ఆటైనా, చదువైనా... ఈ ట్విన్స్‌ సూపర్‌!

ABN , First Publish Date - 2021-01-25T07:08:24+05:30 IST

ఆ కవలల అభిరుచులూ, ఆశయాలూ ఒకటే. స్విమ్మింగ్‌లో వారిద్దరూ జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు.అంతేకాదు, చిన్ననాటి నుంచీ లక్ష్యంగా ఎంచుకున్న

ఆటైనా, చదువైనా... ఈ ట్విన్స్‌ సూపర్‌!

 ఆ కవలల అభిరుచులూ, ఆశయాలూ ఒకటే.

స్విమ్మింగ్‌లో వారిద్దరూ జాతీయ స్థాయిలో

 రాణిస్తున్నారు.అంతేకాదు, చిన్ననాటి నుంచీ లక్ష్యంగా ఎంచుకున్న 

మెడిసిన్‌లో ఒకేసారి సీట్లు సాధించారు.

తమ అన్నకు సైతం క్రీడల్లోనే కాదు మెడిసిన్‌ సీటు

 సాధించడంలోనూ స్ఫూర్తినిచ్చిన భూపాలపల్లికి చెందిన అక్షిత, దక్షిత

ఎందరో యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.


‘‘సరదాగా మొదలుపెట్టిన స్విమ్మింగ్‌ ఇప్పుడు మాకు గొప్ప గుర్తింపు తెస్తోంది. అలాగే మేం కలలుకన్న వైద్య వృత్తిని చేపట్టడానికి తొలి అడుగు పడడం సంతోషంగా ఉంది’’ అంటున్నారు తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన కవలలు అక్షిత, దక్షిత. స్విమ్మింగ్‌లో ప్రతిభ చాటుతున్న వీరిద్దరూ మెడిసిన్‌లో సీట్లు సాధించి వార్తల్లో నిలిచారు. 


పోటీకి వెళ్తే పతకం పట్టినట్టే...

ఈ కవల సోదరీమణుల తండ్రి వరకోటి మధుసూదన్‌ వరంగల్‌లోని కెసిఎంలో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా, తల్లి రజిత భూపాలపల్లి సింగరేణి ఆసుపత్రిలో హెడ్‌ నర్స్‌గా పని చేస్తున్నారు. తల్లితండ్రులు వైద్య సంబంధమైన ఉద్యోగాల్లో ఉండడంతో వైద్యులు కావాలనే ఆకాంక్ష బాల్యంలోనే వారికి ఏర్పడింది. వారి తండ్రికి స్విమ్మింగ్‌ అంటే ఇష్టం. తండ్రితో పాటు భూపాలపల్లి సింగరేణి గ్రౌండ్స్‌కు సరదాగా వాళ్ళు వెళ్ళేవారు. ఈత కొట్టడంలో వారి ఆసక్తినీ, నైపుణ్యాన్నీ చూసిన కోచ్‌ శ్రీనివాసరావు వారికి తర్ఫీదునిచ్చారు. మొదట పాఠశాల స్థాయిలో, తరువాత సింగరేణి స్థాయిలో నిర్వహించిన పోటీలకు తీసుకువెళ్ళారు. పాల్గొన్న ప్రతి పోటీలోనూ ప్రతిభ కనబరచిన ఆ అమ్మాయిలకు జాతీయ స్థాయిలో రాణించాలనే పట్టుదల పెరిగింది. క్రమంగా రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. 2010లో విశాఖపట్నంలో జరిగిన పోటీల్లో రాష్ట్రస్థాయిలో దక్షిత రజత పతకాన్నీ, అక్షిత కాంస్య పతకాన్నీ అందుకున్నారు. జాతీయ స్థాయి పోటీలకు వెళ్ళాలంటే రాష్ట్రస్థాయిలో బంగారు పతకాలు సాధించాలి. దానికోసం తీవ్రంగా సాధన చేశారు.


2011లో విజయవాడలో బంగారు పతకాలు సాధించారు. ఆ తరువాత దేశంలోని అనేక ప్రాంతాల్లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి, విజయ పరంపర కొనసాగించారు. ఇప్పుడు వారి ఖాతాలో ఇరవైకి పైగా స్వర్ణ పతకాలూ, ఎనభైకి పైగా రజత, కాంస్య పతకాలు ఉన్నాయి. పుణేలో 2017లో నిర్వహించిన ‘ఖేల్‌ ఇండియా’ ఈవెంట్‌కు తెలంగాణ నుంచి ఎంపికైన నలుగురు  అమ్మాయి ల్లో వీరిద్దరూ ఉన్నారు. దీనికంతటికీ తల్లితండ్రుల ప్రోత్సాహం, కోచ్‌ సహకారమే కారణం అంటారు ఈ ట్విన్స్‌.


హేళనలు ఎదురైనా...

అనేక స్విమ్మింగ్‌ ఈవెంట్స్‌లో పాల్గొంటూ, పదుల సంఖ్యలో పతకాలు సాధిస్తున్నా చదువును వారు ఏమాత్రం అశ్రద్ధ చేయలేదు. డాక్టర్లు కావాలన్న కలను నిజం చేసుకోవడానికి ఎంతో శ్రమించారు. స్విమ్మింగ్‌లో జాతీయ స్థాయిలో పాల్గొంటే స్పోర్ట్స్‌ కోటాలోనైనా మెడిసిన్‌ సీటు సాధించవచ్చని వారు ఆశపడ్డారు. అయితే 2018లో ‘నీట్‌’ ప్రవేశ పరీక్షలో స్పోర్ట్స్‌ కోటాను ప్రభుత్వం నిలిపివేసింది. ‘‘భూపాలపల్లిలోని ఒక ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతున్న మేము ఆ సమయంలో ఎంతో నిరాశకు గురయ్యాం. ‘అనవసరంగా స్విమ్మింగ్‌ అంటూ తిరిగారు. ఇప్పుడు చూడండి. ఆ స్పోర్ట్స్‌ కోటా కూడా లేదు. మెడిసిన్‌లో సీటెలా వస్తుంది?’’ అని చాలామంది మమ్మల్ని హేళన చేశారు. ఆ మాటలు మనస్తాపం కలిగించినా మాలో పట్టుదలను పెంచాయి. స్పోర్ట్స్‌ కోటా లేకపోయినా సీట్లు సాధించాల్సిందే అనుకున్నాం. కరీంనగర్‌లోని మరో ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్‌ సెకండియర్‌ పూర్తి చేశాం.


