ఐఏఎస్ చంద్రశేఖర్ శాఖమూరి.. 100 రోజుల్లోనే ప్రజల కలెక్టర్‌గా మన్ననలు!

ABN , First Publish Date - 2020-10-12T01:11:17+05:30 IST

నిరంతరం ప్రజల్లో ఉంటేనే వారి సమస్యలు తెలుస్తాయని నమ్మే ఐఏఎస్ చంద్రశేఖర్ శాఖమూరి.

ఐఏఎస్ చంద్రశేఖర్ శాఖమూరి.. 100 రోజుల్లోనే ప్రజల కలెక్టర్‌గా మన్ననలు!

కడలూర్: నిరంతరం ప్రజల్లో ఉంటేనే వారి సమస్యలు తెలుస్తాయని నమ్మే ఐఏఎస్ చంద్రశేఖర్ శాఖమూరి. అందుకు అనుగుణంగానే ఆయన కడలూర్ జిల్లా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ నిత్యం ప్రజలతో మమేకమయ్యారు. వారి సమస్యలను తెలుసుకుని సత్వర పరిష్కారాల కోసం కృషి చేస్తూ ప్రజల కలెక్టర్‌గా జిల్లా వాసుల మన్ననలకు పాత్రులయ్యారు. జిల్లా బాధ్యతలు చేపట్టి ఇటీవలే ఆయన వంద రోజులు పూర్తి చేసుకున్నారు. అయితే.. కేవలం 100 రోజుల్లోనే తమిళ ప్రజల మనసులు గెలిచిన చంద్రశేఖర్ శాఖమూరి మన తెలుగు వారే..!


2011 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి చంద్రశేఖర్ శాఖమూరి స్వస్థలం గుంటూరు జిల్లాలోని వీరాపురం గ్రామం. ఆ తరువాత వారి కుటుంబం హైదరాబాద్‌కు పయనమైంది. ఆయన ఇంజినీరింగ విద్యలో పట్టభద్రులు. మద్రాస్‌ యూనివర్శిటీ నుంచి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. అనంతరం.. న్యూఢిల్లీలోని ఐఐఎఫ్‌టీ నుంచి అంతర్జాతీయ వాణిజ్యంలో మాస్టర్స్ డిగ్రీ పొందారు. 2007లో ఆయన యూపీఎస్సీ పరీక్ష ఉత్తీర్ణులై ఇండియన్ ట్రేడ్ సర్వీసెస్‌కు ఎంపియ్యారు. 


తిరునెల్వెలీ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్‌గా ఆయన వృత్తి జీవితం ప్రారంభమైంది. ఆ తరువాత తమిళనాడులో అనేక ప్రభుత్వ శాఖలో వివిధ స్థాయిల్లో సేవలందించారు. టౌన్ ప్లానింగ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, సెరీకల్చర్ వంటి అనేక శాఖల్లో విధులు నిర్వర్తించారు. తమిళనాడు ఉపముఖ్యమంత్రికి సెక్రెటరీగా కూడా విధులు నిర్వర్తించారు. 



కాగా..కడలూర్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన తొలిరోజు నుంచే ఆయన ప్రజల వద్దకు పాలన తీసుకెళ్లారు. నిత్యం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుకునే వారు. జిల్లాలో కరోనా కట్టడి కోసం ఆయన పటిష్ట చర్యలు తీసుకున్నారు. ఇంటింటీ సర్వే చేపట్టి కరోనా అనుమానితులను వారిని కలుసుకున్న వారిని గుర్తించి కరోనా సంక్షోభాన్ని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ సమయంలో జిల్లాలోని కరోనా బెడ్లు 1700 నుంచి ఏకంగా 7400కు చేరుకున్నాయి. అలాగే..ఆస్పత్రులకు ఆక్సిజన్ సరఫరాలో ఎటువంటి అంతరాయం కలుగకుండా అనేక చర్యలు తీసుకున్నారు.


చంద్రశేఖర్ శాఖమూరి కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టకమునుపు.. కరోనా టెస్టు కోసం జిల్లాలో రోజుకు 2400  శాంపిళ్లను సేకరించగా.. ఆ తరువాత శాంపిళ్ల సంఖ్య క్రమంగా లక్షకు చేరుకుంది. దీంతో ప్రతిరోజు నమోదయ్యే కేసుల సంఖ్య కూడా 500కు చేరుకుంది. అయితే జిల్లా యంత్రాంగం చేపట్టిన పటిష్ట చర్యల కారణంగా రోజువారి కేసుల సంఖ్య 120కి నెమ్మదించింది.


జిల్లాలో అధికశాతం మంది ప్రజలకు వ్యవసాయమే ఆధారం కావడంతో..ఆయన లాక్ డౌన్ సమయంలోనూ అనేక చర్యలు చేపట్టారు. ధాన్యం సేకరణ కోసం అప్పట్లో 15 కేంద్రాలు ఉండగా వాటి సంఖ్యను 93కు పెంచారు. ప్రభుత్వమే దాదాపు 60 వేల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో అనేక మంది రైతులకు కనీస మద్దతు ధర లభించింది. మరోవైపు..సాంబ రకం వరి సాగు కోసం ఆయన సెప్టెంబర్ నెలలో విడుదలయ్యే సాగు నీరును ఆగస్టు నెలలోనే విడుదల చేసి రైతుల ఆనందానికి కారణమయ్యారు.


 ఇక లాక్ డౌన్ సమయంలో రైతుల సమస్యలు పరిష్కరించేందుకు ఆయన వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమావేశాలు నిర్వహించారు. ఇక రుతుపవానాల సమయంలో హైరిస్క్ ప్రాంతాలను వరదల ప్రమాదాన్ని నివారించేందుకు జిల్లా యంత్రాంగం మౌలిక వసతులు, ఇతర ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంచింది. మరోవైపు.. కరోనా కారణంగా ప్రభావితమైన విద్యారంగంపైనా ఆయన ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.


గత ఏడాది జిల్లాలో పన్నేండో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 86.33గా ఉండగా..ఈ ఏడాది 100 శాతం ఉత్తీర్ణత సాధించాలనే లక్ష్యాన్ని ఆయన జిల్లా విద్యాశాఖాధికారులకు నిర్దేశించారు. ఈ దిశగా ఆయన అధికారులతో, ఉపాధ్యాయులతో అనేక సమావేశాలు నిర్వహించారు. చదువులో వెనుకబడ్డ విద్యార్థుల కోసం ప్రత్యేక మెంటార్‌షిప్ కార్యక్రమాన్ని కూడా ఆయన ప్రతిపాదించారు. కాగా..విద్యపై జిల్లా యంత్రాంగం అధిక దృష్టి పెడ్డడంతో ఈ ఏడాది విద్యాసంవత్సరం శుభారంభానే చూసింది. జిల్లాలో 68 వేల పైచిలుకు కొత్త అడ్మిషన్లు జరగ్గా..మరో 11 వైల పైచిలుకు విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు గుడ్‌బై చెప్పి..ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు.  


Updated Date - 2020-10-12T01:11:17+05:30 IST