Oct 2 2020 @ 20:05PM

50 ఏళ్ళ ‘ఇద్దరు అమ్మాయిలు’

ఏయన్నార్, శోభన్ బాబు హీరోలుగా, వాణిశ్రీ డ్యుయల్ రోల్ లో తెరకెక్కిన చిత్రం 'ఇద్దరు అమ్మాయిలు'... అక్టోబర్ 2తో ఈ చిత్రం యాభై ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది... ఈ సందర్భంగా ఆ చిత్ర విశేషాలను గుర్తు చేసుకుందాం..


ప్రముఖ కన్నడ దర్శకుడు ఎస్.ఆర్.పుట్టన్న కణగల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఇద్దరు అమ్మాయిలు'. ఆర్యంభ పట్టాభి రాసిన కన్నడ నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. చంద్రమతి, భానుమతి అనే అమ్మాయిలు అక్కాచెల్లెళ్ళ బిడ్డలు. చంద్రమతి తండ్రి పేదవాడు, భానుమతి నాన్న ధనవంతుడు. చంద్రమతి పల్లెటూరిలో సంప్రదాయాల నడుమ పెరుగుతుంది. భానుమతి ధనంతో మోడరన్ లైఫ్ సాగిస్తూ ఉంటుంది. ఈ ఇద్దరు అమ్మాయిలలో చంద్రమతి త్యాగానికి ప్రతిరూపం అయితే, భానుమతి స్వార్థపరురాలు. చివరకు ప్రేమలోని గొప్పదనం తెలుసుకున్న భాను పశ్చాత్తాపంతో కథ ముగుస్తుంది. ఇందులో చంద్రమతి, భానుమతిగా వాణిశ్రీ ద్విపాత్రాభినయం చేశారు. చంద్ర ప్రేమికునిగా ఏయన్నార్, భాను చేత అవమానానికి గురైన వ్యక్తిగా శోభన్ బాబు నటించారు. 

'ఇద్దరు అమ్మాయిలు' చిత్రంలో ఏయన్నార్ వంటి అగ్రనటునికి తగిన పాత్ర లేదని అప్పట్లో కొన్ని విమర్శలు వినిపించాయి. అయితే కన్నడ దర్శకుడు పుట్టన్న ప్రతిభపై నమ్మకంతో 'ఇద్దరు అమ్మాయిలు'లో ఆయన నటించారు. ఇక ఈ చిత్రానికి కేవీ మహదేవన్ సంగీతం పెద్ద ఎస్సెట్ అని చెప్పవచ్చు. దాశరథి, కొసరాజు, ఆరుద్ర రాసిన పాటలు అలరించాయి. ఇందులో అక్కినేనికి ఎస్పీ బాలు పాటపాడడం విశేషం. ఆ రోజుల్లో పూర్తి రంగుల్లో రూపొందిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కొన్ని పాటలు మాత్రం ఈ నాటికీ అభిమానులను అలరిస్తూనే ఉన్నాయి.