వ్యాక్సిన్‌ను ఎర్ర కోట నుంచి ప్రకటించాలన్న తహతహలో ఐసీఎంఆర్ : కాంగ్రెస్

ABN , First Publish Date - 2020-07-05T02:33:16+05:30 IST

స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా ఎర్ర కోట నుంచి ప్రధాన మంత్రి మోదీ చేత

వ్యాక్సిన్‌ను ఎర్ర కోట నుంచి ప్రకటించాలన్న తహతహలో ఐసీఎంఆర్ : కాంగ్రెస్

ముంబై : స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా ఎర్ర కోట నుంచి ప్రధాన మంత్రి మోదీ చేత నోవల్ కరోనా వైరస్ (కోవిడ్-19)కు వ్యాక్సిన్‌పై ప్రకటన చేయించాలన్న ఆత్రుతలో భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ఉందని కాంగ్రెస్ ఆరోపించింది. 


మహారాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత పృధ్వీరాజ్ చవాన్ శనివారం ఇచ్చిన ట్వీట్‌లో, ఆగస్టు 15నాటికి కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ను ఆవిష్కరించాలని ప్రయత్నిస్తోందని, ఇదంతా ఎర్ర కోట నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ద్వారా ఈ వ్యాక్సిన్‌ ప్రకటనను చేయించడం కోసమేనని ఆరోపించారు. 


ఐసీఎంఆర్ శుక్రవారం ఓ ప్రకటనలో, ప్రపంచంలోని మొదటి కోవిడ్-19 వ్యాక్సిన్ ఆగస్టు 15నాటికి విడుదల చేయాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్న సంగతి తెలిసిందే. 


దీనిపై చవాన్ స్పందిస్తూ శనివారం ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘అంతర్జాతీయ నిపుణులు కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం 12 నుంచి 18 నెలలు పడుతుందని చెప్తుండగా, భారతీయ కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం ఆగస్టు 15 అనే అవాస్తవ గడువును చెప్తూ ఐసీఎంఆర్ ఎందుకు ఆత్రుతపడుతోంది?’’ అని ప్రశ్నించారు. 


స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎర్ర కోట నుంచి ప్రసంగించేటపుడు ఈ వ్యాక్సిన్ గురించి భారీ ఎత్తున ప్రకటన చేయించాలన్నదే ఐసీఎంఆర్ ఆత్రుత అని ఆరోపించారు.


కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్థన్ ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలని చవాన్  డిమాండ్ చేశారు.



Updated Date - 2020-07-05T02:33:16+05:30 IST