారు. మహిళా సంఘాల స్ఫూర్తితో గ్రామంలో ఉన్న 86 మహిళా సంఘాల ఆర్థిక వ్యవహారాలను డిజిటలైజేషన్‌ ద్వారా నిర్వహిస్తున్నారు. జిల్లాలోనే డిజిటలైజేషన్‌ ద్వారా బ్యాంకు కార్యకలపాలు నిర్వహిస్తున్న ఏకైక గ్రామం ఉగ్రవాయి గ్రామం. గ్రామాభివృద్ధి కమిటీ, మహిళా స్వయం సహాయక కమిటీల ఆధ్వర్యంలో గ్రామంలో ఇంకుడు గుంతలు,వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇంటింటికీ కుళాయి కార్యక్రమాలు నిర్వహించారు. పల్లెప్రగతి కార్యక్రమంలో మొక్కలను నాటారు. 2016 నుంచి ఈ గ్రామంలో డిజిటలైజేషన్‌ ద్వారా ఆర్థిక కార్యకలపాలను నిర్వహిస్తున్నారు. మహిళా సంఘాల ద్వారా రుణాలు తీసుకుని మహిళలు డెయిరీఫాం, రెండు కిరాణ దుకాణాలను నిర్వహిస్తూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. ఈ గ్రామ మహిళా సంఘాలకు కేంద్ర ప్రభుత్వం డిజిటలైజేషన్‌ చేపట్టిన గ్రామంగా గుర్తించి అవార్డులు అందజేసింది. ఇదే గ్రామానికి చెందిన ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు గ్రామాభివృద్ధికి తన వంతు సాయంగా ప్రభుత్వ నిధులను తెచ్చి సీసీరోడ్లు, మురికి కాలువలు వంద శాతం నిర్మించారు.

ప్రైవేట్‌ పాఠశాలలకు బైబై చెప్పిన గ్రామస్థులు

విద్యాభ్యాసం కోసం ప్రైవేట్‌ పాఠశాలల్లో పిల్లలను చదివించవద్దంటూ ప్రభుత్వ పాఠశాలలే ముద్దు అంటూ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లోనే తమ పిల్లలను చదివించాలని ప్రైవేట్‌ పాఠశాలలకు పంపవద్దని కామారెడ్డి మండలం ఇస్రోజివాడి, సదాశివనగర్‌ మండలం భూంపల్లి గ్రామస్థులు ఏక గ్రీవంగా తీర్మానించి ప్రైవేట్‌ పాఠశాలలకు తమ గ్రామం నుంచి విద్యార్థులను పంపకుండా ప్రభుత్వ పాఠశాలలోనే చదివిస్తున్నారు. ఉపాధ్యాయులు తక్కువగా ఉంటే విద్యావాలంటర్లను విద్యాకమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి నెలనెల వేతనాలు ఇస్తూ ప్రభుత్వ పాఠశాలలను పటిష్టవంతం చేస్తున్నారు. గత రెండు సంవత్సరాల నుంచి ఇస్రోజివాడి గ్రామస్థులు తీసుకున్న నిర్ణయాన్ని ఆదర్శంగా తీసుకున్న సదాశివనగర్‌ మండలం భూంపల్లి గ్రామస్థులు ఈ విద్యాసంవత్సరంలో తీర్మానం చేసి ప్రైవేట్‌ పాఠశాలలకు పంపకుండా విద్యార్థులను తమ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోనే చదివిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

మద్యపాన నిషేధం విధించిన గ్రామస్థులు

గ్రామాల్లో యువతతో పాటు పెద్దలు మద్యానికి బానిసై నానా బీభత్సం సృష్టించడంతో పాటు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారని మద్యపానం నిషేధం విధిస్తేనే గ్రామానికి మేలు అని భావించిన భిక్కనూరు మండలం కాచాపూర్‌ గ్రామస్థులు గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో తీర్మానం చేశారు. మద్యపాన నిషేధం గత రెండు సంవత్సరాల నుంచి అమలవుతోంది. గ్రామంలోని యువకులు తీవ్రంగా శ్రమించారు. యువజన సంఘాలు, మహిళలు ఏకతాటిపైకి రావడంతో ఆ గ్రామాల్లో మద్యం అనే మాట వినిపించదు. ప్రారంభంలో కొందరు ఇతర ప్రాంతాల నుంచి మద్యం తీసుకుని వచ్చి తాగేవారు. రాత్రిపూట ఈ సమస్య మరీ ఎక్కువగా ఉండేది. దీంతో గ్రామంలో మద్యపాన వ్యతిరేక కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. కరపత్రాలతో ప్రచారం చేయడమే కాకుండా ఇంటింటికీ వెళ్లి మద్యం తాగరాదంటూ సంతకాలు సేకరించారు. మద్యం తాగే వారితో ప్రతిజ్ఞ చేయించారు. ప్రస్తుతం ఆయా గ్రామాల్లో స్వచ్ఛందంగానే ప్రతి ఒక్కరూ మద్యపానానికి దూరంగా ఉంటున్నారు.

ప్రతీ ఇంటికి బావులను తవ్వారు

సదాశివనగర్‌ మండలం లింగంపల్లిలో భూగర్భజలాలను పెంపొందించుకునేందుకు రైతు సంఘం ఆధ్వర్యంలో ఏర్పడిన క్లబ్‌లో తీర్మానించిన రైతులు ప్రతీ వ్యవసాయ భూమి వద్ద బోరు బావులు తవ్వకుండా బావులను తవ్వి నీటి సంరక్షణకు కృషి చేస్తున్నారు. బోరుబావులు వేసి లక్షల రూపాయలు ఖర్చుచేయడం వల్ల ఆర్థికంగా నష్టపోతామని భావించిన రైతులు వ్యవసాయ పొలాలకు ప్రతీ రైతు బావులను తవ్వి వాటి ద్వారా పంటలకు నీరు పారిస్తున్నారు. దీంతో భూగర్భజాలాలు పెరుగుతున్నాయి. అంతేకాకుండా ఇంటింటికీ ఇంకుడు గుంతలను తవ్వుకోవడంతో పాటు ఇంటింటికీ మరుగుదొడ్డిని నిర్మించుకుని వందశాతం ఇంకుడు గుంతలు మరుగుదొడ్లు గల గ్రామంగా ప్రసిద్ధి చెందింది. జిల్లాలోనే అత్యధిక వ్యవసాయ బావులు ఉన్న గ్రామంగా లింగంపల్లి ఆదర్శంగా నిలుస్తోంది.

Updated Date - 2022-08-15T05:54:56+05:30 IST