అలాగే లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌ కూడా తీసుకున్నాం’’ అని చెప్పారు అక్షిత, దక్షిత. వారి కృషి ఫలించింది. కిందటి ఏడాది సెప్టెంబర్‌లో నిర్వహించిన ‘నీట్‌’ పరీక్షలకు హాజరైన అక్షిత 1,517, దక్షిత 1,406 ర్యాంకులు సాధించారు. నవంబర్లో జరిగిన కౌన్సెలింగ్‌లో ఇద్దరికీ వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కాలేజీలో ఎంబిబిఎస్‌ సీట్లు వచ్చాయి. తమ తండ్రి పనిచేస్తున్న చోటే సీట్లు రావడం ఎంతో సంతోషంగా ఉందంటున్నారీ అమ్మాయిలు. అంతేకాదు, అక్షిత, దక్షిత స్ఫూర్తితో స్విమ్మింగ్‌లో రాణిస్తున్న వారి సోదరుడు దత్తా వెంకట సాయి కూడా మెడిసిన్‌లో సీటు సాధించడం విశేషం. ఒకే ఇంటి నుంచి ఒకే ఏడాది ఈ ముగ్గురు పిల్లలూ వైద్య విద్యలో ప్రవేశాలు పొంది, ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.  


అన్నకు ఆదర్శమయ్యారు...

అక్షిత, దక్షితల అన్న వెంకటసాయి వాళ్ళకన్నా ఏడాది పెద్ద. చెల్లెళ్ళతో పాటే స్విమ్మింగ్‌ నేర్చుకున్నాడు. వాళ్ళు పాల్గొనే ప్రతి ఈవెంట్‌కూ బాయ్స్‌ టీమ్‌లో అతనూ వెళ్ళేవాడు. వాళ్ళతో సమానంగా పతకాలు సైతం సాధించాడు. అతను గతంలో ఒకసారి నీట్‌ రాసినా ఫలితం లేకపోయింది. దీంతో చెల్లెళ్ళతో కలిసి లాంగ్‌ టర్మ్‌ కోచింగ్‌ తీసుకున్నాడు. వారితో పాటే కిందటేడాది ‘నీట్‌’ రాశాడు. కౌన్సెలింగ్‌లో అతనికి కరీంనగర్‌లో సీటు వచ్చింది. ‘‘స్విమ్మింగ్‌లో చెల్లెళ్ళతో పోటీ పడేవాణ్ణి. ఇప్పుడు చదువులోనూ పోటీ పడి మెడిసిన్‌ సీటు పొందాను. అటు క్రీడల్లో, ఇటు చదువులో వాళ్ళే నాకు ఆదర్శం’’ అంటున్నాడు వెంకటసాయి.





మా ఇంటి నుంచి ముగ్గురం మెడిసిన్‌లో సీటు సాధించడం చాలా ఆనందంగా ఉంది. స్విమ్మింగ్‌ పోటీల్లో పాల్గొంటున్నా ఏనాడూ చదువును అశ్రద్ధ చేయలేదు. 


తడక రాజనారాయణ, భూపాలపల్లి


అనవసరంగా స్విమ్మింగ్‌ అంటూ తిరిగారు. ఇప్పుడు చూడండి. స్పోర్ట్స్‌ కోటా కూడా లేదు. మెడిసిన్‌లో సీటెలా వస్తుంది? అని చాలామంది హేళన చేశారు. ఆ మాటలు మాలో పట్టుదలను పెంచాయి. 


తికమక తప్పదు!

ఈ సిస్టర్స్‌ ఇద్దరూ ఒకేలా ఉండడంతో స్విమ్మింగ్‌ పోటీల్లో చాలాసార్లు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలో మొదట అక్షిత స్విమ్మింగ్‌కు దిగింది. తన అయిదు ఈవెంట్ల కోటానూ పూర్తి చేసింది. ఆ తరువాత దక్షిత స్విమ్మింగ్‌కు వచ్చినప్పుడు చాలామంది అభ్యంతరం చెప్పారు. ఇద్దరూ ఒకే అమ్మాయి అని పొరపాటు పడడమే దీనికి కారణం. వాళ్ళు వేరు వేరనీ, కవలలనీ నిర్వాహకులు చెప్పడంతో అంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. పతకాలు తీసుకొనేటప్పుడు కూడా ఇలాంటి గందరగోళమే తలెత్తుతూ ఉంటుంది. రూపురేఖలే కాదు, వాళ్ళ వాయిస్‌లు కూడా ఒకేలా ఉంటాయి. దీంతో ఇంటికి ఫోన్‌ చేస్తే... వాళ్ళిద్దరిలో ఎవరు మాట్లాడుతున్నారో తెలియక తల్లితండ్రులు సైతం తికమకపడుతూ ఉంటారు.

Updated Date - 2021-01-25T07:08:24+05:30 IST