లెక్క తక్కువైతే ముప్పే!

ABN , First Publish Date - 2020-06-07T06:58:38+05:30 IST

..ఒకప్పుడు అనుమానితులకు సైతం కరోనా పరీక్షలు చేయించిన ప్రభుత్వాలు, ఇప్పుడు ఎవరికి పరీక్ష చేయాలన్నా ‘లక్షణాలుంటేనే’ అనే షరతును పెడుతున్నాయి. దీనికి కారణం ఐసీఎంఆర్‌

లెక్క తక్కువైతే ముప్పే!

  • కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు చేయడం 
  • తగ్గించినంత మాత్రాన వైరస్‌ వ్యాప్తి ఆగదు
  • సామాజిక వ్యాప్తి దశకు చేరే ప్రమాదం
  • వైరస్‌ సోకినవారికి ఆరోగ్యసమస్యలుంటే
  • మరణాల సంఖ్య కూడా పెరిగే ముప్పుంది
  • శాస్త్రజ్ఞులు, వైద్యనిపుణుల హెచ్చరిక

గత 14 రోజుల్లో విదేశాల నుంచి వచ్చినవారికి కరోనా పరీక్షలు.. ‘లక్షణాలుంటేనే’!


పాజిటివ్‌గా తేలినవారితో సన్నిహితంగా ఉన్నవారికి పరీక్షలు.. ‘లక్షణాలుంటేనే’!


కరోనా పేషెంట్లకు చికిత్స చేసే వైద్య సిబ్బందికి పరీక్షలు.. ‘లక్షణాలుంటేనే’!


హాట్‌స్పాట్లు, కట్టడి ప్రాంతాల్లోవారికి కొవిడ్‌-19 పరీక్షలు.. ‘లక్షణాలుంటేనే’!


..ఒకప్పుడు అనుమానితులకు సైతం కరోనా పరీక్షలు చేయించిన ప్రభుత్వాలు, ఇప్పుడు ఎవరికి పరీక్ష చేయాలన్నా ‘లక్షణాలుంటేనే’ అనే షరతును పెడుతున్నాయి. దీనికి కారణం ఐసీఎంఆర్‌ ఎప్పటికప్పుడు జారీ చేస్తున్న మార్గదర్శకాలే. అసలు ఐసీఎంఆర్‌ ఈ మార్గదర్శకాలను ఎలా రూపొందిస్తోంది? అనే ప్రశ్న అందరిలో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో.. ఐసీఎంఆర్‌ విధానాలేమిటి? వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడానికి అసలేం చేయాలి? అనే అంశాలను పరిశీలిస్తే..


సెంట్రల్‌ డేటా బేస్‌...

‘‘ఇండియా కొవిడ్‌-19 క్లినికల్‌ రిసెర్చ్‌ కొలాబరేటివ్‌ నెట్‌వర్క్‌’’ పేరుతో ఐసీఎంఆర్‌ ఒక వ్యవస్థను రూపొందించింది. దాని ద్వారా.. అన్ని రాష్ట్రాల్లోని ఆస్పత్రుల నుంచి కొవిడ్‌-19 పేషెంట్లు, వారికి అందిస్తున్న చికిత్స, ఫలితాల వివరాలను సేకరిస్తోంది. ఐసీఎంఆర్‌ కూడా సర్వేలను నిర్వహిస్తోంది. వీటన్నిటి ద్వారా వచ్చిన సమాచారాన్ని ఒక సెంట్రల్‌ డేటాబే్‌సలో నిక్షిప్తం చేస్తోంది. ఆ వివరాలను.. ఎప్పటికప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసే మార్గదర్శకాలను క్రోడీకరించి, మన దేశ పరిస్థితులకు తగినట్టుగా క్లినికల్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోటోకాల్స్‌ను రూపొందిస్తోంది. కరోనా చికిత్సల తాలూకూ పరిశోధనలో కూడా ఆ సమాచారాన్ని వినియోగిస్తోంది. కొత్త సాంకేతిక పరికరాలను, ఉత్పత్తులను, ఔషధాలను పరిశీలించేందుకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ, కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రిసెర్చ్‌ (సీఎ‌స్‌ఐఆర్‌) వంటివాటితో ఐసీఎంఆర్‌ కలిసి పనిచేస్తోంది. ఉదాహరణకు.. కొవిడ్‌-19పై  హెర్బల్‌ ఔషధాల ప్రభావాన్ని పరిశీలించేందుకు ఐఐఐఎం(జమ్ము), నేషనల్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌(బెంగళూరు) వంటివాటితో కలిసి పనిచేస్తోంది. సింథటిక్‌ మాలిక్యూల్స్‌/డ్రగ్స్‌ వంటివాటిపై పరిశోధనలు చేస్తూనే.. ఆయుర్వేదం, హోమియోపతి, సిద్ధ వంటివాటి ద్వారా కొవిడ్‌-19 ప్రభావాన్ని తగ్గించే అవకాశాలనూ పరిశీలిస్తోంది. శానిటైజర్లు, డయాగ్నొస్టిక్‌ పరికరాలు, వెంటిలేటర్ల వంటి సహాయ ఉపకరణాలు, యూవీ ఆధారిత పరికరాలు, పీపీఈ కిట్లు.. చివరికి కృత్రిమ మేధతో పనిచేసే పరికరాలు, మొబైల్‌ యాప్స్‌.. ఇలా ప్రతి అంశంపైనా దేశంలోని పలు ప్రతిష్ఠాత్మక సంస్థలతో కలిసి ఐసీఎంఆర్‌ పనిచేస్తోంది.


వ్యాప్తి ఆగదు.. 

