ప్రపోజ్ చేశాడు...అంగీకరించాను...IAS topper టీనా దబీ వ్యాఖ్య

ABN , First Publish Date - 2022-04-20T12:47:15+05:30 IST

ఐఏఎస్ టాపర్ టీనా దబీ బుధవారం మరో ఐఎఎస్ అధికారి ప్రదీప్ గవాండేని వివాహం చేసుకోనున్నారు....

ప్రపోజ్ చేశాడు...అంగీకరించాను...IAS topper టీనా దబీ వ్యాఖ్య


 టీనా దబీ, ప్రదీప్ గవాండేల వివాహం 

జైపూర్(రాజస్థాన్): ఐఏఎస్ టాపర్ టీనా దబీ బుధవారం మరో ఐఎఎస్ అధికారి ప్రదీప్ గవాండేని వివాహం చేసుకోనున్నారు. వీరిద్దరి పెళ్లి కోసం సన్నాహాలు జోరందుకున్నాయి.ఐఎఎస్ పరీక్షలో టాపర్ అయిన టీనా దబీ బుధవారం జైపూర్‌లో డాక్టర్ ప్రదీప్ గవాండేతో రెండో పెళ్లి జరగనుంది.జైపూర్‌లో జరిగే ఈ హై-ప్రొఫైల్ వివాహానికి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, సీనియర్ బ్యూరోక్రాట్లు, ఇతర ప్రముఖులతో సహా పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు హాజరయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్ 22వతేదీన జైపూర్ నగరంలోని ఒక ఖరీదైన హోటల్‌లో తమ వివాహ రిసెప్షన్ కోసం ఈ జంట ఆహ్వానాలు పంపించింది.29 ఏళ్ల దబీ రెండోసారి పెళ్లి చేసుకోనుండగా, గవాండేకి ఇది మొదటి వివాహం. 


దబీకి గతంలో కశ్మీర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అథర్ అమీర్ ఉల్ షఫీ ఖాన్‌తో వివాహం జరిగింది. అయితే వారి వివాహం ఎక్కువ కాలం కొనసాగలేదు. ఈ జంటకు జైపూర్‌లోని ఫ్యామిలీ కోర్టు 2021 ఆగస్టులో విడాకులు మంజూరు చేసింది.ఏప్రిల్ 22న వివాహ రిసెప్షన్ జరగాల్సిన జైపూర్‌లోని ఫైవ్ స్టార్ హోటల్ సిబ్బంది వివాహ వేడుక వివరాల గురించి పెదవి విప్పటం లేదు.దబీ,గవాండేల కుటుంబాలు వీరిద్దరి వివాహాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు.2016 రాజస్థాన్ కేడర్‌కు చెందిన అధికారి దబీ, 2013 కేడర్‌కు చెందిన గవాండే ప్రస్తుతం జైపూర్‌లో విధులు నిర్వహిస్తున్నారు. 


టీనా దబీ ప్రస్తుతం రాజస్థాన్ ప్రభుత్వానికి ఆర్థిక (పన్ను) జాయింట్ సెక్రటరీగా ఉండగా, డాక్టర్ గవాండే రాజస్థాన్ రాజధానిలో ఆర్కియాలజీ, మ్యూజియంల డైరెక్టర్‌గా ఉన్నారు.ఇద్దరు ఐఎఎస్ అధికారులు కొవిడ్-19 మహమ్మారి సమయంలో కలిసి పనిచేశారు. ‘‘మేం కరోనా మహమ్మారి వ్యాప్తి సమయంలో కలుసుకున్నాం. గవాండే నాకు ప్రపోజ్ చేశాడు, నేను అతని ప్రతిపాదనను అంగీకరించాను’’ అని టీనాదబీ  చెప్పారు.కరోనా తమ ఇద్దరిని కలిపిందని టీనా చెప్పారు.


Updated Date - 2022-04-20T12:47:15+05:30 IST