విడుదలైన ICET కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌.. ఎప్పటి నుంచి అంటే..

ABN , First Publish Date - 2021-10-28T15:06:03+05:30 IST

ఐసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌..

విడుదలైన ICET కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌.. ఎప్పటి నుంచి అంటే..

ఎంబీఏ, ఎంసీఏ సీట్ల భర్తీ ప్రక్రియ షురూ

ఉన్నత విద్యామండలి ప్రకటన


హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): ఐసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైంది. రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ సీట్ల భర్తీ ప్రక్రియను నవంబరు 3వ తేదీ నుంచి చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశ షెడ్యూల్‌ను అనుసరించి... నవంబరు 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు అభ్యర్థులు కౌన్సెలింగ్‌ స్లాట్‌లను నమోదు చేసుకోవాలి. అదే సమయంలో ప్రాసెసింగ్‌ ఫీజులను చెల్లించాల్సి ఉంటుంది. 6 నుంచి 10వ తేదీల మధ్య సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ఉంటుంది. నవంబరు 6 నుంచి 11వ తేదీ వరకు ఇంటర్నెట్‌ ద్వారా ఆప్షన్లను నమోదు చేసుకోవాలి. 11వ తేదీలోగా ఆప్షన్లను ఫ్రీజ్‌ చేయాలి. నవంబరు 14వ తేదీన అభ్యర్థులకు సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు 14-18 తేదీల మధ్య ట్యూషన్‌ ఫీజులను చెల్లించి, వెబ్‌సైట్‌ ద్వారా సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలి. రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో సుమారు 35వేల సీట్లు ఉన్నాయి. ఇందులో దాదాపు 23వేల సీట్లను కన్వీనర్‌ కోటా పరిధిలో భర్తీ చేయనున్నారు. మిగిలిన సీట్లను ఆయా కాలేజీలు మేనేజ్‌మెంట్‌ కోటా పరిధిలో భర్తీ చేసుకోనున్నాయి. ఈ ఏడాది ఐసెట్‌లో సుమారు 51 వేల మంది అభ్యర్థులు అర్హతను సాధించిన విషయం తెలిసిందే.


నవంబరు 21 నుంచి రెండో దశ

ఐసెట్‌ రెండో దశ కౌన్సెలింగ్‌లో భాగంగా నవంబరు 21న స్లాట్‌లను నమోదు చేసుకోవాలి. 22న సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ నిర్వహిస్తారు. 22, 23 తేదీల్లోవెబ్‌ ఆప్షన్లను నమోదు చేసుకోవాలి. 26న సీట్లను కేటాయిస్తారు. ఈ దశలో సీట్లు పొందిన అభ్యర్థులు 28వ తేదీలోపు ట్యూషన్‌ ఫీజు చెల్లించాలి. నవంబరు 27 నుంచి 29 మధ్య సీటు పొందిన కాలేజీకి వెళ్లి రిపోర్ట్‌ చేయాలి. మిగిలిపోయిన సీట్ల భర్తీ కోసం ప్రైవేటు కాలేజీలు నవంబరు 28న స్పాట్‌ అడ్మిషన్లను చేపట్టనున్నాయి. ఐసెట్‌ కౌన్సెలింగ్‌పై బుధవారం ఉన్నత స్థాయి కమిటీ సమావేశమై నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సాంకేతిక విద్యా శాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌, ఉన్నత విద్యా మండలి కార్యదర్శి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-28T15:06:03+05:30 IST