లక్షణాలున్నవారికే పరీక్షలు చేయాలంటూ ఐసీఎంఆర్‌ జారీ చేసిన మార్గదర్శకాల నేపథ్యంలో.. దేశంలోని చాలా రాష్ట్రాలు కొవిడ్‌-19 టెస్టుల సంఖ్య భారీగా తగ్గించేస్తున్నాయి. అయితే, పరీక్షలు చేయనంతమాత్రాన వైరస్‌ వ్యాప్తి ఆగదని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదాహరణకు.. మనదేశంలో ఢిల్లీ, ముంబైల్లో వైరస్‌ వ్యాప్తి చాలా ఎక్కువగా ఉంది. కానీ.. రెండు చోట్లా కరోనా పరీక్షలను ఎక్కువగా చేయట్లేదు. అయినా కూడా అక్కడ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్నాయి. దీనికి కారణం.. చేస్తున్న పరీక్షల్లోనే ఎక్కువ మందికి పాజిటివ్‌ రావడం. ఢిల్లీలో ఈ పాజిటివ్‌ రేటు 25.7శాతంగా ఉంది. కొన్ని జిల్లాల్లో అయితే 40% దాకా కూడా ఉంది. గతంలో ఢిల్లీలో ఈ రేటు చాలాకాలంపాటు 10 శాతంగా ఉంది. మహారాష్ట్రలో ఈ సగటు చాలాకాలంపాటు 14 శాతంగా ఉండేది. గత ఏడురోజుల్లో మహారాష్ట్రలో పాజిటివ్‌ రేటు 20 శాతానికి పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. మిగతా రాష్ట్రాల్లోనూ ఈ రేటు పెరుగుతోంది. 


సంఖ్య కాదు.. ఎక్కడ చేస్తున్నాం?

దేశవ్యాప్తంగా రోజూ లక్షకు పైగా పరీక్షలు చేస్తున్నట్టు ఐసీఎంఆర్‌ చెబుతున్నప్పటికీ.. అలా చేయడం వల్ల ఉపయోగం లేదన్నది వైద్యనిపుణుల మాట. దానికి బదులు.. మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్‌ వంటి రాష్ట్రాల్లో వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వీలైనన్ని ఎక్కువ పరీక్షలు నిర్వహించి, పాజిటివ్‌ వచ్చినవారందరినీ క్వారంటైన్‌ చేస్తేనే వ్యాప్తి తగ్గుతుందని వారు సూచిస్తున్నారు. ఢిల్లీలో ఎలాంటి లక్షణాలూ లేని వ్యక్తులకు పరీక్షలు చేశారంటూ ప్రైవేటు ల్యాబులకు ప్రభుత్వం నోటీసులిచ్చింది. నిజానికి మనదేశంలో వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి లాక్‌డౌన్‌ రూపంలో దాదాపు రెండు నెలల అమూల్యమైన సమయం దొరికింది. వైద్యవ్యవస్థలను సంసిద్ధం చేయడానికి సరిపోయే సమయమిది. కానీ.. ఆ పని జరగకపోగా, పరీక్షలను నియంత్రించడం ద్వారా తక్కువ కేసులు చూపే ప్రయత్నం జరగడం ఆందోళనకరం. ఇప్పుడిక లాక్‌డౌన్‌ విధించడం కష్టం. లాక్‌డౌన్‌ చేసిన పనినే పరీక్షలూ చేస్తాయి. ఎలాగంటే.. లాక్‌డౌన్‌ చేయడం వల్ల ప్రజలు ఎక్కువగా బయటకు రాలేదు. దీనివల్ల కేసులు పెరగలేదు. పరీక్షలు చేస్తే ఎంతమందికి వైరస్‌  సోకిందో తెలుస్తుంది. వారందరినీ క్వారంటైన్‌ చేస్తే మిగతావారికి సోకే ముప్పు తగ్గుతుంది. ఎక్కువ పరీక్షలు చేయడం ద్వారా ఏ ప్రాంతాల్లో ఎక్కువ కేసులున్నాయి? తదితర వివరాలు తెలుస్తాయి. మరింత పటిష్టమైన మార్గదర్శకాలను రూపొందించుకోవడానికి ఆ వివరాలు ఉపకరిస్తాయని ఎపిడమాలజీ నిపుణులు పేర్కొంటున్నారు.


పేద, మధ్యతరగతి వారి మాటేమిటి?

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రాష్ట్రంలో కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు కరోనా లక్షణాలున్నవారిని తొలుత మామూలుగా చేర్చుకుని.. వారికి వైరస్‌ సోకిన లక్షణాలున్నట్టు నమోదు చేసి, నమూనా తీసి ప్రభుత్వ ఆస్పత్రులకు పరీక్షల నిమిత్తం పంపిస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నేరుగా టెస్టులు చేయకపోవడం.. ప్రైవేటు ల్యాబుల్లో చేయించుకోనీయకుండా అడ్డుపడడం వల్ల వచ్చిన సమస్య ఇది. దీనివల్ల అనుమానితులకు ఆస్పత్రి ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో రెండు-మూడు రోజులు ఉండడం అంటే వేలాది రూపాయల ఖర్చు. అయినా కూడా.. వైరస్‌ సోకిందన్న అనుమానం ఉన్న ధనికులు ఈ దొడ్డిదారి పద్ధతిని ఎంచుకుని తమ సందేహాన్ని తీర్చుకుంటున్నారు. మరి.. అంత స్థోమత లేని పేద, మధ్యతరగతి వారి పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్నకు సమాధానం లేదు.

సెంట్రల్‌ డెస్క్‌, స్పెషల్‌ డెస్క్‌

Updated Date - 2020-06-07T06:58:38+05:30 IST