28 వరకు తేల్చండి

ABN , First Publish Date - 2021-06-02T08:38:44+05:30 IST

టీ20 ప్రపంచకప్‌ నిర్వహణపై ఓ నిర్ణయానికి వచ్చేందుకు నెల రోజుల సమయం ఇవ్వాలన్న బీసీసీఐ విజ్ఞప్తిని ఐసీసీ మన్నించింది. దీంతో ఈనెల 28 వరకు గడువు లభించింది...

28 వరకు తేల్చండి

  • టీ20 ప్రపంచక్‌పపై బీసీసీఐకి గడువు
  • ఐసీసీ బోర్డు మీటింగ్‌

దుబాయ్‌: టీ20 ప్రపంచకప్‌ నిర్వహణపై ఓ నిర్ణయానికి వచ్చేందుకు నెల రోజుల సమయం ఇవ్వాలన్న బీసీసీఐ విజ్ఞప్తిని ఐసీసీ మన్నించింది. దీంతో ఈనెల 28 వరకు గడువు లభించింది. ఆలోగా ఈ టోర్నీ ఆతిథ్యంపై తుది నిర్ణయం తీసుకోవాలని సూచించింది. దేశంలో కరోనా ఇంకా భారీగానే ఉండడంతో ఏం చేయాలనే విషయంలో బోర్డు ఆచితూచి వ్యవహరించాలనుకుంటోంది. మంగళవారం వర్చువల్‌గా జరిగిన ఐసీసీ బోర్డు మీటింగ్‌లో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జై షా పాల్గొన్నారు. ఇందులో బీసీసీఐ అభ్యర్థనను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. అలాగే దేశంలో ఆరోగ్య పరిస్థితిపై సమగ్ర నివేదిక అందించాలన్నారు. ఇదిలావుండగా 2024-2031 క్రికెట్‌ షెడ్యూల్‌ను కూడా ఐసీసీ ప్రకటించింది. ఈమేరకు వన్డే వరల్డ్‌కప్‌లో 14 జట్లు, టీ20 వరల్డ్‌కప్‌లో 20 జట్లు పాల్గొ ననున్నాయి. 2025, 2029లో 8 జట్లతో కూడిన చాంపియన్‌షిప్‌ ట్రోఫీని తిరిగి ఆడించనున్నారు.

ప్రత్యామ్నాయంగా యూఏఈ: దేశంలో కరోనా థర్డ్‌ వేవ్‌ ప్రమాదం ఉంటే మాత్రం ఈ టోర్నీ యూఏఈలో జరుగుతుంది. అయితే ఆతిథ్య హక్కులు మాత్రం భారత్‌కే ఉండే అవకాశం ఉంది. బీసీసీఐ మాత్రం టీ20 ప్రపంచక్‌పను భారత్‌లో జరిపేందుకే మొగ్గు చూపిస్తోంది. అందుకే వచ్చే ఏడాది ఫిబ్రవరి విండో కోసం చూస్తోంది. కానీ అదే సమయంలో మహిళల వన్డే వరల్డ్‌కప్‌ ఉంటుంది కాబట్టి అది సాధ్యం కాకపోవచ్చు. 

Updated Date - 2021-06-02T08:38:44+05:30 IST