ఆదర్శం పల్లె ప్రకృతివనం

ABN , First Publish Date - 2021-10-28T04:48:47+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలను పచ్చదనంగా మార్చాలనే ఆశయంతో పల్లె ప్రకృతివనాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.

ఆదర్శం పల్లె ప్రకృతివనం
కలబ్‌గూర్‌లో ఏర్పాటు చేసిన ప్రకృతివనం

మూడెకరాల్లో ప్రకృతివనం ఏర్పాటు

55 రకాల మొక్కల పెంపకం


సంగారెడ్డిరూరల్‌, అక్టోబరు27: రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలను పచ్చదనంగా మార్చాలనే ఆశయంతో పల్లె ప్రకృతివనాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా సంగారెడ్డి మండలం కలబ్‌గూర్‌ గ్రామపంచాయతీతో పాటు మదిర గ్రామాలైన అంగడిపేట, గంజిగూడెం గ్రామాలకు కలిపి మూడెకరాల ప్రభుత్వ స్థలంలో ఏర్పాటైన పల్లెప్రకృతి వనం ఆదర్శంగా నిలుస్తోంది. ప్రకృతివనం ఏర్పాటుకు మొదట రాళ్లురప్పలు ఉన్నా స్థలాన్ని ఎంపిక చేశారు. ఆ స్థలంలో మొక్కలు నాటడం కష్టమని సర్పంచ్‌ చెప్పినా అధికారులు ఇక్కడే ఏర్పాటు చేయాలని సూచించారు. చేసేది లేక గుట్టలుగా ఉన్న భూమిని చదును చేసి పూలు, పండ్లు, ఔషధ మొక్కతో పాటు 55 రకాల వివిధ మొక్కలను నాటారు. సర్పంచ్‌ మంజులపండరినాథ్‌గౌడ్‌ ప్రత్యేక చొరవ తీసుకుని ప్రతిరోజు ఉదయం సాయంత్రం రెండుపూటలా మొక్కలకు నీరుపోసి జీవం పోశారు. అధికారులు పల్లె ప్రకృతివనాన్ని సందర్శించి సంతృప్తి చెందారు.


 సర్పంచ్‌ కృషి అభినందనీయం

-  రవీందర్‌, ఎంపీడీవో

మొక్కలు నాటేందుకు అనువుగా ఉన్న భూమిలో వనాన్ని ఏర్పాటు చేయడం సర్వసాధారణం. కానీ ఈ స్థలంలో ఎటుచూసినా రాళ్లు ఉన్నా సర్పంచ్‌ ప్రత్యేక చొరవ తీసుకుని మొక్కలకు జీవం పోశారు. సంగారెడ్డి మండలంలోనే కలబ్‌గూర్‌ గ్రామంలోని పల్లె ప్రకృతివనం ఆదర్శంగా నిలుస్తున్నది. 


అధికారుల ప్రోత్సాహంతోనే సాధ్యమైంది

- మంజుల పండరినాథ్‌గౌడ్‌, సర్పంచ్‌, కలబ్‌గూర్‌

పల్లె ప్రకృతివనం ఏర్పాటు చేయాలని స్థలం చూపినప్పుడు భయపడ్డాం. కానీ అధికారులు ప్రోత్సాహంతో ప్రతిరోజు మొక్కలను పర్యవేక్షించి రెండుపూటలా నీరు పట్టాం. సమష్టికృషితోనే పల్లె ప్రకృతివనం ఏర్పాటు చేశాం. 



Updated Date - 2021-10-28T04:48:47+05:30 IST