చెరపట్టి చంపేస్తారేమో..? అప్ఘాన్ మహిళా సైనికుల ఆక్రందనలు

ABN , First Publish Date - 2021-08-17T19:04:37+05:30 IST

‘‘నాకు నా దేశం అంటే ఇష్టం. మేం తర్వాతి తరం అఫ్ఘానీయులం. ఆధునిక ప్రపంచంలోకి అడుగులేస్తున్నాం’’ ఇవీ కొన్నేళ్ల క్రితం ఆఫ్ఘాన్ సైన్యంలో చేరినప్పుడు ఆమె చెప్పిన మాటలు.

చెరపట్టి చంపేస్తారేమో..? అప్ఘాన్ మహిళా సైనికుల ఆక్రందనలు

కాబూల్: ‘‘నాకు నా దేశం అంటే ఇష్టం. మేం తర్వాతి తరం ఆఫ్ఘానీయులం. ఆధునిక ప్రపంచంలోకి అడుగులేస్తున్నాం’’ ఇవీ కొన్నేళ్ల క్రితం అఫ్ఘాన్ సైన్యంలో చేరినప్పుడు ఆమె చెప్పిన మాటలు. ఇప్పుడు అఫ్ఘనిస్థాన్ మొత్తం తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోవడంతో ఆమె మనసు నిండా భయం. మెదడు నిండా పిచ్చి ఆలోచనలు. తాలిబన్లకు తాను సైన్యంలో పనిచేసినట్లు తెలిస్తే అత్యాచారం చేసి, చంపేస్తారని ఆమె అంటోంది. ఆ మహిళ పేరు కుబ్రా బెహ్రోజ్. 33 ఏళ్ల ఈ ఫ్ఘానీ యువతి ఆ దేశపు సైన్యంలో పనిచేస్తోంది. ‘‘నేను ఎవరి సొత్తునూ కాదు. నా కాళ్లపై నేను నిలబడతా’’ అంటూ ఆడాళ్లు ఇంటి నుంచి బయటకు రాకూడదనే తరతరాల ఆచారాలను వెనక్కు నెట్టి సైన్యంలో చేరింది. ఇప్పుడు తనతోపాటు, కుటుంబాన్ని కూడా ప్రమాదంలోకి నెట్టానే అని బాధపడుతోంది.


అమెరికా, నాటో సైన్యాల సహకారంతో ఫ్ఘనిస్థాన్ సైన్యంలో మహిళల సంఖ్యను పెంచడానిక ప్రభుత్వం ప్రయత్నించింది. కనీసం 10 శాతం సైన్యాన్ని మహిళలతో నింపాలని భావించింది. కానీ తాలిబన్ల భయం, ఇతర ఆచారాలు, కుటుంబాల నియంత్రణ వంటి కారణాల వల్ల సైన్యంలో చేరడానికి మహిళలు ముందుకురాలేదు. ఇప్పటికి కూడా అఫ్ఘాన్ సైన్యంలో మహిళల వాటా కేవలం 1.3 శాతమే. ఇలా చేరిన వారిలో బెహ్రోజ్ కూడా ఒకరు.


ఇప్పుడు బెహ్రోజ్‌కు తెలిసిన వాళ్లంతా వచ్చి ఆమెను బెదిరిస్తున్నారట. తాలిబన్లు ‘‘నీ తల నరికేస్తారు’’ అని చెప్తున్నారట. ‘‘సైనికురాలిగా పని చేసినందుకు నన్ను కిడ్నాప్ చేసి బంధించి, అత్యాచారాలు చేస్తారని భయమేస్తోంది. నా భవిష్యత్తు, కుటుంబం భవిష్యత్తు ఏమవుతుందో అని ఆందోళనగా ఉంది’’ అని బెహ్రోజ్ అంటోంది. సైనికుడిగా ఘజ్నీ ప్రాంతంలో పనిచేస్తున్న బెహ్రోజ్ సోదరుడు ఆమె భయాలకు మరింత ఆజ్యం పోశాడు. ఇక్కడ జరిగిన పోరాటంలో గాయపడిన అతను.. నాలుగేళ్ల క్రితం పోలీసులుగా పనిచేశారని తెలియడంతో ఇద్దరు మహిళల తలలను తాలిబన్లు నరికేసినట్లు చెప్పాడు. 


చంపడానికి అసలు ఆలోచించరు..

తొలుత సైన్యంలో చేరిన బెహ్రోజ్ ఆ తర్వాత కొంతకాలానికి ఆ ఉద్యోగం వదిలేసింది. కానీ జీవనం కష్టంగా మారి, మరే ఉద్యోగమూ దొరక్కపోవడంతో మళ్లీ సైన్యంలోనే చేరాల్సి వచ్చిందట. ఇప్పుడు తనకు చాలా మంది ఫోన్లు చేస్తున్నారని చెప్పిన ఆమె.. పష్తో, దారిలో మాట్లాడుతూ తనను ఎలా పట్టుకోవాలో తెలుసంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని వెల్లడించింది. ‘‘వాళ్లు నన్ను, నా కుటుంబాన్ని నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు. చంపటం అనేది అఫ్ఘానిస్థాన్‌లో చాలా చిన్న విషయం. ఆ పని చేయడానికి వాళ్లు కనీసం ఆలోచించరు’’ అని ఆమె విషాదంగా చెప్పడం అఫ్ఘాన్ పరిస్థితులకు అద్దం పడుతోంది.


పెళ్లి పేరుతో అత్యాచారాలు!

తాలిబన్లు చాలా చోట్ల యువతులను బలవంతంగా అత్యాచారం చేసినట్లు సోషల్ మీడియాలో రిపోర్టులు వస్తున్నాయి. పెళ్లి పేరుతో ఈ అత్యాచారాలు జరిగినట్లు తెలుస్తోంది. జీనా అనే ఆచారం ప్రకారం, ఎవరైనా యువతి అత్యాచారానికి గురైతే.. ఆమెను అత్యాచారం చేసిన వ్యక్తికే ఇచ్చి వివాహం చేస్తారు.  ఒకవేళ ఆమె గనుక ఆ పెళ్లి చేసుకోకపోతే.. ఆ యువతి తప్పు చేసిందంటూ కుటుంబం, సమాజం ఆమెను వెలివేస్తుంది.

Updated Date - 2021-08-17T19:04:37+05:30 IST