ట్రంప్ ప్రభుత్వం వల్ల నేనూ డిప్రెషన్‌తో బాధపడుతున్నా: మిచెల్ ఒబామా

ABN , First Publish Date - 2020-08-07T02:54:46+05:30 IST

ట్రంప్ ప్రభుత్వం కారణంగా తాను కూడా డిప్రెషన్‌తో బాధపడుతున్నానని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మిచెల్లీ ఒబామా...

ట్రంప్ ప్రభుత్వం వల్ల నేనూ డిప్రెషన్‌తో బాధపడుతున్నా: మిచెల్ ఒబామా

వాషింగ్టన్: ట్రంప్ ప్రభుత్వం కారణంగా తాను కూడా డిప్రెషన్‌తో బాధపడుతున్నానని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మిచెల్లీ ఒబామా తెలిపారు. ప్రస్తుతం దేశంలో ప్రబలుతున్న కరోనా మహమ్మారితో పాటు, వర్ణవివక్ష పరిస్థితులు తనను తీవ్రంగా కలచివేస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మిచెల్లీ ట్రంప్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అమెరికాలో నల్లవారు మానసికంగా అనుభవించే ఇబ్బందులన్నీ నాకు తెలుసు. నేను కూడా పరిస్థితుల వల్ల కొంత డిప్రెషన్‌కు లోనవుతున్నాను. అర్థరాత్రిళ్లు ఉలిక్కిపడి నిద్ర నుంచి మేలుకొంటున్నాను. మరికొన్ని సార్లు చుట్టుపక్కల పరిస్థితులను చూసి మానసికంగా ఆందోళన కలుగుతోంది. అయితే వీటన్నింటితో నేను పోరాడుతున్నాను. నాలానే ఇక్కడ అనేకమంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే ప్రభుత్వ విధానంలో మార్పు రావాల’ని మిచెల్లీ ఒబామా పేర్కొన్నారు. మిచెల్లీ వ్యాఖ్యలను అనేకమంది ట్విటర్ వేదికగా అభినందించారు. అమెరికాలోని పరిస్థితుల గురించి, డిప్రెషన్ గురించి బహిరంగంగా మాట్లాడినందుకు ఆమెను ప్రశంసించారు.

Updated Date - 2020-08-07T02:54:46+05:30 IST