ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు సీఎం గుప్పిట్లో!

ABN , First Publish Date - 2021-04-11T08:39:16+05:30 IST

రాష్ట్రంలోని ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎ్‌ఫఎస్‌ అధికారులంతా ఇకపై సీఎం జగన్‌ గుప్పిట్లోకి రానున్నారు. వారి వార్షిక పనితీరు నివేదికలను ఆమోదించే అధికారం ముఖ్యమంత్రికి

ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు సీఎం గుప్పిట్లో!

వార్షిక నివేదిక ఆమోదించే అధికారం ముఖ్యమంత్రికే

ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ 

గవర్నర్‌ కార్యదర్శికి మాత్రమే మినహాయింపు 

గతంలో 150మంది నివేదికలే సీఎం ఆమోదానికి

ఇప్పుడు వాటి సంఖ్య 465కు పెంచుతూ ఆదేశాలు 

స్వతంత్రంగా వ్యవహరించే అధికారులకు బ్రేకులు 

యువ ఐఏఎ్‌సలు, ఐపీఎ్‌సలకు కళ్లెం వేయడమే లక్ష్యం


అమరావతి, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎ్‌ఫఎస్‌ అధికారులంతా ఇకపై సీఎం జగన్‌ గుప్పిట్లోకి రానున్నారు. వారి వార్షిక పనితీరు నివేదికలను ఆమోదించే అధికారం ముఖ్యమంత్రికి దఖలుపరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో సీఎం ఆమోదించే నివేదికల సంఖ్య 150 లోపే ఉండేది. ఇప్పుడు ఏకంగా 465 మందికి సంబంధించిన నివేదికలపై అధికారం ముఖ్యమంత్రి చేతిలో పెట్టేశారు. అత్యున్నత స్థాయిలో ఉండే సీనియర్‌ అధికారుల నుంచి క్షేత్రస్థాయిలో పనిచేసే జాయింట్‌ కలెక్టర్లు, సబ్‌ కలెక్టర్లు, అదనపు ఎస్పీలు అందరూ ఈ జాబితాలోకే వస్తారు.


అయితే ప్రభుత్వ నిర్ణయంపై ఐఏఎస్‌, ఐపీఎస్‌ వర్గాల్లోనే తీవ్ర వ్యతిరేకత వస్తోంది. అఖిల భారత సర్వీసు అధికారులు రాజకీయాలతో సంబంధం లేకుండా విధులు నిర్వహిస్తుంటారు. కీలక స్థానాల్లో ఉన్న సీనియర్‌ అధికారులు ఎలాగూ ప్రభుత్వం మాట వినక తప్పదు. వారి వార్షిక పనితీరు నివేదిక ఆమోదం సీఎం చేతిలోనే ఉంటుంది. అయితే అప్పుడే శిక్షణ పూర్తి చేసుకున్నవారు, రెండు మూడేళ్లు సర్వీసు పూర్తి చేసినవారు సమాజానికి ఏదో చేయాలన్న తపనతో రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తుంటారు. యువ అధికారులను ప్రోత్సహించే ఉద్దేశంతో కీలక స్థానాల్లో ఉన్నవారు అంతర్గతంగా వీరికి మద్దతిస్తారు. అయితే ఇప్పుడు క్షేత్రస్థాయి అఽధికారుల వరకూ అందరినీ సీఎం పరిధిలోకే తీసుకురావడం అఖిల భారత సర్వీసు అధికారులను గుప్పిట్లో పెట్టుకోవడమే అన్న విమర్శలు వస్తున్నాయి.


సీఎంఓలో చక్రం తిప్పుతున్న ఓ అధికారి అడ్డగోలుగా ఇస్తున్న మౌఖిక ఆదేశాలకు క్షేత్రస్థాయిలో ఉన్న యువ ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు తలొగ్గడం లేదని సమాచారం. నిబంధనల ప్రకారమే నడుచుకుంటామని వారు తేల్చి చెప్పేస్తున్నారు. ఇలాంటి వారందరికీ ముకుతాడు వేసేందుకే వారి వార్షిక పనితీరు నివేదికలను ఆమోదించే అధికారం సీఎంకు కట్టబెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దాదాపు 465 మంది అధికారుల వార్షిక పనితీరు నివేదికలను ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించి ఆమోదించడం సాధ్యమయ్యే పని కాదు. సీఎంఓలో కీలకంగా వ్యవహరిస్తున్న అధికారులే ఆ పని పూర్తి చేస్తారు. క్షేత్రస్థాయి యువ అధికారులపై పట్టుకోసం సదరు అధికారే ఈ పని చేయించి ఉంటారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 

