Mi-17V5 Chopper : హెలికాప్టర్ ప్రమాద స్థలంలో బ్లాక్‌బాక్స్ లభ్యం..

ABN , First Publish Date - 2021-12-09T16:06:57+05:30 IST

బుధవారం నాడు తమిళనాడులో వైమానిక దళానికి చెందిన ఎంఐ-17వీ5 హెలికాప్టర్‌ కుప్పకూలిన విషయం తెలిసిందే.

Mi-17V5 Chopper : హెలికాప్టర్ ప్రమాద స్థలంలో బ్లాక్‌బాక్స్ లభ్యం..

న్యూ ఢిల్లీ : బుధవారం నాడు తమిళనాడులో వైమానిక దళానికి చెందిన ఎంఐ-17వీ5 హెలికాప్టర్‌ కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో త్రివిధ దళాల సారథి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) బిపిన్‌ రావత్‌తో పాటు ఆయన సతీమణి, పలువురు ఉన్నతాధికారులు అమరులయ్యారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది..? సాంకేతిక లోపాలేనా..? ఏదైనా కుట్ర ఉందా..? అనే విషయాలు ఇంతవరకూ తెలియరాలేదు. కారణాలేంటో తెలుసుకోవడానికి హెలికాప్టర్‌‌లో ఉండే బ్లాక్‌బాక్స్ కోసం ఢిల్లీ నుంచి వచ్చిన ఫోరెన్సిక్‌ బృందాలు ప్రమాదస్థలిలో వెతికాయి.


ప్రమాదానికి 30 అడుగుల దూరంలో బ్లాక్‌బాక్స్ లభ్యమైంది. ఆ బాక్స్‌ను ఆర్మీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బ్లాక్‌బాక్స్‌ను డీ-కోడింగ్‌ కోసం ఢిల్లీ ఎయిర్‌ఫోర్స్‌ నిపుణుల బృందం తీసుకెళ్లింది. కాగా.. ఇవాళ ఉదయం నుంచి వింగ్‌ కమాండర్‌ భరద్వాజ్‌ ఆధ్వర్యంలో బ్లాక్‌‌బాక్స్‌ కోసం సెర్చింగ్‌ జరిగింది. అయితే ఈ బ్లాక్‌బాక్స్ డీ కోడ్ చేస్తే అసలు ప్రమాదం ఎలా జరిగింది..? క్రాష్ అవ్వడానికి అరగంట ముందు ఏం జరిగింది..? అనే విషయాలు తెలుస్తాయి. సాధారణంగా బ్లాక్‌బాక్స్‌లో 13 గంటల పాటు నిడివి ఉన్న డేటా స్టోర్ అవుతుంది. ఇందులో పైలట్ల సంభాషణలు కూడా రికార్డయ్యే అవకాశముంది. ఈ బాక్స్ దర్యాప్తులో కీలకం కానుంది. మరోవైపు ప్రమాదస్థలానికి చేరుకున్న తమిళనాడు ఫోరెన్సిక్ బృందం ఘటన ఎలా జరిగిందన్న దానిపై నిశితంగా పరిశీలిస్తోంది.



Updated Date - 2021-12-09T16:06:57+05:30 IST