చైనాపై చర్యలు తీసుకోండి : యూఎన్‌హెచ్ఆర్‌సీకి ఐసీజే విజ్ఞప్తి

ABN , First Publish Date - 2020-04-04T20:40:38+05:30 IST

కోవిడ్-19 మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ న్యాయకోవిదుల మండలి

చైనాపై చర్యలు తీసుకోండి : యూఎన్‌హెచ్ఆర్‌సీకి ఐసీజే విజ్ఞప్తి

జెనీవా (స్విట్జర్లాండ్) : కోవిడ్-19 మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ న్యాయకోవిదుల మండలి (ఐసీజే) సంచలన డిమాండ్ చేసింది. ఈ వైరస్ జన్మస్థలమైన చైనాపై చర్యలు తీసుకోవాలని ఐక్య రాజ్య సమితి మానవ హక్కుల మండలి (యూఎన్‌హెచ్ఆర్‌సీ)ని కోరింది. ప్రాణాంతక కరోనా వైరస్‌ను ప్రపంచంలో వ్యాపింపజేయడం ద్వారా మానవాళికి వ్యతిరేకంగా చైనా తీవ్రమైన నేరాలకు పాల్పడిందని ఆరోపించింది. ఈ వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది మరణించారని పేర్కొంది. ప్రపంచ దేశాలకు చైనా నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది.


యూఎన్‌హెచ్ఆర్‌సీకి లండన్‌లోని ఐసీజే అధ్యక్షుడు, ఆలిండియా బార్ అసోసియేషన్ చైర్మన్ అదిష్ సీ. అగర్వాలా ఫిర్యాదు చేశారు. కోవిడ్-19ను వ్యాపింపజేయడం ద్వారా మానవాళికి పెను విపత్తు సంభవించడానికి చైనా కారణమైందని,  అందువల్ల ప్రపంచ దేశాలకు అసాధారణ నష్టపరిహారం చెల్లించాలని చైనాను ఆదేశించాలని కోరారు. మరీ ముఖ్యంగా భారత దేశానికి భారీ నష్టపరిహారం చెల్లించాలని చైనాను ఆదేశించాలని డిమాండ్ చేశారు. 


కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు వ్యాపించకుండా నిరోధించడంలో చైనా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిందని ఆరోపించారు. చైనా ప్రభుత్వ ఉదాసీనత వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఏర్పడిందన్నారు. లక్షల కోట్ల డాలర్ల నష్టం జరిగిందని, భారత దేశంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగులయ్యారని తెలిపారు. 


ప్రపంచంలో పెద్దన్న స్థాయికి చేరాలనేది చైనా లక్ష్యమని, కోవిడ్-19ను మహమ్మారి వ్యాధిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించడం వెనుక ప్రధానంగా చైనా కుట్ర ఉందని ఆరోపించారు. జీవ సంబంధ యుద్ధం ద్వారా ప్రపంచంలోని ఇతర దేశాలను అణగదొక్కి, తాను ప్రపంచంలో పెద్దన్న స్థాయికి చేరుకోవాలనేది చైనా లక్ష్యమని పేర్కొన్నారు. కరోనా వైరస్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థను, ఇతర దేశాలను అప్రమత్తం చేయడంలో చైనా ప్రభుత్వం, నాయకులు తీవ్ర నిర్లక్ష్యం వహించారని, అసమర్థత ప్రదర్శించారని పేర్కొన్నారు.


ఐక్య రాజ్య సమితి ఛార్టర్లు, మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ ఈ మహమ్మారి పట్ల చైనా వ్యవహరించిందని ఆరోపించారు.



నోవల్ కరోనా వైరస్ గత ఏడాది నవంబరులో చైనాలోని వూహన్‌లో మొదట కనిపించిన సంగతి తెలిసిందే. ఇది ప్రపంచవ్యాప్తంగా సుమారు 12 లక్షల మందికి సోకినట్లు తాజా సమాచారం. 


Updated Date - 2020-04-04T20:40:38+05:30 IST