150 నుంచి 465కు పెంపు

గతంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎంవో కార్యాలయ కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు తదితర సీనియర్‌ ఐఏఎ్‌సలతో పాటు డీజీపీ, అదనపు డీజీపీ, సీఐడీ, ఏసీబీ ఉన్నతాధికారులు, ఎస్పీలు, కమిషనర్ల వార్షిక నివేదికల్ని ఆమోదించే అధికారం ముఖ్యమంత్రికి ఉండేది. వీరంతా కలిపి 150మంది లోపే ఉండేవారు. అయితే ఇప్పుడు కలెక్టర్లు, సబ్‌ కలెక్టర్లు, జేసీలు, సీఆర్‌డీఏ అదనపు కమిషనర్లు, ఐటీడీఏ పీవోలు, పోలీసు శాఖలో అదనపు ఎస్పీలు ఇలా అందరినీ సీఎం పరిధిలోకి తెచ్చేశారు. దీంతో ఈ సంఖ్య ఏకంగా 465కు పెరిగినట్లు సమాచారం. ఒక అధికారి భవిష్యత్తులో ఎలాంటి పోస్టులకు పనికొస్తారో వార్షిక నివేదిక ఆధారంగా నిర్ధారిస్తారు. జాయింట్‌ కలెక్టర్‌ ఎలాంటి పోస్టుకు పనికొస్తాడనే విషయమై ఆ జిల్లా కలెక్టర్‌కు లేదా సీఎ్‌సకు అవగాహన ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ అధికారం సీఎం చేతికి అప్పగించారు. తమ మాట విన్నవారికి ఒకలా, వినని వాళ్లకు వేరేవిధంగా ఉంటుందనే భయం కల్పించడమే ఈ నిర్ణయం వెనుక అసలు ఉద్దేశమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


సీఎస్‌ అధికారాలకు కత్తెర  

ఇదివరకు చాలామంది ఐఏఎస్‌ అధికారులకు సంబంధించిన వార్షిక నివేదికలు ఆమోదించే అధికారం సీఎ్‌సకే ఉండేది. ఇప్పుడు ఆయన అధికారం కూడా తగ్గించేసినట్లే. సీఎ్‌సకు అధికారంతోపాటు బాధ్యత కూడా ఉంటుంది. అన్ని ఫైళ్లపై సంతకాలు ఆయనే పెట్టాల్సి ఉంటుంది. అయితే సీఎం కార్యాలయంలో చక్రం తిప్పుతున్న అధికారికి అధికారం ఎక్కువ... బాధ్యత తక్కువ. ఆయన తప్పు చేసినా బాధ్యత మాత్రం సీఎ్‌సదే. ఇప్పుడు అపరిమిత అధికారం ఉన్న సదరు అధికారి చేతికి మరింత అధికారం ఇవ్వడంతోపాటు సీఎస్‌ చేతినుంచి కొంత అధికారం లాగేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 


అంతా సీఎం చేతిలోనే...

ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎ్‌ఫఎస్‌ అధికారులందరి వార్షిక పనితీరు నివేదికలను ఇకనుంచి ముఖ్యమంత్రే ఆమోదించనున్నారు. కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, హెచ్‌వోడీలు, సీఎంఓ కార్యదర్శులు, ఐపీఎస్‌ అధికారులు, ఐఎ్‌ఫఎస్‌ అధికారులు ఇలా ఏ అధికారి, ఎవరికి తన నివేదికను సమర్పించాలి, ఎవరు పరిశీలించాలి, ఎవరు ఆమోదించాలన్నదానిపై మార్గదర్శకాలు జారీ చేశారు. అందరు అధికారుల తుది నివేదికను ఆమోదించాల్సింది ముఖ్యమంత్రే అని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ నివేదికల  ఆధారంగానే వారి భవిష్యత్తు పోస్టింగ్‌లు, కేంద్ర సర్వీసులకు వెళ్లడం తదితర అంశాలు కూడా ఆధారపడి ఉంటాయి. అయితే గవర్నర్‌ కార్యదర్శికి సంబంధించిన వార్షిక పనితీరు నివేదికను మాత్రం స్వయంగా గవర్నర్‌ ఆమోదిస్తారు. 

Updated Date - 2021-04-11T08:39:16+05:30 IST