Abn logo
Jan 23 2021 @ 16:18PM

ఆపద కాలంలో ఆసరగా ఖతర్‌లో ప్రవాసీ బీమా పథకం

పేదల పక్షాన ప్రీమియం కోసం ఆంధ్ర సంఘాల ముందడుగు

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: ఖతర్‌లో పని చేస్తున్న కడప జిల్లా సుండుపల్లి మండలానికి చెందిన నాగమ్మ అనూహ్యంగా గ్యాస్ సిలిండర్ పేలి మరణించగా అమె సంపాదనపై ఆధారపడ్డ కూలీ పని చేసే భర్త నాగేశ్వర, ఇద్దరు చిన్నారుల భవిష్యత్తు అంధకారంగా మారింది. ఈ రకంగా అనేక మంది కుటుంబాల భవిష్యత్తు అనుకోని ప్రమాదాల కారణంగా అగమ్యగోచరంగా మారుతుంది. కుటుంబ పెద్దను కోల్పోయిన దుఖాన్ని ఏ పరిహారం కూడ పూడ్చలేదు. కానీ, మృత్యుకు పరిహారంగా కొంత ఆర్ధిక సహాయం లభిస్తే ఎంతో కొంత ఉపశమనం కల్గుతుంది. ఈ దిశగా ఖతర్‌లోని భారతీయ ఎంబసీ, ఐసీబీఎఫ్ ముందుకు వచ్చాయి.

ఖతర్‌లో పని చేస్తున్న ప్రవాస భారతీయ కార్మికుల సంక్షేమం కోసం ఉద్దేశించిన ఐసీబీఎఫ్ జీవిత బీమా పథకాన్ని విస్తరింప జేస్తున్నాయి. ఈ పథకం క్రింద దేశంలో పని చేస్తున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన కార్మికులకు కూడా ప్రయోజనం చేకూరనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రవాసీయులను ఈ పథకంలో చేర్పించడానికి ప్రవాసాంధ్ర నేత కేయస్ ప్రసాద్ ఆధ్వర్యంలో రాష్ట్రానికి చెందిన ప్రవాసీ ప్రముఖులు, సంఘాలు ప్రయత్నిస్తున్నాయి.


ఈ మేరకు బీమాకు సంబంధించి 20 వేల రియాళ్ళను ఖతర్‌లోని ఆంధ్రా కళా వేదిక(ఏవీకే), తెలుగు కళా సమితిలు సంయుక్తంగా తమ వంతుగా ఐసీబీఎఫ్ ప్రతినిధులకు అందజేశారు. ఏవీకే తరపున సత్యనారాయణ, ఎస్ఎస్ రావు, మూర్తి.. తెలుగు కళా సమితి తరపున కృష్ణకుమార్, శ్రీమతి కృష్ణ కుమార్లు దీనికి సంబంధించిన చెక్కును భారతీయ ఎంబసీ సీనియర్ దౌత్యవేత్త యస్ఆర్‌హెచ్ ఫహెమీకు ఐసీబీఎఫ్ నూతన అధ్యక్షుడు జియాద్ ఉస్మాన్, మాజీ అధ్యక్షుడు పీఎన్ బాబురాజన్, రజనీ మూర్తి, ఇతర ప్రతినిధుల సమక్షంలో అందజేయడం జరిగింది. మరికొన్ని ఇతర సంఘాలు కూడా కార్మికుల తరపున ప్రీమియం డబ్బు చెల్లించడానికి ఏర్పాట్లు చేస్తున్నాయి.

దురదృష్టవశాత్తు పాలసీదారుడు ఏ కారణంతోనైన మరణించినప్పటికి పాలసీ గడువులోపు ఒక లక్ష రియాళ్ళ(సుమారు 20 లక్షల రూపాయాలు)ను చెల్లించడం జరుగుతుంది. రెండు సంవత్సరాల వ్యవధి కల్గిన ఈ పాలసీ క్రింద 125 రియాళ్ళతో చేరవచ్చు. ప్రమాద సమయంలో గాయపడినప్పుడు శాశ్వత లేదా పాక్షిక అంగవైకల్యానికి గురైతే కూడా వైద్య నివేదికల ఆధారంగా పరిహారం చెల్లించబడుతుంది. 18 నుండి 65 సంవత్సరాల వయస్సు కల్గి, ఖతర్ వీసా ఉన్న వారు మాత్రమే దీనికి అర్హులు. నామిని పేరు, బ్యాంకు ఖాతా వివరాలను దరఖాస్తు చేసే సమయంలో ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మరణించిన మూడు నెలలలోపు క్లైం చేయాల్సి ఉంటుంది. ప్రవాసీయుడు సెలువులో ఉండి.. పాలసీ గడువులోపు భారతదేశంలో మరణించిన లేదా అంగవైకల్యం చెందినా కూడ క్లైం చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే, సంబంధిత సర్టిఫికెట్లను అటెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం 0097477867794, 0097450977090 నెంబర్లకు లేదా ఐసీబీఎఫ్ కార్యాలయంలో సంప్రదించవచ్చు.

Advertisement
Advertisement
Advertisement