Oct 17 2021 @ 14:26PM

డిసెంబర్ లో ‘ఐకాన్’ రెగ్యులర్ షూటింగ్ ?

ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప’ పాన్ ఇండియా మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘బాహుబలి, కేజీఎఫ్’ తరహాలో రెండు భాగాలుగా ఈ సినిమా విడుదల కానుంది. మొదటిభాగం ‘పుష్ఫ : ది రైజ్’ చిత్రీకరణ కొద్ది రోజుల్లోనే పూర్తి కానుంది. నవంబర్ మొదటి భాగంతో ‘పుష్ప’ టాకీ పార్ట్ మొత్తం పూర్తయిపోతుంది. ఈ నేపథ్యంలో రెండో భాగం చిత్రీకరణ ప్రారంభించడానికి ముందే ‘ఐకాన్’ మూవీలో నటించాలని బన్నీ అనుకుంటున్నారట. ‘వకీల్‌సాబ్’ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమాని అనౌన్స్ చేసి చాలా రోజులైంది. ఆ తర్వాత ‘పుష్ప’ మూవీ ట్రాక్ లోకొచ్చింది. నిజానికి ‘ఐకాన్’ మూవీని బన్నీ పక్కన పెడుతున్నారని వార్తలు కూడా వినిపించాయి. అయితే ఇప్పుడా వార్తలకు చెక్ పెడుతూ.. బన్నీ ఈ మూవీలో నటించడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.  


తాజా సమాచారం ప్రకారం డిసెంబర్ 17న ‘పుష్ప’ మొదటి భాగం విడుదలైన వెంటనే.. బన్నీ ‘ఐకాన్’ రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించబోతున్నట్టు టాక్. త్వరలోనే ‘ఐకాన్’ సినిమా లాంఛ్ కానుంది. ఆపై రెగ్యులర్ షూటింగ్ కు వెళ్ళబోతోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో బన్నీ బిజినెస్ టైకూన్ గా నటించబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ బిజినెస్ మేన్ ఒకరోజు సడెన్ గా కనిపించడం మానేస్తారట. దాంతో ఆయన అదృశ్యం పోలీసులకు సవాల్ గా మారుతుందట.  ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ కథనం చక్కర్లు కొడుతోంది. మరి నిజంగానే ‘ఐకాన్’ ఇదే స్టోరీ లైన్ తో రూపొందుతుందా, లేదా తెలియాలంటే కొంత కాలం వెయిట్ చేయాల్సిందే.