న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ డిసెంబరు త్రైమాసికానికి రూ.6,536.55 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని నమోదు చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసిక లాభం రూ.5,498.15 కోట్లతో పోల్చితే వృద్ధి 18.8 శాతంగా ఉంది. వడ్డీ ఆదాయంలో పెరుగుదల, కేటాయింపుల్లో తగ్గుదల లాభంలో వృద్ధికి దోహదపడింది. త్రైమాసిక సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం రూ.40,419 కోట్ల నుంచి రూ.39,865.80 కోట్లకు తగ్గింది. ఇక స్టాండ్ఎలోన్ ప్రాతిపదికన బ్యాంక్ నికర లాభం 25 శాతం పెరిగి రూ.6,194 కోట్లుగా నమోదైంది. 2020 అక్టోబరు-డిసెంబరులో ఇది రూ.4,939.59 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం రూ.24,416 కోట్ల నుంచి రూ.27,069.67 కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో నికర వడ్డీ ఆదాయం 23 శాతం వృద్ధితో రూ.9,912 కోట్ల నుంచి రూ.12,236 కోట్లకు ఎగబాకింది. స్థూల నిరర్ధక ఆస్తులు (ఎన్పీఏ) 4.38 శాతం నుంచి 4.13 శాతానికి తగ్గా యి. డిసెంబరు త్రైమాసికంలో నికర ఎన్పీఏలు 0.85 శాతం ఉండగా.. 2020-21 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 0.63 శాతం ఉన్నాయి. సమీక్షా కాలంలో నికర వడ్డీ మార్జిన్ 3.67 శాతం నుంచి 3.96 శాతానికి పెరిగింది.